
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ వ్యాఖ్య
ముంబై: ఆఫీసులో ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. ప్రతి రోజు ఎంత నాణ్యమైన పని చేశామనేదే తనకు ముఖ్యమని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించారు. తనకు పని, కుటుంబం రెండూ ప్రాధాన్యతాంశాలేనని ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరు జీవితంలో తమ తమ ప్రాధాన్యతలను గుర్తెరిగి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
వారానికి 90 గంటల వరకు పని చేయాలంటూ కొందరు, 50 గంటలలోపు చాలంటూ మరికొందరు కార్పొరేట్లు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఆకాశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మార్గనిర్దేశం చేసేందుకు తమ కంపెనీ 1,000 మంది డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజినీర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకుందని అంబానీ చెప్పారు. జామ్‌నగర్‌లో 1 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను (జీపీయూ) సర్విసుగా అందించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.