రిలయన్స్ జియోకు 4జీ లెసైన్సులు సరైనవే..
పిల్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నియంత్రణలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్‌జేఐఎల్) 4జీ లెసైన్సుల మంజూరీని సవాలుచేస్తూ దాఖలయిన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. లెసైన్సులు జారీ చేయడంలో పక్షపాతం చూపినట్లుగా తగిన ఆధారాలు లేవని, దీనివల్ల ఖజానాకు సైతం ఎలాంటి నష్టం జరగలేదని చీఫ్ జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. లెసైన్సుల జారీ చట్టబద్ధంగా, తగిన విధానం ద్వారా జరిగిందని పేర్కొంది.
ఆర్‌జేఐఎల్ 4జీ స్పెక్ట్రమ్‌పై వాయిస్ సర్వీసులు ఆఫర్ చేయడం సరికాదని పేర్కొంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ఈ పిల్‌ను దాఖలు చేసింది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీ(ఎస్‌యూసీ) అంశాన్ని ప్రస్తావించిన అత్యున్నత న్యాయస్థానం... దీనిపై ఏర్పాటయిన కమిటీ ఇప్పటికే నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని, దీనిపై నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలివేస్తున్నామని పేర్కొంది.
బ్రాడ్‌బాండ్ వైర్‌లెస్ యాక్సెస్ (బీడబ్ల్యూఏ)పై రిలయన్స్‌కు రూ.1,658 కోట్ల ఎంట్రీ ఫీజుతో వాయిస్ టెలిఫోనీ లెసైన్సులు మంజూరు చేయడం తగదని అడ్వకేట్ ప్రశాంత్ భూషన్ ద్వారా ఈ పిల్ దాఖలైంది. ఇది రూ.40,000 కోట్ల కుంభకోణంగా పేర్కొంటూ దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలనీ పిల్‌లో కోరారు.