ఎక్కేద్దాం... ఎగిరిపోదాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. అక్టోబర్ 14న వివిధ నగరాల నుంచి 4,84,263 మంది విమానాల్లో ప్రయాణం సాగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన 4,71,751 రికార్డుతో పోలిస్తే 2.6 శాతం ప్రయాణికులు అధికంగా ప్రయాణించడం విశేషం.నవరాత్రి, దసరా, దుర్గా పూజ ముగిసిన తర్వాత తొలి పనిదినం కావడంతో ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా నమోదైంది. అక్టోబర్ 14న మొత్తం 6,435 విమాన సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందించాయి. భారత్‌లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య దూసుకుపోతుండడంతో విమానయాన సంస్థల మధ్య పోటీ వేడి మీద ఉంది. ఈ ఏడాది ఆగస్ట్‌తో పోలిస్తే సెప్టెంబర్‌లో ఇండిగో మార్కెట్ వాటా 60 బేసిస్ పాయింట్లు, ఎయిర్ ఇండియా 40 బేసిస్ పాయింట్లు పెరిగింది. స్పైస్‌జెట్ 30 బేసిస్ పాయింట్లు, ఆకాశ ఎయిర్ 10 బేసిస్ పాయింట్లు క్షీణించాయి. సెప్టెంబర్‌లో ఇలా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1.30 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం సాగించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ల సంఖ్య 6.4 శాతం దూసుకెళ్లింది. వాస్తవానికి నాలుగు నెలలుగా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో క్షీణత నమోదవుతోంది. 2024 మే నెలలో 1.38 కోట్ల మంది రాకపోకలు సాగించారు. ప్యాసింజర్ల సంఖ్య జూన్ నుంచి వరుసగా 1.32 కోట్లు, 1.29 కోట్లు, 1.31 కోట్లుగా ఉంది. రద్దు అయిన విమాన సర్వీసుల సంఖ్య 0.85 శాతం ఉంది. మే నెలలో ఇది 1.7 శాతంగా నమోదైంది.ఫ్లైబిగ్ ఎయిర్ అత్యధికంగా 17.97 శాతం క్యాన్సలేషన్ రేటుతో మొదట నిలుస్తోంది. 4.74 శాతం వాటాతో అలయన్స్ ఎయిర్, 4.12 శాతం వాటాతో స్పైస్‌జెట్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. క్యాన్సలేషన్ రేటు అతి తక్కువగా ఎయిర్ ఇండియా 0.13 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 0.27, ఇండిగో 0.62, విస్తారా 0.88 శాతం నమోదైంది. విమానాల రద్దు ప్రభావం గత నెలలో 48,222 మంది ప్రయాణికులపై పడింది. పరిహారం, సౌకర్యాలకు విమానయాన సంస్థలు రూ.88.14 లక్షలు ఖర్చు చేశాయి. సర్వీసులు ఆలస్యం కావడంతో 2,16,484 మందికి అసౌకర్యం కలిగింది. నష్టపరిహారంగా విమానయాన సంస్థలు రూ.2.41 కోట్లు చెల్లించాయి. గత నెలలో మొత్తం 765 ఫిర్యాదులు అందాయి. 10,000 మంది ప్రయాణికులకు ఫిర్యాదుల శాతం 0.59 ఉంది. మార్కెట్ లీడర్‌గా ఇండిగో.. సమయానికి విమాన సర్వీసులు అందించడంలో దేశంలో తొలి స్థానంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిలిచింది. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండిగో మార్కెట్ వాటా ఏకంగా 63 శాతానికి ఎగసింది. సెప్టెంబర్ నెలలో ఈ సంస్థ 82.12 లక్షల మందికి సేవలు అందించింది. రెండవ స్థానంలో ఉన్న ఎయిర్ ఇండియా 15 శాతం వాటాతో 19.69 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చింది.13.08 లక్షల మంది ప్రయాణికులతో విస్తారా 10 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 5.35 లక్షల మంది ప్రయాణికులతో 4.1 శాతం వాటా సొంతం చేసుకుంది. 2022 ఫిబ్రవరిలో 10.7 శాతం మార్కెట్ వాటా కైవసం చేసుకున్న స్పైస్‌జెట్ గత నెలలో 2 శాతం వాటాకు పరిమితమైంది. సెప్టెంబర్‌లో ఈ సంస్థ 2,61,000 మందికి సేవలు అందించింది. ఆక్యుపెన్సీ రేషియో స్పైస్‌జెట్ 80.4 శాతం, విస్తారా 90.9, ఇండిగో 82.6, ఎయిర్ ఇండియా 80.1, ఏఐఎక్స్ కనెక్ట్ 81.6 శాతం నమోదైంది.