న్యూఢిల్లీ: భారత ఇన్సూర్‌టెక్ రంగానికి గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయని ఒక నివేదిక తెలిపింది. గడిచిన కొన్నేళ్లలో ఈ రంగం 2.5 బిలియన్ డాలర్లు సమీకరించగా.. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తాయని అంచనా వేసింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), ఇండియా ఇన్సూర్‌టెక్ అసోసియేషన్ (ఐఐఏ) ఈ నివేదికను రూపొందించాయి.
‘‘ప్రస్తుతం భారత్‌లో 150 ఇన్సూర్‌టెక్ కంపెనీలు (బీమా రంగ టెక్నాలజీ సంస్థలు) ఉన్నాయి. ఇందులో 10 యూనికార్న్‌లు, సూనికార్న్‌లు, 45కు పైగా మినీకార్న్‌లు ఉండగా, గడిచిన ఐదేళ్లలో ఆదాయం 12 రెట్లు పెరిగి 750 మిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం మీద ఈ రంగంలోకి వచ్చిన నిధులు 2.5 బిలియన్ డాలర్లు. దీంతో మొత్తం ఎకోసిస్టమ్ విలువ 13.6 బిలియన్ డాలర్లను అధిగమించింది’’అని ఈ నివేదిక వివరించింది. డిమాండ్, పంపిణీపై ఇన్సూర్‌టెక్‌లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని, అండర్ రైటింగ్ (రిస్క్‌ల మదింపు), క్లెయిమ్‌లు, సేవల్లో ఆవిష్కరణలకు గణనీయమైన అవకాశాలున్నట్టు ఈ నివేదిక అభిప్రాయపడింది.
అపార అవకాశాలు..
గడిచిన ఐదేళ్లలో భారత ఇన్సూర్‌టెక్ రంగం ఆదాయం 12 రెట్లు పెరిగినప్పటికీ.. భవిష్యత్తులో మరింతగా వృద్ధి చెందే అవకాశాలున్నట్టు బీసీజీ, ఐఐఏ నివేదిక వెల్లడించింది. ‘‘అండర్ రైటింగ్, క్లెయిమ్‌లలో డేటా, టెక్నాలజీ సామర్థ్యాల ను వినియోగించుకునేందుకు ఇన్సూర్‌టెక్ కంపెనీలకు అపార అవకాశాలున్నాయి’’ అని బీసీజీలో ఇండియా ఇన్సూరెన్స్ ప్రాక్టీస్ లీడ్, ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన పల్లవి మలాని తెలిపారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ఇన్సూరెన్స్ పరంగా చెప్పుకోతగ్గ పురోగతి సాధించినప్పటికీ.. హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణ ఇప్పటికీ ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందన్నారు. 45 శాతం వైద్య చికిత్సల వ్యయాలను జేబుల నుంచే వ్యయం చేయాల్సి వస్తున్నట్టు వివరించారు. దీంతో 2047 నాటికి నూరు శాతం ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సాధించడంతోపాటు, జేబు నుంచి చేసే వ్యయాలను 10 శాతం లోపునకు పరిమితం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ నివేదిక సూచించింది. ఇక అంతర్జాతీయంగా ఇన్సూర్‌టెక్ రంగంలోకి నిధుల రాక తగ్గినట్టు, ఆసియా పసిఫిక్ ప్రాంతం ఈ విషయంలో బలంగా నిలబడినట్టు ఈ నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment