ముంబై: అంబానీ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. నీతా- ముఖేష్ అంబానీ దంపతులు బామ్మ- తాతయ్యలుగా ప్రమోషన్ పొందారు. వారి పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ సతీమణి శ్లోకా మెహతా ముంబైలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు అంబానీ కుటుంబం గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో శ్లోకా- ఆకాశ్ అంబానీ తల్లిదండ్రులయ్యారు. వారికి కుమారుడు జన్మించాడు. నీతా- ముఖేష్ అంబానీ మొదటిసారిగా నానమ్మ- తాతయ్య అయ్యారు.
ధీరూభాయి- కోకిలాబెన్ మునిమనవడికి స్వాగతం పలకడం పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కొత్త సభ్యుడి రాకతో మెహతా- అంబానీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది’’ అంటూ శుభవార్తను పంచుకుంది. కాగా గతేడాది మార్చిలో ఆకాశ్- శ్లోకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో మూడు ముళ్ల బంధంతో వీరు ఒక్కటయ్యారు. శ్లోకా మెహతా వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె అన్న విషయం తెలిసిందే.(చదవండి: ఫార్చూన్ ‘40’లో అంబానీ వారసులు)
ఇక ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వారసత్వాన్ని నిలబెడుతూ ఆయన సంతానం కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వ్యాపారవేత్తలుగా రాణిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇక టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లైన ఆయన కుమార్తె ఇషా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ 2020 ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment