జీవిత బీమా పరిభాష..
బేసిక్స్
జీవిత బీమా తీసుకునేటప్పుడు రకరకాల పదాలు వినవస్తుంటాయి. వీటిలో కొన్నింటిని గురించి క్లుప్తంగా..
సమ్ అష్యూర్డ్
దీన్నే కవరేజ్ అని కూడా అంటారు. బీమా కంపెనీ పాలసీకి సంబంధించి గ్యారంటీగా ఇచ్చే సొమ్ము ఇది. పాలసీని బట్టి బోనస్‌లు, వడ్డీ మొదలైనవి కూడా దీనికి జత కావొచ్చు. పాలసీ మెచ్యూర్ అయ్యాక (వ్యవధి పూర్తయిపోయాక) పాలసీదారుకు ఈ మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ఈలోగానే పాలసీదారు మరణించిన పక్షంలో వారి వారసులకు దీన్ని అందిస్తుంది.
ప్రీమియం..
పాలసీ కవరేజీ కోసం పాలసీదారు తరచుగా కొంత మొత్తం బీమా కంపెనీకి కట్టాలి. దీన్నే ప్రీమియం అంటారు. ఒక రకంగా ఇది ఇన్‌స్టాల్‌మెంట్ అనుకోవచ్చు. పాలసీదారు వయసును బట్టి ప్రీమియం మారుతుంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వ్యక్తి తీసుకునే పాలసీకి, 40 ఏళ్ల వ్యక్తి తీసుకునే పాలసీకి ప్రీమియంలు వేర్వేరుగా ఉంటాయి. ఆయా పాలసీలను బట్టి పాలసీదారు ఏకమొత్తంగా ఒకేసారైనా కట్టేయొచ్చు లేదా ఏడాదికో, ఆర్నెల్లకో, మూడు నెలలకోసారి కట్టే విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి పాలసీకి ఇన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలని ఉంటుంది.
యాన్యుటీ పథకాలు..
కంపెనీకి ఒకేసారి ఏకమొత్తంగా కట్టేసి.. జీవితాంతం నెలకి కొంత చొప్పున తిరిగి పొందే పథకాలు ఇవి. ఇందులో ఇమ్మీడియట్ అని.. డిఫర్డ్ అని రెండు రకాలు ఉంటాయి. ఇమ్మీడియట్ విధానంలో .. కంపెనీకి డబ్బు కట్టేసిన మరుసటి నెల నుంచి మనకు రావాల్సిన చెల్లింపులు మొదలవుతాయి. ఇక రెండో విధానంలో.. మనం ఎప్పట్నుంచి కావాలని కోరుకుంటామో అప్పట్నుంచే కంపెనీ చెల్లించడం మొదలుపెడుతుంది. మనకు నెలకు ఎంత వస్తుందనేది.. ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.