Investment Growth
-
ఇన్సూర్టెక్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు
న్యూఢిల్లీ: భారత ఇన్సూర్టెక్ రంగానికి గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయని ఒక నివేదిక తెలిపింది. గడిచిన కొన్నేళ్లలో ఈ రంగం 2.5 బిలియన్ డాలర్లు సమీకరించగా.. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తాయని అంచనా వేసింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), ఇండియా ఇన్సూర్టెక్ అసోసియేషన్ (ఐఐఏ) ఈ నివేదికను రూపొందించాయి.‘‘ప్రస్తుతం భారత్‌లో 150 ఇన్సూర్టెక్ కంపెనీలు (బీమా రంగ టెక్నాలజీ సంస్థలు) ఉన్నాయి. ఇందులో 10 యూనికార్న్‌లు, సూనికార్న్లు, 45కు పైగా మినీకార్న్లు ఉండగా, గడిచిన ఐదేళ్లలో ఆదాయం 12 రెట్లు పెరిగి 750 మిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం మీద ఈ రంగంలోకి వచ్చిన నిధులు 2.5 బిలియన్ డాలర్లు. దీంతో మొత్తం ఎకోసిస్టమ్ విలువ 13.6 బిలియన్ డాలర్లను అధిగమించింది’’అని ఈ నివేదిక వివరించింది. డిమాండ్, పంపిణీపై ఇన్సూర్టెక్లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని, అండర్ రైటింగ్ (రిస్క్‌ల మదింపు), క్లెయిమ్‌లు, సేవల్లో ఆవిష్కరణలకు గణనీయమైన అవకాశాలున్నట్టు ఈ నివేదిక అభిప్రాయపడింది. అపార అవకాశాలు.. గడిచిన ఐదేళ్లలో భారత ఇన్సూర్టెక్ రంగం ఆదాయం 12 రెట్లు పెరిగినప్పటికీ.. భవిష్యత్తులో మరింతగా వృద్ధి చెందే అవకాశాలున్నట్టు బీసీజీ, ఐఐఏ నివేదిక వెల్లడించింది. ‘‘అండర్ రైటింగ్, క్లెయిమ్‌లలో డేటా, టెక్నాలజీ సామర్థ్యాల ను వినియోగించుకునేందుకు ఇన్సూర్టెక్ కంపెనీలకు అపార అవకాశాలున్నాయి’’ అని బీసీజీలో ఇండియా ఇన్సూరెన్స్ ప్రాక్టీస్ లీడ్, ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన పల్లవి మలాని తెలిపారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ఇన్సూరెన్స్ పరంగా చెప్పుకోతగ్గ పురోగతి సాధించినప్పటికీ.. హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణ ఇప్పటికీ ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందన్నారు. 45 శాతం వైద్య చికిత్సల వ్యయాలను జేబుల నుంచే వ్యయం చేయాల్సి వస్తున్నట్టు వివరించారు. దీంతో 2047 నాటికి నూరు శాతం ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సాధించడంతోపాటు, జేబు నుంచి చేసే వ్యయాలను 10 శాతం లోపునకు పరిమితం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ నివేదిక సూచించింది. ఇక అంతర్జాతీయంగా ఇన్సూర్టెక్ రంగంలోకి నిధుల రాక తగ్గినట్టు, ఆసియా పసిఫిక్ ప్రాంతం ఈ విషయంలో బలంగా నిలబడినట్టు ఈ నివేదిక తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్స్‌కు రిటైలర్ల ‘జోష్’
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌కు రిటైల్ ఇన్వెస్టర్లు అండగా నిలుస్తున్నారు. ఫండ్స్ నిర్వహణలోని రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2023 జనవరి నాటికి రూ.23.4 లక్షల కోట్లకు చేరాయి. 2022 జనవరి నాటికి ఉన్న రూ.21.40 లక్షల కోట్లతో పోలిస్తే 9.3 శాతం వృద్ధి చెందాయి. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) తాజా గణాంకాలను విడుదల చేసింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సంస్థల (ఇనిస్టిట్యూషనల్) పెట్టుబడులు ఏడాది కాలంలో రూ.17.49 లక్షల కోట్ల నుంచి, 2023 జనవరి చివరికి రూ.17.42 లక్షల కోట్లకు తగ్గాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్టర్లు చేసే పెట్టుబడుల్లో వృద్ధి, రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడానికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సిప్ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ప్రతి నెలా రూ.13,000 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వస్తుండడం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో సిప్ ద్వారా ఫండ్స్‌లోకి రూ.13,856 కోట్ల పెట్టుబడులు రాగా, 2022 డిసెంబర్ నెలలో రూ.13,573 కోట్లు రావడం గమనించాలి. మొత్తం మీద అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ జనవరి చివరికి రూ.40.80 లక్షల కోట్లకు చేరింది. 2022 జనవరికి ఉన్న రూ.38.89 లక్షల కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి చెందింది. -
బంగారం బంగారమే!
నరసాపురం: ధరల పెరుగుదలలో ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేసుకుంటున్న బంగారం తనకేదీ సాటిలేదని నిరూపిస్తోంది. గడిచిన వందేళ్లను పరిగణనలోకి తీసుకుంటే బంగారం ధరలు 2వేల రెట్లు పెరిగాయి. ఆస్తుల విలువ పెరుగుదలకు సంబంధించి బంగారానికి మరేదీ పోటీకాదని స్పష్టమవుతోంది. 1917లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం కాసు ధర కేవలం 11 రూపాయల 8 పైసలు ఉంటే ప్రస్తుతం అదే కాసు ధర రూ.22,800. అలాగే, 1917లో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం 10 గ్రాములు రూ.15.20 ఉంటే, ఇప్పుడది రూ.30వేలు. అంటే గడచిన వందేళ్లలో బంగారం 2వేల రెట్లకు పైగానే పెరిగింది. మరోవైపు.. వందేళ్ల క్రితం భూముల ధరలు కూడా స్వల్పంగానే ఉండేవి. ఈ నూరేళ్లలో వందలు, వేలల్లో ఉండే భూముల ధరలు కోట్లల్లోకి మారినా.. అది అభివృద్ధిని బట్టి, ఆయా ప్రాంతాల పరిస్థితిని బట్టి కొన్ని ప్రాంతాలకే ఈ పెరుగుదల పరిమితమైంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టిన సదరు కంపెనీల లాభనష్టాల మీదే రాబడి ఆధారపడి ఉంటుందనేది తెలిసిందే. డిపాజిట్లు ఇతర రూపాల్లో కూడా పెట్టుబడి రెండు వేల రెట్లు పెరగడమనేది జరగని పని. దీంతో బంగారం ప్రధాన పెట్టుబడి వస్తువుగా మారిపోయింది. వందేళ్ల క్రితం బంగారంపై రూపాయి పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు చేతిలో 2 వేలు ఉన్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఒకప్పుడు అలంకరణలు, సామాజిక అవసరాలకు మాత్రమే బంగారం సమకూర్చుకోవాలని పరితపించే వారి దృక్పథంలో స్పష్టమైన మార్పు రావడంతో బంగారంపై పెట్టుబడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బంగారం ధరల తగ్గుదల పెద్దగా ఉండదు బంగారం ధరలు పెద్దగా తగ్గవు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బంగారం, బంగారమే అని తేలిపోయింది. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే వందేళ్లుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో కూడా ఇదే ఒరవడి కొనసాగుతుంది. – వినోద్‌కుమార్ జైన్, బులియన్ వ్యాపారి 2017లో రూ.22,000–23,000 మధ్య ట్రేడవుతోంది. కాగా, 1962లో రూ.89లు ఉన్న కాసు బంగారం ధర 1964లో రూ.64కు పడిపోయింది. -
పెట్టుబడులకు ఇబ్బందులు: ఎస్అండ్పీ
ముంబై: భారత్‌లో పెట్టుబడుల వృద్ధికి కొన్ని ఇబ్బందులు పొంచి ఉన్నట్లు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) అధ్యయనం ఒకటి తెలిపింది. విధాన సంస్కరణల అమల్లో అడ్డంకులు, అధికారుల అలసత్వం భారత్‌లో పెట్టుబడులకు ప్రధాన అడ్డంకులని పేర్కొంది. దేశంలో కార్పొరేట్ ఆదాయాల్లో వృద్ధి మందగమనంలో ఉందని, రుణ భారం కొనసాగుతోందని.. ఇవన్నీ పెట్టుబడులకు, భారీ వృద్ధికి విఘాతం కలిగిస్తున్న అంశాలని వివరించింది. భారత్‌సహా చైనా, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలపై సైతం ఎస్అండ్పీ అధ్యయనం జరిపింది. ప్రస్తుతం ఎస్అండ్పీ భారత్‌కు స్థిరమైన అవుట్‌లుక్‌తో ‘బీబీబీమైనస్’ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. పెట్టుబడులకు ఏమాత్రం సరికాని ‘జంక్’ స్థాయికి ఇది కేవలం ఒక అంచె మాత్రమే ఎగువ. ధరలు పెరిగే అవకాశం: నోముర ఇదిలాఉండగా, భారత్‌కు ఈ ఏడాది ఎల్ నినో ఇబ్బందులు పొంచి ఉన్నాయని జపాన్ బ్రోకరేజ్ సంస్థ- నోముర తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల దేశంలో ధరల తీవ్రత పెరగవచ్చని హెచ్చరించింది.