న్యూఢిల్లీ: బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీహోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా ఇవ్వాల్సిందేనని బీమా కంపెనీలకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్‌డీఏఐ సూచించింది. ఈ నూతన నిబంధన 2024, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ), పాలసీలో వేటికి కవరేజీ ఉంటుంది, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, క్లెయిమ్ ఎలా చేయాలి తదితర వివరాలను తప్పకుండా వెల్లడించాలి. అలాగే, ఫిర్యాదుల ప్రక్రియ గురించీ చెప్పాలి.
ఈ మేరకు కస్టమర్ సమాచార పత్రాన్ని (సీఐసీ) బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) సవరించింది. దీనివల్ల పాలసీదారులు నియమ నిబంధనలు, షరతుల గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయంలో పాలసీ డాక్యుమెంట్‌ది కీలక పాత్ర అని పేర్కొంది. కాబట్టి పాలసీకి సంబంధించి ప్రాథమిక వివరాలు, అవసరమైన సమాచారాన్ని సులువైన పదాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని సర్క్యులర్‌లో తెలిపింది.
బీమా సంస్థకు, పాలసీ హోల్డర్‌కు మధ్య వివరాల విషయంలో అస్పష్టత మూలంగానే అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌ను సవరిస్తున్నట్లు ఐఆర్‌డీఏఐ చెప్పింది. సవరించిన సీఐఎస్ ప్రకారం.. బీమా ప్రొడక్ట్/ పాలసీ, పాలసీ నంబర్, ఇన్సురెన్స్ టైప్, సమ్ అష్యూర్డ్ వంటి ప్రాథమిక సమాచారం ఇవ్వాలి. అలాగే, హాస్పటల్ ఖర్చులు, పాలసీలో కవర్ కానివి, వెయిటింగ్ పీరియడ్, కవరేజీ పరిమితులు, క్లెయిమ్ ప్రొసీజర్, గ్రీవెన్స్/ కంప్లయింట్స్ వివరాలు వంటివీ పొందుపరచాలని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. ఒకవేళ పాలసీ హోల్డర్ కోరితే సదరు వివరాలు స్థానిక భాషలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది. సవరించిన సీఐసీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఐఆర్‌డీఏఐ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment