
పనిగంటలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ముకేశ్ అంబానీ తనయుడు.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ 'ఆకాష్ అంబానీ' కూడా తన అభిప్రాయం వెల్లడించారు.
ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో 'ఆకాష్ అంబానీ' మాట్లాడుతూ.. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు, చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలి, దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. వృద్ధి అంటే జీవితం అనేది రిలయన్స్ నినాదం, అది వ్యక్తిగత జీవితానికి కూడా వరిస్తుందని అన్నారు. కాబట్టి మీరు ప్రతి రోజు ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మార్గనిర్దేశం చేయడానికి తమ కంపెనీ 1,000 మందికి పైగా డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజనీర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది ఆకాష్ అంబానీ అన్నారు. అంతే కాకుండా ఏఐలో దేశం ముందుకు సాగటానికి సహాయపడటానికి రిలయన్స్.. జామ్‌నగర్‌లో 1GW సామర్థ్యం గల డేటా సెంటర్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేస్తోందని అన్నారు.
పనిగంటలపై క్యాప్‌జెమిని సీఈఓ
ఉన్నత స్థాయి అధికారులు పని గంటలు ఎక్కువ చేయాలని పిలుపునిస్తుండగా.. క్యాప్‌జెమిని సీఈఓ అశ్విన్ యార్డి వారానికి 47.5 గంటల పని సరిపోతుందని, వారాంతాల్లో ఉద్యోగులకు పనికి సంబంధించిన ఎటువంటి ఈమెయిల్‌లు పంపవద్దని పిలుపునిచ్చారు. రోజుకి 9:30 గంటలు, వారానికి ఐదు రోజులు (47:30 గంటలు) పని చేస్తే చాలని నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరంలో వెల్లడించారు.
ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?
అంతకు ముందు టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. 90 గంటలు పనిచేయాలని ఎల్ & టీ చైర్మన్ సుబ్రమణ్యన్ చెప్పారు. దీనిని పలువురు ప్రముఖులు ఖండించారు. ఇందులో ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' మొదలైనవారు ఉన్నారు.