ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా?
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలోని 50 షేర్ల సూచీ నిఫ్టీ... గతేడాది మార్చిలో నమోదు చేసిన 9,119 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 23 శాతం కంటే ఎక్కువే నష్టపోయింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ వాతావరణమంతా నిస్తేజంగా మారింది. దేశీ మదుపుదారులంతా ఆందోళనతో ఉన్నారు. కాకపోతే కొంత మంది ఎనలిస్టులు మాత్రం ఈ సమయంలోనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లలో గందరగోళం మాత్రం పోలేదు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా? లేక మరింత పతనం జరిగే వరకు ఆగాలా? అన్న విషయంపై ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ‘వివేకం’ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి. వాటినిప్పుడు పరిశీలిద్దాం..
చౌకగా లభిస్తాయి..
మనం పుస్తకాల్లో చదువుకున్న దాని ప్రకారం మార్కెట్ సూచీలు నూతన గరిష్ట స్థాయిల నుంచి 20 శాతం మించి పతనమైతే ఇంచుమించు మాంద్యంలోకి జారినట్లే. గత 13 ఏళ్ల స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు సూచీలు మరింత పతనమయ్యాయనేది పరిశీలించాం. మార్కెట్లో భయాందోళన పరిస్థితులు ఉన్నప్పుడు కొనుగోలు చేసి.. ఇంకా పెరుగుతుందని ఆశపడేంత పరిస్థితులున్న సమయంలో విక్రయించాలని ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్ రిటైల్ ఇన్వెస్టర్లకు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు.
మన ఇన్వెస్టర్లు కూడా చాలా ధైర్యవంతులని సూచీలు 20 శాతం పైగా పతనమై భయాందోళనలు ఉన్నప్పుడు కొనుగోలు చేస్తారనుకుంటున్నాం. ఇలాంటి సమయాల్లో మంచి పనితీరు కనబర్చే చాలా షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తాయి.
ఒక్కసారే నష్టపోయారు..
షేర్ల కదలికలు కంపెనీని, రంగాన్ని బట్టి రకరకాలుగా ఉండొచ్చు. అందుకని వ్యక్తిగత షేర్ల జోలికి పోకుండా గత 13 ఏళ్లలో ఇండెక్స్‌లు ఎలా కదిలాయో పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు గమనించవచ్చు. 2003 నుంచి ఫిబ్రవరి 19, 2016 వరకు గమనిస్తే నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 20 శాతానికిపైగా నష్టపోయి 929 రోజులు ఉంది. (వివరంగా పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది). ఈ సమయంలో కొనుగోలు చేసి... దీర్ఘకాలం వేచి ఉన్న వారు మంచి లాభాలు పొందారు.
20 శాతం పైగా నష్టపోయిన తర్వాత కొని రెండేళ్లు వేచి చూసిన వారికి 53 శాతం, మూడేళ్లు ఉన్న వారికి 74 శాతం, 5 ఏళ్లు ఉన్న వారికి 138 శాతం లాభాలొచ్చాయి. ఇలా కొనుగోలు చేసినప్పుడు కేవలం లాభాలే కాదు! నష్టాలొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ దీర్ఘకాలం వేచి ఉండే కొద్దీ ఈ నష్టం వచ్చిన సందర్భాలు తగ్గడం విశేషం. ఇన్వెస్ట్ చేసి రెండేళ్లు వేచి చూసినా 39 సార్లు నష్టాలు వచ్చాయి. అదే మూడేళ్లలో వేచి ఉన్న సందర్భాల్లో 26 సార్లు, 5 ఏళ్లు వేచి ఉంటే ఒకేసారి మాత్రమే నష్టం వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే... పెట్టుబడి పెట్టిన సమయంతో సంబంధం లేకుండా ఈ సమయంలో ప్రతీ ఇన్వెస్టరు కనీసం ఒకసారి లాభాలొచ్చే అవకాశాన్ని పొందారు.
తక్కువ సమయంలో..
ఈ దీర్ఘకాలిక లెక్కలపై సందేహాలు వ్యక్తం చేసేవారి కోసం... విశ్లేషణ సమయాన్ని మరింత కుదించాం. ఇప్పుడు 2008 నుంచి జనవరి, 2016 వరకు నిఫ్టీ కదలికలను తీసుకొని పరిశీలిద్దాం. ఈ సమయంలో రెండు అతిపెద్ద బేర్ ర్యాలీలు, ఒక మోస్తరు మార్కెట్ రికవరీ జరిగింది. ఇలాంటి సమయంలో కూడా నిఫ్టీ 20 శాతానికిపైగా పతనమైనప్పుడు కొనుగోలు చేసి రెండేళ్లు ఉంటే 35 శాతం, మూడేళ్లు ఉంటే 41 శాతం, ఐదేళ్లుంటే 56 శాతం లాభం వచ్చింది. ఒక ఏడాది దాటి ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ భారం ఉండదు కాబట్టి వార్షిక సగటు రాబడి కింద చూస్తే వరుసగా 17.5 శాతం, 13.7 శాతం, 11.2 శాతం పొందినట్లు లెక్క.
ఈ రాబడి ప్రస్తుతం బ్యాంకు అందిస్తున్న వడ్డీరేట్లు 7-8 శాతం కంటే చాలా ఎక్కువ. స్థూలంగా చూస్తే మనం సరైన షేరును ఎంచుకుంటే బుల్ మార్కెట్లో బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడులను పొందే అవకాశాలు చాలా ఎక్కువని చెప్పొచ్చు. ఇలా షేర్లను ఎంచుకోవడం కష్టం అనుకున్న వారికిప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిఫ్టీ, సెన్సెక్స్ వంటి ఇండెక్స్ ఫండ్‌లను అందిస్తున్నాయి. వీటిని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌గా పిలుస్తారు. వీటి రాబడి ఇంచుమించు సూచీల కదలికలకు అనుగుణంగానే ఉంటుంది.
వీటిల్లో రూ.1,000 చొప్పున కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి. 2008 నుంచి సూచీలు 20 శాతం కంటే నష్టపోయిన సందర్భాల్లో సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్ రాబడి వరుసగా రెండేళ్లకు 13.5%, మూడేళ్లకు 9.51%, ఐదేళ్లకు 10.41%గా ఉంది. అంటే ప్రతినెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేసిన వారికి రెండేళ్లలో రూ. 2.75 లక్షలు, మూడేళ్లలో రూ. 4.16 లక్షలు, ఐదేళ్లలో రూ.7.82 లక్షలు చొప్పున లాభాలు పొందారు.
- వి.వి.కె.ప్రసాద్
వివేకం, ఫైనాన్షియల్ సర్వీసెస్