Reliance Jio Infocomm Ltd
-
రిలయన్స్ జియోవైపు గూగుల్ చూపు!
ఇటీవల పలు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకట్టుకుంటున్న జియో ప్లాట్‌ఫామ్స్ తాజాగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ను సైతం ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు డిజిటల్, టెలికం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 4 బిలియన్ డాలర్లు(రూ. 30,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో గూగుల్ ఉన్నట్లు మార్కెట్లో వినిపిస్తోంది. చర్చలు కొనసాగుతున్నాయని.. ఈ డీల్ కొద్ది వారాలలో వెల్లడికావచ్చని మార్కెట్ వర్గాలు ఊహిస్తున్నాయి. రానున్న 5-7 ఏళ్ల కాలంలో దేశీయంగా 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే ప్రణాళిల్లో ఉన్నట్లు సోమవారం గూగుల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా డిజిటల్ టెక్నాలజీస్‌లో మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో జియోలో పెట్టుబడులపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ అంశంపై అటు ఆర్ఐఎల్, ఇటు గూగుల్ స్పందించకపోవడం గమనార్హం! ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 1 శాతం బలహీనపడి రూ. 1915 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1942 వద్ద గరిష్టాన్నీ, రూ. 1887 వద్ద కనిష్టాన్నీ తాకింది. క్వాల్‌కామ్‌తో.. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్కు అనుబంధ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో తాజాగా చిప్ దిగ్గజం క్వాల్కామ్ రూ. 730 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. తద్వారా జియోలో 0.15 శాతం వాటాను సొంతం చేసుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25.24 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఆర్ఐఎల్ రూ. 1.18 లక్షల కోట్లకుపైగా సమీకరించింది. జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌సహా చిప్ దిగ్గజాలు ఇంటెల్, క్వాల్కామ్.. పీఈ సంస్థలు కేకేఆర్, సిల్వర్ లేక్ తదితరాలు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ పెట్టుబడులకు జతగా రైట్స్ ఇష్యూ ద్వారా ఆర్ఐఎల్ రూ. 53,124 కోట్లను సమకూర్చుకుంది. ఈ బాటలో గతేడాది ఇంధన రిటైల్ నెట్‌వర్క్‌లో 49 శాతం వాటా అమ్మకం ద్వారా బీపీ నుంచి రూ. 7,000 కోట్లు సమీకరించింది. వెరసి నికరంగా రుణరహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు గత నెలలో ఆర్ఐఎల్ తెలియజేసింది. మార్చికల్లా ఆర్ఐఎల్ రుణ భారం రూ. 1.6 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. -
జియో ఏజీఆర్ బకాయిలు చెల్లింపు
సాక్షి,న్యూఢిల్లీ : ఏజీఆర్‌పై వివాదం కొనసాగుతుండగానే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రభుత్వానికి తన బకాయిలను మొత్తం చెల్లించింది. జనవరి 31, 2020 వరకు చట్టబద్ధంగా టెలికాం విభాగానికి రూ.195 కోట్ల బకాయలను చెల్లించింది. తద్వారా ఈ ఏజీఆర్ బాకీ చెల్లింపుల విషయంలో జియో ముందు నిలిచింది. సుప్రీంకోర్టు విధించిన గడువు (2020 జనవరి 23 వ తేదీ) లోగా బకాయిలు తీర్చిన ఏకైక టెలికం సంస్థగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో నిలిచింది. టెలికాం విభాగానికి (డిఓటి) జియో రూ. 195 కోట్లు చెల్లించిందని గురువారం పిటిఐ నివేదించింది. మరోవైపు ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, తదుపరి విచారణ వరకు గడువును పొడిగించాల్సిందిగా వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ ప్రభుత్వాన్ని కోరాయి. వొడాఫోన్ ఐడియా రూ. 53,038 కోట్లు, ఎయిర్టెల్ సుమారు రూ. 36 వేలకోట్లను చెల్లించాల్సి వుంది. కాగా సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిలను ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జనవరి 23ను గడువుగా నిర్ణయించింది. అక్టోబర్ 24, 2019 నాటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెల్లింపులు చేయాలని, నిర్ణీత కాలపరిమితిలో అవసరమైన పత్రాలను సమర్పించాలని ప్రభుత్వం టెల్కోలకు ఆదేశించింది. అయితే గడువులోపు బకాయిల చెల్లించలేమని గడువును పొడిగించాలని టెలికాం సంస్థలు కోరుతున్నాయి. దీనికి సంబంధించి వోడాఫోన్ఐడియా, ఎయిర్టెల్, టాటా టెలీ సర్వీసెస్ సంస్థలుదాఖలు చేసిన మోడిఫికేషన్ను పిటిషన్‌నుసుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. దీంతో రానున్న వారంలో సుప్రీంకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో ఏడీఆర్ బకాయిలు చెల్లించని సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డాట్ తన అధికారులను కోరింది. -
రిలయన్స్ జియోకు 4జీ లెసైన్సులు సరైనవే..
పిల్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నియంత్రణలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్) 4జీ లెసైన్సుల మంజూరీని సవాలుచేస్తూ దాఖలయిన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. లెసైన్సులు జారీ చేయడంలో పక్షపాతం చూపినట్లుగా తగిన ఆధారాలు లేవని, దీనివల్ల ఖజానాకు సైతం ఎలాంటి నష్టం జరగలేదని చీఫ్ జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. లెసైన్సుల జారీ చట్టబద్ధంగా, తగిన విధానం ద్వారా జరిగిందని పేర్కొంది. ఆర్జేఐఎల్ 4జీ స్పెక్ట్రమ్‌పై వాయిస్ సర్వీసులు ఆఫర్ చేయడం సరికాదని పేర్కొంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ఈ పిల్‌ను దాఖలు చేసింది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీ(ఎస్‌యూసీ) అంశాన్ని ప్రస్తావించిన అత్యున్నత న్యాయస్థానం... దీనిపై ఏర్పాటయిన కమిటీ ఇప్పటికే నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని, దీనిపై నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలివేస్తున్నామని పేర్కొంది. బ్రాడ్‌బాండ్ వైర్లెస్ యాక్సెస్ (బీడబ్ల్యూఏ)పై రిలయన్స్‌కు రూ.1,658 కోట్ల ఎంట్రీ ఫీజుతో వాయిస్ టెలిఫోనీ లెసైన్సులు మంజూరు చేయడం తగదని అడ్వకేట్ ప్రశాంత్ భూషన్ ద్వారా ఈ పిల్ దాఖలైంది. ఇది రూ.40,000 కోట్ల కుంభకోణంగా పేర్కొంటూ దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలనీ పిల్లో కోరారు.