ఫెడ్ మినిట్స్, జాక్సన్ హోల్
ఆర్థిక సదస్సుపై దృష్టి
పరిమిత శ్రేణిలో స్థిరీకరణ దిశగా సాగొచ్చు
ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అంచనాలు
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు ఈవారం అంతర్జాతీయ సంకేతాలను అందిపుచ్చుకుంటూ పరిమిత శ్రేణిలో సానుకూల ధోరణితో స్థిరీకరణ దిశగా సాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక అమెరికా ఫెడ్ ఎఫ్‌ఓఎంసీ మినిట్స్, జాక్సన్ హోల్ ఆర్థిక సదస్సులో చైర్మన్ జెరోమ్ పావెల్ వాఖ్యలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ఈ వారం ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుందంటున్నారు.
‘‘అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లకు స్వల్పకాలంలో ప్రధాన అడ్డంకిగా మారాయి. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 24,700, ఆపై 25,850 స్థాయిలను పరీక్షించవచ్చు. ముఖ్యంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే మరోసారి 25,000 స్థాయిని అందుకునే అవకాశం లేకపోలేదు. దిగువ స్థాయిలో 24,300–24,200 పరిధిలో తక్షణ మద్దతు ఉంది’’ అని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు.
గత వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. సెన్సెక్స్ సెన్సెక్స్ 731 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా ఆర్థిక భయాలు తగ్గడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలతో వారాంతాపు రోజైన శుక్రవారం సూచీలు దాదాపు 2 శాతం ర్యాలీ చేశాయి.
ఎఫ్‌ఓఎంసీ వివరాలపై కన్ను...
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూలైలో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) 21న (బుధవారం) విడుదల కానున్నాయి. ఆర్థిక వ్యవస్థ సహా మందగిస్తున్న ధరల నేపథ్యంలో 2024 ద్వితీయార్ధంలో రేట్ల తగ్గింపునకు సంకేతాలిచ్చిన ఫెడ్ రిజర్వ్ సమావేశ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది.
ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలపై దృష్టి
అమెరికా మిస్సోరి రాష్ట్రంలోని కాన్సాస్ సిటీలో ఫెడరల్ రిజర్వ్ జాక్సన్ హోలీ ఎకనమిక్ సింపోజియం (ఆర్థిక సదస్సు) 23న (శుక్రవారం) జరగనుంది. ఇందులో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసగించనున్నారు. ఆర్థిక మాంద్యం భయాలు సన్నగిల్లడంతో పాటు జూలై సీపీఐ ద్రవ్యోల్బణ డేటా అంచనాలకు అనుగుణంగా వెలువడింది. ఈ నేపథ్యంలో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలపై పావెల్ అభిప్రాయం కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు.
స్థూల ఆర్థిక గణాంకాలు
జపాన్ జూన్ మెషనరీ ఆర్డర్లు సోమవారం, యూరోజోన్ జూలైన ద్రవ్యోల్బణ డేటా మంగళవారం, జపాన్ జూలై వాణిజ్య లోటు గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. మరుసటి రోజు గురువారం దేశీయ హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సరీ్వసెస్ పీఎంఐ గణాంకాలు వెల్లడి కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్ జూలై ద్రవ్యోల్బణ డేటా పాటు భారత ఆర్‌బీఐ ఆగస్టు 16తో ముగిసిన వారపు ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలపై మార్కెట్ వర్గాలు ఫోకస్ చేయనున్నాయి.
రూ.21,201 కోట్ల అమ్మకాలు
భారత మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్ట్ ప్రథమార్థంలో రూ.21,201 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. యెన్ ఆధారిత ట్రేడింగ్ భారీగా తగ్గడం, అమెరికాలో ఆర్థిక మాంద్య భయాలు, చైనా ఆర్థిక మందగమన ఆందోళనలు భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు ఇందుకు ప్రధాన కారణాలు. ఇదే సమయంలో (ఆగస్టు 1–17 మధ్య) డెట్ మార్కెట్లో రూ.9,112 కోట్ల పెట్టుడులు పెట్టారు. కాగా దేశీయంగా క్యూ1 ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, పాలసీ సంస్కరణలు, ఆర్థిక వృద్ధిపై ఆశలతో ఎఫ్‌ఐఐలు జూలైలో రూ.32,365 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘‘వేల్యుయేషన్ పరంగా భారత ఈక్విటీ మార్కెట్ అంత్యంత ఖరీదైనగా మారడంతో ఎఫ్‌ఐఐలు ఇక్కడి విక్రయాలు జరిపి చౌకగా మార్కెట్లలో కొనుగోళ్లు చేపడుతున్నారు. అమెరికా మాంద్య భయాలు తగ్గి బుల్లిష్ వైఖరి నెలకొన్న నేపథ్యంలోనూ ఈ పరిస్థితి మారడం లేదు’’ జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment