
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 జనవరిలో దేశీయ విమానయాన సంస్థలు 1.46 కోట్ల ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరవేశాయి. ఇది 2024 జనవరిలో 1.31 కోట్లుగా ఉంది. దాంతో 11.28 శాతం పెరుగుదల నమోదు చేసినట్లయింది. ఈ పెరుగుదల దేశంలో విమాన ప్రయాణానికి అధికమవుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది.
విమాన ప్రయాణికులకు సంబంధించి ఇండిగో వాటా 65.2 శాతంగా ఉంటే ఎయిరిండియా గ్రూప్ వాటా 25.7 శాతం, ఆకాసా ఎయిర్, స్పైస్‌జెట్ వాటాలు వరుసగా 4.7, 3.2 శాతంగా నమోదయ్యాయి. ఆన్ టైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ-సమయానికి రాకపోకలు నిర్వహించడం)లో ఇండిగో 75.5 శాతంతో మొదటిస్థానంలో నిలువగా, ఆకాసా ఎయిర్ 71.5 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఎయిరిండియా గ్రూప్ ఓటీపీ 69.8 శాతం, అలయన్స్ ఎయిర్ ఓటీపీ 57.6 శాతం, స్పైస్ జెట్ 54.8 శాతంగా ఉన్నాయి.
షెడ్యూల్ చేసిన దేశీయ విమానయాన సంస్థల మొత్తం రద్దు రేటు జనవరి 2025లో 1.62 శాతంగా ఉంది. ఫ్లై బిగ్ అత్యధికంగా 17.74 శాతం, ఫ్లై91 5.09 శాతం, అలయన్స్ ఎయిర్ 4.35 శాతం రద్దు రేటును నమోదు చేశాయి. విమానాల ఆలస్యం వల్ల 1,78,934 మంది ప్రయాణీకులు ప్రభావితం అయ్యారు. వీరికి సౌకర్యాలు అందించేందుకు విమానయాన సంస్థలు రూ.2.38 కోట్లు ఖర్చు చేశాయి. 2024 జనవరితో పోలిస్తే 2025లో విమానయాన సంస్థలు సామర్థ్య విస్తరణను 10.8 శాతం పెంచాయి. దేశీయ విమానయాన రంగం 2024 జనవరిలో 89.2 శాతం ఉన్న ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్-మొత్తం సీట్లకు తగిన ప్యాసింజర్లు) 2025లో 92.1 శాతంగా నమోదైంది.
ఇదీ చదవండి: వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాల ప్రభావం
ప్రయాణికుల పెరుగుదలకు కారణాలు..
కొవిడ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవడంతో విమాన ప్రయాణికుల్లో విశ్వాసం నెలకొంది. ఎయిర్ లైన్ నెట్‌వర్క్‌ల విస్తరణ, కొత్త మార్గాలను ఆవిష్కరించిడంతో అధిక జనాభా విమాన ప్రయాణం చేసేందుకు వీలువుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విమానయాన సంస్థలు ప్రయాణికులను ఆకర్షించడానికి పోటీ ఛార్జీలు, ప్రమోషనల్ డీల్స్‌ను అందిస్తున్నాయి. ఇది విమాన ట్రాఫిక్ పెరుగుదలను మరింత పెంచింది. విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, ఆధునీకరణలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇది కూడా ప్రయాణ సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment