నరసాపురం: ధరల పెరుగుదలలో ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేసుకుంటున్న బంగారం తనకేదీ సాటిలేదని నిరూపిస్తోంది. గడిచిన వందేళ్లను పరిగణనలోకి తీసుకుంటే బంగారం ధరలు 2వేల రెట్లు పెరిగాయి. ఆస్తుల విలువ పెరుగుదలకు సంబంధించి బంగారానికి మరేదీ పోటీకాదని స్పష్టమవుతోంది. 1917లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం కాసు ధర కేవలం 11 రూపాయల 8 పైసలు ఉంటే ప్రస్తుతం అదే కాసు ధర రూ.22,800. అలాగే, 1917లో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం 10 గ్రాములు రూ.15.20 ఉంటే, ఇప్పుడది రూ.30వేలు. అంటే గడచిన వందేళ్లలో బంగారం 2వేల రెట్లకు పైగానే పెరిగింది. మరోవైపు.. వందేళ్ల క్రితం భూముల ధరలు కూడా స్వల్పంగానే ఉండేవి.
ఈ నూరేళ్లలో వందలు, వేలల్లో ఉండే భూముల ధరలు కోట్లల్లోకి మారినా.. అది అభివృద్ధిని బట్టి, ఆయా ప్రాంతాల పరిస్థితిని బట్టి కొన్ని ప్రాంతాలకే ఈ పెరుగుదల పరిమితమైంది. ఇక షేర్ మార్కెట్‌లో పెట్టిన సదరు కంపెనీల లాభనష్టాల మీదే రాబడి ఆధారపడి ఉంటుందనేది తెలిసిందే. డిపాజిట్లు ఇతర రూపాల్లో కూడా పెట్టుబడి రెండు వేల రెట్లు పెరగడమనేది జరగని పని. దీంతో బంగారం ప్రధాన పెట్టుబడి వస్తువుగా మారిపోయింది. వందేళ్ల క్రితం బంగారంపై రూపాయి పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు చేతిలో 2 వేలు ఉన్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఒకప్పుడు అలంకరణలు, సామాజిక అవసరాలకు మాత్రమే బంగారం సమకూర్చుకోవాలని పరితపించే వారి దృక్పథంలో స్పష్టమైన మార్పు రావడంతో బంగారంపై పెట్టుబడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
బంగారం ధరల తగ్గుదల పెద్దగా ఉండదు
బంగారం ధరలు పెద్దగా తగ్గవు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బంగారం, బంగారమే అని తేలిపోయింది. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే వందేళ్లుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో కూడా ఇదే ఒరవడి కొనసాగుతుంది.
– వినోద్‌కుమార్ జైన్, బులియన్ వ్యాపారి
2017లో రూ.22,000–23,000 మధ్య ట్రేడవుతోంది.
కాగా, 1962లో రూ.89లు ఉన్న కాసు బంగారం ధర
1964లో రూ.64కు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment