
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌కు రిటైల్ ఇన్వెస్టర్లు అండగా నిలుస్తున్నారు. ఫండ్స్ నిర్వహణలోని రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2023 జనవరి నాటికి రూ.23.4 లక్షల కోట్లకు చేరాయి. 2022 జనవరి నాటికి ఉన్న రూ.21.40 లక్షల కోట్లతో పోలిస్తే 9.3 శాతం వృద్ధి చెందాయి. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) తాజా గణాంకాలను విడుదల చేసింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సంస్థల (ఇనిస్టిట్యూషనల్) పెట్టుబడులు ఏడాది కాలంలో రూ.17.49 లక్షల కోట్ల నుంచి, 2023 జనవరి చివరికి రూ.17.42 లక్షల కోట్లకు తగ్గాయి.
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్టర్లు చేసే పెట్టుబడుల్లో వృద్ధి, రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడానికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సిప్ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ప్రతి నెలా రూ.13,000 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వస్తుండడం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో సిప్ ద్వారా ఫండ్స్‌లోకి రూ.13,856 కోట్ల పెట్టుబడులు రాగా, 2022 డిసెంబర్ నెలలో రూ.13,573 కోట్లు రావడం గమనించాలి. మొత్తం మీద అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ జనవరి చివరికి రూ.40.80 లక్షల కోట్లకు చేరింది. 2022 జనవరికి ఉన్న రూ.38.89 లక్షల కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి చెందింది.