ముంబై: గత నెల దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 1.32 కోట్లుగా నమోదైంది. గతేడాది మే నెలలో నమోదైన 1.14 కోట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం ఇండిగో మార్కెట్ వాటా ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో 57.5 శాతం నుంచి 61.4 శాతానికి పెరిగింది. మొత్తం 81 లక్షల మందిని ఇండిగో గమ్యస్థానాలకు చేర్చింది. టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిరిండియా, ఎయిర్‌ఏషియా ఇండియా, విస్తారాల మార్కెట్ వాటా వరుసగా 9.4 శాతం, 7.9 శాతం, 9 శాతంగా నిల్చింది.
ఎయిరిండియా 12.44 లక్షల మందిని, విస్తారా 11.95 లక్షల మందిని, ఎయిర్‌ఏషియా ఇండియా 10.41 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఈ మూడింటికి కలిపి 26.3 శాతం మార్కెట్ వాటా లభించింది. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా ఏప్రిల్‌తో పోలిస్తే 4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న గో ఫస్ట్ సంస్థ మే 3 నుంచి విమాన సర్వీసులు నిలిపివేసింది. సమయపాలన విషయంలో ఆకాశ ఎయిర్ అగ్ర స్థానంలో (92.6 శాతం) నిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment