నటి మెడికల్‌ వేవర్‌ అభ్యర్థన తిరస్కరణ | Lisa Ray express her frustration with Air India after the airline denied a medical waiver request | Sakshi
Sakshi News home page

నటి మెడికల్‌ వేవర్‌ అభ్యర్థన తిరస్కరణ

Published Thu, Mar 20 2025 12:06 PM | Last Updated on Thu, Mar 20 2025 12:17 PM

Lisa Ray express her frustration with Air India after the airline denied a medical waiver request

కనీస సానుభూతి కరవు

మెడికల్‌ వేవర్‌ అభ్యర్థనను తిరస్కరించిన తర్వాత ఎయిరిండియా కనీస సానుభూతి చూపడం లేదని నటి లీసా రే సోషల్ మీడియాలో ఆరోపించారు. డాక్టర్ లేఖను సమర్పించినప్పటికీ, సరైన వివరణ ఇవ్వకుండా మెడికల్‌ వేవర్‌ను తిరస్కరించారని పేర్కొంటూ ఆమె తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా అసహనం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి(92) అత్యవసర పరిస్థితుల్లో విమాన ప్రయాణాన్ని రద్దు చేశాక ఈ పరిణామం చోటు చేసుకుందని లీసా తెలిపారు.

‘మా నాన్నకు 92 ఏళ్లు. తన అనారోగ్యం కారణంగా అత్యవసరంగా ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తండ్రి అనారోగ్యానికి సంబంధించి డాక్టర్ల రిపోర్ట్‌ను కూడా సమర్పించాను. అయినా మెడికల్‌ వేవర్‌ను నిరాకరిస్తారా? అది ఎలా సాధ్యం? ప్రయాణికుల గురించి పట్టించుకుంటామని చెప్పుకునే విమానయాన సంస్థ నుంచి కనీస సానుభూతి ఎక్కడుంది?’ అని రే ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎయిరిండియా అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా సానుభూతి వ్యక్తం చేస్తూ మెడికల్‌ వేవర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను డైరెక్ట్ మెసేజ్ ద్వారా తెలియజేయాలని కోరింది.

‘డియర్ మిసెస్ రే, మీ పరిస్థితికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం. మీ తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి మీరు మాకు రాసిన ఈమెయిల్ చిరునామా లేదా డీఎం ద్వారా కేస్ ఐడీ (ఏవైనా ఉంటే)ను షేర్‌ చేయండి. మేము దాన్ని పరిశీలిస్తాం’ అని ఎయిరిండియా బదులిచ్చింది. బుకింగ్ ట్రావెల్ ఏజెన్సీతో ఆమె జరిపిన సంభాషణ స్క్రీన్ షాట్‌ను కూడా రే పోస్ట్ చేశారు. ఆమె తండ్రి ఆసుపత్రిలో చేరినప్పటికీ, ఆమె విషయంలో వైద్య మాఫీకి అవకాశం లేదని ఏజెన్సీ నుంచి స్పందన వచ్చినట్లు తెలిపారు.

ఆమె పోస్ట్‌పై ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆమె దుస్థితిపై సానుభూతి వ్యక్తం చేశారు. మరికొందరు నాన్ ఫ్లెక్సిబుల్ టికెట్లకు వైద్య మినహాయింపులు వర్తించవని సూచించారు. ‘మీ టికెట్‌పై ఫ్లెక్సిబుల్ ఆప్షన్‌ లేకపోతే ఏ విమానయాన సంస్థ కూడా మీకు ఏ కారణం చేతా మినహాయింపు ఇవ్వదు’ అని ఒక యూజర్ తెలిపారు. భవిష్యత్తు పరిస్థితుల కోసం సౌకర్యవంతమైన టికెట్లు లేదా ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలని ఇంకొందరు సూచించారు.

ఇదీ చదవండి: ‘ఇండస్‌ఇండ్‌లో వాటా పెంపునకు అనుకూల సమయం’

మెడికల్‌ వేవర్‌

  • ప్రయాణీకులు తరచుగా వైద్యుడి నుంచి ‘ఫిట్-టు-ఫ్లై’ సర్టిఫికేట్‌ను అందించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ప్రయాణికుడు విమాన ప్రయాణానికి వైద్యపరంగా స్థిరంగా ఉన్నాడని, సాధారణంగా విమానానికి ముందు ఒక నిర్దిష్ట కాలవ్యవధి (ఉదా. 72 గంటలు) అవసరమని ధ్రువీకరించాలి.

  • ఎయిరిండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థల నిబంధనల ప్రకారం ప్రత్యేక వైద్య పరిస్థితులు ఉన్న ప్రయాణికులు ముందుగానే మెడికల్ ఇన్ఫర్మేషన్ ఫారం (ఎంఈడీఐఎఫ్) నింపాల్సి ఉంటుంది. ఆక్సిజన్ సపోర్ట్ లేదా మొబిలిటీ ఎయిడ్స్ వంటి ప్యాసింజర్ అవసరాలను అంచనా వేయడానికి ఈ ఫారం విమానయాన సంస్థకు సహాయపడుతుంది.

  • మాఫీకు షరతులు: తీవ్రమైన లేదా అత్యవసర వైద్య పరిస్థితుల నేపథ్యంలో ఫీజుల రద్దు లేదా రీషెడ్యూల్ కోసం వైద్య మినహాయింపులు మంజూరు చేస్తారు. అయితే కొన్ని విమానయాన సంస్థలు నాన్-ఫ్లెక్సిబుల్ టికెట్లకు మినహాయింపులు ఇవ్వకపోవచ్చు. విమానయాన వైద్య మినహాయింపు పరిస్థితులు విమానయాన సంస్థను బట్టి మారవచ్చు.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement