
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. 2003–05 మధ్య కాలంలో నమోదైన ఐపీవో అవకతవకల నుంచి సమీకరించిన నిధుల పంపిణీని మరోసారి చేపట్టింది. మూడో దశలో భాగంగా దాదాపు రూ. 15 కోట్లను 2.58 లక్షల ఇన్వెస్టర్లకు పంపిణీ చేయనుంది. ఈ బాటలో ఇప్పటికే 2010 ఏప్రిల్‌లో రూ. 23.28 కోట్లు, 2015 డిసెంబర్‌లో రూ. 18.06 కోట్లు ఇన్వెస్టర్లకు పంచిపెట్టింది.
పబ్లిక్ ఇష్యూల అక్రమాల కేసులలో భాగంగా సమీకరించిన నిధులను అర్హతగల ఇన్వెస్టర్లకు సెబీ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2003–05 మధ్య కాలంలో మొత్తం 21 ఐపీవోలకు సంబంధించి సెబీ అక్రమాలను గుర్తించింది. వీటిపై దర్యాప్తు పూర్తయ్యాక సంబంధిత వ్యక్తుల నుంచి చట్టవిరుద్ధంగా ఆర్జించిన లాభాలను రాబట్టే చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి డీపీ వాధ్వా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆదేశాల ప్రకారం సంబంధిత ఇన్వెస్టర్లకు నిధుల పంపిణీని చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment