basics
-
ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ ప్రమాదకరం!
ఫేస్బుక్ సంస్థ.. ఫ్రీ బేసిక్స్ పేరున ప్రజలను మోసగిస్తోందా? నెట్ న్యూట్రాలిటీకి తూట్లు పొడుస్తూ యూజర్లని మభ్యపెడుతోందా? గతంలో ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ వివాదాస్పదం అవ్వడంతో.. మరింత ఆకట్టుకునేందుకు ఫ్రీ బేసిక్స్ డాట్ కామ్ తో మళ్ళీ ముందుకొచ్చిందా? ఈ కొత్త ప్లాన్ వెనుక ఫేస్ బుక్ పెద్ద ఎత్తుగడే ఉందంటున్నారు నిపుణులు. జనానికి ఉచితి సర్వీసులు అందిస్తున్నట్లు చేసి... స్వలాభం కోసం ప్రయత్నిస్తోందని... ఫేస్ బుక్ అందిస్తున్న ఫ్రీ బేసిక్స్ ఎప్పటికైనా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నెట్ న్యూట్రాలిటీ అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్నెట్ను అందరికీ సమానంగా అందుబాటులో ఉంచడం ‘నెట్ న్యూట్రాలిటీ' ప్రధాన లక్ష్యం. ఇంటర్నెట్ లో అన్ని వెబ్ సైట్లనూ వినియోగదారులంతా ఒకే రీతిలో వాడుకునేందుకు వీలుగా.. యూజర్లంతా స్పందించాలని 'సేవ్ ద ఇంటర్నెట్' పేరున ఇప్పటికే ఆన్ లైన్ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఫేస్ బుక్ మార్కెటింగ్ మాయాజాలాన్ని ఎదుర్కొనేందుకు వినియోగదారులు ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండాలని కోరుతూ ట్రాయ్‌కు సైతం ఫిర్యాదులు చేశారు. అయితే కొందరు టెలికాం అపరేటర్లు ప్యాకేజీల పేరున వినియోగదార్లను ఆకట్టుకొని.. ఇంటర్నెట్ వినియోగం నియంత్రించే ప్రయత్నాలు చేయడంతోనే అసలు గొడవ మొదలైంది. ఇదే తరహాలో వచ్చిన ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ సరైన పద్ధతి కాదని, ఇతర దేశాలు ప్రోత్సహిస్తున్న ఈ మార్కెటింగ్ పద్ధతిని తిప్పికొట్టాలని యూజర్లు సంఘంగా ఏర్పడ్డారు. ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. ఫ్రీ బేసిక్స్ ద్వారా ఇంటర్నెట్ వాడకం మన చేతుల్లోనుంచి టెలికమ్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళబోతోంది అన్నది నిపుణుల ఉవాచ. ప్రజలకు ఫ్రీ ఇంటర్నెట్ అందించేందుకు ఇంకా ఎన్నో ఇతర పద్ధతులు ఉన్నాయని, ఫేస్ బుక్ పోటీతత్వంతో స్వప్రయోజనాలను ప్రజలపై రుద్దే ప్రయత్నంలో భాగంగా ఫ్రీ బేసిక్స్‌ను తెస్తోందని చెప్తున్నారు. ఫ్రీ బేసిక్స్‌కు ఏమాత్రం మద్దతివ్వద్దంటున్నారు. నిజానికి ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ కోసం టెలికాం ఆపరేటర్లకు ఎలాంటి బిల్లూ చెల్లించదు. ఇది టెలికాం ఆపరేటర్లే చెల్లించాల్సి వస్తుంది. ఈ విధంగా ఇంటర్నెట్ డేటా ఖర్చును తగ్గించుకుని ఫేస్ బుక్ తన పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు. అంతేకాదు ఫ్రీ బేసిక్స్ తన భాగస్వాములకు మాత్రమే ఉచిత సౌకర్యాన్ని అందిస్తుంది. మిగిలినవారంతా ఇంటర్నెట్ కోసం ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా నెట్ న్యూట్రాలిటీని ఉల్లంఘించడమే అవుతుంది. భారత దేశంలో రోజురోజుకీ ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2015 సంవత్సరంలో ఫ్రీ బేసిక్స్ అందుబాటులో లేని సమయంలో దేశంలో వంద మిలియన్ల వినియోగదారులు కొత్తగా చేరారు. ఇప్పుడు ఫ్రీ బేసిక్స్ బహిరంగ వేదిక కాకపోగా.. ప్రత్యేకంగా తమకు కొన్ని మార్గదర్శకాలను కూడ నిర్వచించుకోవడం విశేషం. అందుకు అనుగుణంగానే వినియోగదారులు కూడ నడచుకోవాల్సి వస్తుంది. ఇది ప్రజలను మభ్యపెట్టడమూ, తప్పుదారి పట్టించడమేనని కొన్ని టెలికాం సంస్థలు సైతం చెప్తున్నాయి. ఫ్రీ బేసిక్స్ పేరున ఫేస్ బుక్ అన్ని సైట్లలో ఉచితంగా చొరబడగలగడమే కాక, ఎన్.ఎస్.ఏ కు డేటా అందించడం కూడ భారత దేశ భ్రతకే ముప్పు అంటున్నారు నిపుణులు. నిజానికి ఫ్రీ బేసిక్స్ ప్రకటనలకూ అతీతమేం కాదు. తమ సైట్లో ప్రకటనలు ఉండవు అని చెప్పడం లేదు. 3.2 మిలియన్ల ప్రజలు తమకు మద్దతు పలుకుతున్నారని చెప్పడంలోనే నిజం కనిపించడం లేదు. వారికి వచ్చిన ఈ మెయిల్స్ లో న్యాయబద్ధమైనవి ఎన్ని ఉంటాయనేది అనుమానమే అంటున్నారు ఆన్ లైన్ ఉద్యమకారులు. ఫ్రీ బేసిక్స్ ను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించవద్దని గట్టిగా చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం నెట్ న్యూట్రాలటీ అంశం పై చెలరేగిన వివాదాన్ని క్రేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీన్ని అధ్యయనం చేసేందుకు పలువురు నిపుణుల కమిటీని కూడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
నేపథ్యాన్ని అవగాహన చేసుకుంటూ.. ప్రిపరేషన్ సాగించాలి
ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న పర్యావరణం సంబంధిత అంశాల పట్ల సివిల్స్ ఔత్సాహికులకు అవగాహ ఉండాలనే ఉద్దేశంతో సిలబస్‌లో ఆయా అంశాలకు చోటు కల్పించారు. ఆ మేరకు సివిల్స్ ప్రిలిమ్స్ సిలబస్‌లో పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం, శీతోష్ణస్థితి మార్పు, జీవ వైవిధ్య పరిరక్షణ అంశాలను ప్రవేశ పెట్టారు. కేవలం ప్రిలిమ్స్‌లోనే కాకుండా మెయిన్‌సలోని జనరల్ స్టడీస్ పేపర్-3లో పర్యావరణ నష్టం, జీవ వైవిధ్య పరిరక్షణ అంశాలను చేర్చారు. రాబోయే కాలంలో సహజవనరులు, పర్యావరణ నిర్వహణ (Environment Management) ప్రాధాన్యతను గుర్తించి ఈ అంశాలకు సిలబస్‌లో పొందుపరిచారు. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాల నేపథ్యాన్ని అవగాహన చేసుకోవడం ఎంతో అవసరం. మరో కీలక విషయం.. సివిల్స్ ప్రిలిమ్స్‌లోని 100 ప్రశ్నల్లో దాదాపు 10 నుంచి 15 ప్రశ్నలు ఈ అంశాల నుంచి కచ్చితంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలను సమగ్రంగా అవగాహన చేసుకోవాలంటే అభ్యర్థులు బయాలజీకి సంబంధించిన ప్రాథమిక భావనల (బేసిక్స్)పై పట్టు సాధించాలి. అభివృద్ధి దిశగా వడివడిగా అడుగలు వేస్తున్న మానవుడు.. ఆదే క్రమంలో సహజ వనరులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. భావితరాల సుస్థిరతను పట్టించుకోకుండా మితిమీరిన వినియోగానికి పాల్పడుతున్నాడు. దాని ప్రభావం వ్యవసాయం, సముద్రమట్టం, జల వలయం, హిమనదులపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, జీవవైవిధ్య సంరక్షణ, కాలుష్య నిర్మూలన వంటివి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సమకాలీన దృక్పథం: కాలుష్య కారకాల ప్రభావాలను తెలుసుకునే క్రమంలో సమకాలీన దృక్పథాన్ని అవలంబించడం ముఖ్యం. ఇటీవల కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోని పర్యావరణ కాలుష్య సంఘటనలు, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు విడుదల చేసిన నివేదికలను తప్పనిసరిగా పరిశీలించాలి. అదే విధంగా ముఖ్యమైన కాలుష్య కారకాలు, వాటి ప్రభావాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు వాపు నివారణలో ఉపయోగించే డైక్లోఫినాక్ అనే ఔషధం రాబందుల సంఖ్య తగ్గడానికి ఏ విధంగా కారణమవుతుంది? ఎండోసల్ఫాన్ వినియోగం ద్వారా దేశంలో క్యాన్సర్లు ఎలా సంభవిస్తున్నాయి? వాటితోపాటు పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్, ట్రైక్లోసన్, పారాబెన్స, సోడియం లారెల్ సల్ఫేట్ తదితరాల మూలం, ప్రభావాలను తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ మధ్య ఈ రసాయనాలు, వాటి ప్రభావాలు అధిక చర్చల్లో ఉండటమే ఇందుకు కారణం. ఎకాలజీ: ఆవరణ శాస్త్రం (Ecology) విషయానికొస్తే.. ఈ విభాగం నుంచి అడుగుతున్న ప్రశ్నలు తప్పనిసరిగా ప్రాథమిక భావనల(బేసిక్స్)పై ఉంటున్నాయి. కాబట్టి ముందుగా ఎకాలజీ (Ecology) అంటే ఏమిటి? ఈ భావన ఎలా అభివృద్ధి చెందింది? ఎకాలజీ అనే పదాన్ని ముఖ్యమైన ఆవరణ శాస్త్రవేత్తలు (హెకెల్, ఓడం, చార్లెస్ ఎల్టన్, క్లెమెంట్స్) ఏ విధంగా నిర్వచించారు వంటి అంశాలను తెలుసుకోవడం ముఖ్యం. ఆ తర్వాత ఎకాలజీలోని ప్రాథమిక భావనల (Fundamental Concepts చదవడం ప్రయోజనకరం. తద్వారా ఈ అంశంపై స్పష్టమైన అవగాహన లభిస్తుంది. ఆ తర్వాత స్పీషీస్, జాతి ఉత్పత్తి (Speciation), ఆటెకాలజీ, సినెకాలజీ, బయోమ్యాగ్నిఫికేషన్, ఆవాసం, జనాభా, కమ్యూనిటీ, బయోం, ఆవరణ వ్యవస్థ (Eco System) నిర్మాణం, విధులు, ఆవరణ వ్యవస్థ శక్తి ప్రసరణ (Energy Flow), జీవ భౌమ రసాయన వలయాలు (Bio Geochemical Cycles), ఆహార శృంఖలాలు, జీవావరణ అనుక్రమం వంటి అంశాలను చదవాలి. ప్రకృతిలోని వివిధ అనుకూల, ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా జీవులు ప్రదర్శించే అనుకూలతల (Adaptations)తోపాటు కొన్ని పర్యావరణ సూత్రాలను తెలుసుకోవాలి.ఒకసారి ఆవరణ శాస్త్ర భావనల అధ్యయనం తర్వాత కాలుష్యం అనే అంశంపై దృష్టి సారించాలి. పర్యావరణ కాలుష్యం, కాలుష్య కారకాలు, వాటి రకాలు, వాయు, జల, శబ్ద, నేల కాలుష్యం, కారణాలు, ప్రభావాలు, నివారణ చర్యలు, చట్టాలు మొదలైన వాటిని విస్తృతంగా చదువుకోవాలి. వీటికి అదనంగా కాంతి కాలుష్యం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ewaste), బయో మెడికల్ వ్యర్థాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. జీవ వైవిధ్యం: మానవ మనుగడ ఇతర జీవులపై ఆధారపడి ఉంటుంది. భూమిపై అపారంగా ఉన్న జీవ వైవిధ్య సంరక్షణ ద్వారానే సుస్థిర మానవ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఒకప్పుడు అడవులను కలప వనరులుగానే భావించారు. ప్రస్తుతం ప్రతి జీవి, మొక్క, జంతువు, సూక్ష్మజీవులు మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే విషయంలో అవగాహన పెరిగింది. ఒక జీవిలోని వేల జన్యువుల్లో ఒక జన్యువు మాత్రమే అపారమైన విలువలను కలిగి ఉంటుందని మానవునికి అర్థమైన తర్వాత జీవ వైవిధ్య పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించాడు. అధిక జీవ వైవిధ్య సంపద ఉన్న దేశాలు భవిష్యత్తులో వ్యవసాయ, వైద్య, పారిశ్రామిక, సామాజిక, విద్యా రంగాల్లో ప్రగతిని సాధించగలుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొదటి 17 మెగా బయో డైవర్సిటీ కేంద్రాల్లో భారత్ స్థానం ఆరు. ప్రపంచ భూభాగంలో కేవలం 2.4 శాతం ఉన్న భారత్ ప్రపంచ జీవ వైవిధ్యంలో 8 శాతం వాటాను కలిగి ఉంది. భారత్ జీవ వైవిధ్యంలో 33 శాతం వరకు స్థానీయ వైవిధ్యం కనిపిస్తుంది. అనాదిగా ఈ జీవ వైవిధ్యంపై ఎన్నో రకాలుగా ఆధారపడుతూనే ఉంది. అయితే వాటి విలువలను గుర్తించి పరిశోధనలు చేసి పేటెంట్ హక్కులు పొందడంలో మాత్రం భారత్ ఘోరంగా విఫలమైంది. మన వైవిధ్యంపై ఇతరులు పేటెంట్ హక్కులు పొందినా మనం ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏం చదవాలి? జీవ వైవిధ్యం ఏమిటి? ఆ భావన అభివృద్ధి చెందిన తీరు? జీవ వైవిధ్య స్థాయిలు, రకాల గురించి తెలుసుకోవాలి. దేశంలోని ముఖ్యమైన మొక్కలు, జంతు జాతులు, ముఖ్యంగా ఎండమిక్ జాతులు, శాస్త్రీయ నామాలు, వాటి విస్తరణపై అవగాహన పెంచుకోవాలి. అంతేకాకుండా వైద్య, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో వాటి ప్రయోజనాలను తెలుసుకోవాలి. పరిణామ సిద్ధాంతాల (Darwin, Lamarck, Hugode Vriesపె అవగాహన పెంచుకోవాలి. జీవ వైవిధ్య హాట్స్పాట్లు, ప్రపంచ వ్యాప్తంగా వాటి ప్రమాణాలు, దేశ వ్యాప్తంగా గుర్తించిన హాట్స్పాట్లు వాటి ప్రాధాన్యతను చదువుకోవాలి. అదే సమయంలో జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదాలను తెలుసుకోవడం ముఖ్యం. తిమింగలాలు, డాల్ఫిన్లు, సొరచేపలు, ఖడ్గమృగం, పులి, బట్టమేక పక్షి, చింపాంజీ, ఉడుము, ఏనుగు, ఆసియా సింహం, దుప్పి జాతులు ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి అధ్యయనం చేయాలి. అంతేకాకుండా వాటి సంరక్షణ విధానాలు, ముఖ్యంగా ఇన్‌సిటు, ఎక్స్‌సిటు సంరక్షణ పద్ధతుల గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ క్రమంలో జన్యు బ్యాంకులు, క్షేత్ర జన్యు బ్యాంకులు (బొటానికల్ గార్డెన్స ఆర్బోరెటం), టిష్యూ కల్చర్, క్రయో ప్రిజర్వేషన్, జాతీయ పార్కులు, అభయారణ్యాలు, కన్జర్వేషన్ రిజర్వు, కమ్యూనిటీ రిజర్వులు, బయోస్ఫియర్ రిజర్వు (దాని భాగాలు) మొదలైన సంరక్షణ విధానాలు, వాటి మధ్య భేదాలు తెలుసుకోవాలి. అదనంగా ప్రాజెక్టు టైగర్, ప్రాజెక్టు ఎలిఫెంట్ మొదలైన కార్యక్రమాలపై సమాచారం తెలుసుకోవాలి. -
జీవిత బీమా పరిభాష..
బేసిక్స్ జీవిత బీమా తీసుకునేటప్పుడు రకరకాల పదాలు వినవస్తుంటాయి. వీటిలో కొన్నింటిని గురించి క్లుప్తంగా.. సమ్ అష్యూర్డ్ దీన్నే కవరేజ్ అని కూడా అంటారు. బీమా కంపెనీ పాలసీకి సంబంధించి గ్యారంటీగా ఇచ్చే సొమ్ము ఇది. పాలసీని బట్టి బోనస్‌లు, వడ్డీ మొదలైనవి కూడా దీనికి జత కావొచ్చు. పాలసీ మెచ్యూర్ అయ్యాక (వ్యవధి పూర్తయిపోయాక) పాలసీదారుకు ఈ మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ఈలోగానే పాలసీదారు మరణించిన పక్షంలో వారి వారసులకు దీన్ని అందిస్తుంది. ప్రీమియం.. పాలసీ కవరేజీ కోసం పాలసీదారు తరచుగా కొంత మొత్తం బీమా కంపెనీకి కట్టాలి. దీన్నే ప్రీమియం అంటారు. ఒక రకంగా ఇది ఇన్స్టాల్మెంట్ అనుకోవచ్చు. పాలసీదారు వయసును బట్టి ప్రీమియం మారుతుంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వ్యక్తి తీసుకునే పాలసీకి, 40 ఏళ్ల వ్యక్తి తీసుకునే పాలసీకి ప్రీమియంలు వేర్వేరుగా ఉంటాయి. ఆయా పాలసీలను బట్టి పాలసీదారు ఏకమొత్తంగా ఒకేసారైనా కట్టేయొచ్చు లేదా ఏడాదికో, ఆర్నెల్లకో, మూడు నెలలకోసారి కట్టే విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి పాలసీకి ఇన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలని ఉంటుంది. యాన్యుటీ పథకాలు.. కంపెనీకి ఒకేసారి ఏకమొత్తంగా కట్టేసి.. జీవితాంతం నెలకి కొంత చొప్పున తిరిగి పొందే పథకాలు ఇవి. ఇందులో ఇమ్మీడియట్ అని.. డిఫర్డ్ అని రెండు రకాలు ఉంటాయి. ఇమ్మీడియట్ విధానంలో .. కంపెనీకి డబ్బు కట్టేసిన మరుసటి నెల నుంచి మనకు రావాల్సిన చెల్లింపులు మొదలవుతాయి. ఇక రెండో విధానంలో.. మనం ఎప్పట్నుంచి కావాలని కోరుకుంటామో అప్పట్నుంచే కంపెనీ చెల్లించడం మొదలుపెడుతుంది. మనకు నెలకు ఎంత వస్తుందనేది.. ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. -
మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ..
బేసిక్స్.. బీమా పాలసీ వ్యవధిలో మధ్యమధ్యలో కొద్ది కొద్ది మొత్తం వెనక్కి తిరిగిచ్చే పాలసీలు మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. నాలుగేళ్ల తర్వాత సమ్ అష్యూర్డ్‌లో 20 శాతం మొత్తాన్ని, అటుపైన 8 ఏళ్ల తర్వాత మరో 20 శాతాన్ని ఆ తర్వాత మిగతా మొత్తం అందిస్తాయి. పాలసీ వ్యవధి అంతా పూర్తయ్యే దాకా నిరీక్షించాల్సిన అవసరం లేకుండా మధ్యమధ్యలో తలెత్తే అవసరాలకు ఉపయోగపడేలా ఈ పాలసీలు ఉంటాయి. ఈ పాలసీలకి వచ్చే ప్రీమియంలను కంపెనీలు ఎక్కువగా సురక్షితమైన సాధనాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం వల్ల రాబడి స్థిరంగా ఉన్నా.. కాస్తంత తక్కువగా ఉంటుంది. పింఛను పథకాలు.. ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. ఇందుకోసం ఉపయోగపడేవే ఈ తరహా పథకాలు. యుక్తవయసులో, మెరుగైన ఆదాయం ఆర్జిస్తున్నప్పట్నుంచే ఈ ప్లాన్లను ఎంచుకుంటే పదవీ విరమణ సమయం నాటికి మరింత ఆర్థిక స్థిరత్వం సాధించడానికి సాధ్యపడుతుంది. డిఫర్డ్ యాన్యుటీ అని ఇమ్మీడియట్ యాన్యుటీ అని రెండు రకాల పాలసీలను కంపెనీలు అందిస్తున్నాయి. ఇమ్మీడియట్ విధానంలో పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత నుంచి తక్షణం ప్రతి నెలా పింఛను అందుకునే వీలుంటుంది. అదే డిఫర్డ్ విధానంలో ఏటా కొంత కొంతగా ప్రీమియం కట్టుకుంటూ వెడితే.. రిటైర్మెంట్ నాటికి గణనీయంగా నిధి పోగుపడుతుంది. అందులో నుంచి కొద్ది కొద్దిగా పింఛను అందుకోవచ్చు. పింఛను పథకాలు ..వృద్ధాప్యం, రిటైర్మెంట్ అవసరాల కోసం ఉద్దేశించినది. అదే మనీ బ్యాక్ పథకాలనేవి.. పిల్లల చదువు, పెళ్లిళ్లు, ప్రాపర్టీల కొనుగోళ్లు తదితర అవసరాల కోసం ఉపయోపడతాయి. అలాగే, రిటైర్మెంట్ తర్వాత నుంచి పింఛను పథకాల ద్వారా రాబడులు వస్తాయి. అదే మనీ బ్యాక్ పాలసీలైతే.. మధ్యమధ్యలోనే రాబడులు చేతికొస్తుంటాయి. ఈ రెండు పథకాల్లోనూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. -
గోరంత ప్రీమియం.. టర్మ్ ఇన్సూరెన్స్..
బేసిక్స్.. బీమా బీమా పాలసీల్లో రకరకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇందులో టర్మ్ పాలసీల విషయానికొస్తే.. నిర్దిష్ట కాలానికి నిర్దిష్ట కవరేజీని అందిస్తాయి ఇవి. బీమా ప్రధానోద్దేశ్యానికి చక్కగా సరిపోయే సిసలైన పాలసీలు ఇవి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజి అందిస్తాయివి. పాలసీ వ్యవధిలో గానీ పాలసీదారు మరణిస్తే.. కవరేజి మొత్తాన్ని వారి కుటుంబ సభ్యుల (నామినీ)కు అందిస్తుంది కంపెనీ. ఒకవేళ అలాంటిదేమీ జరగకపోతే .. అప్పటిదాకా కట్టిన ప్రీమియం మొత్తం తిరిగి రాదు. ఉదాహరణకు పదిహేనేళ్ల పాటు కవరేజీ తీసుకున్న పక్షంలో.. ఏటా ప్రీమియం కడుతూనే ఉండాలి. ఈ పదిహేనేళ్ల లోపు పాలసీదారు గానీ మరణిస్తే.. ఎంత కవరేజీకి పాలసీ తీసుకున్నారో..అంత మొత్తమూ కుటుంబ సభ్యులకు వస్తుంది. ఒకవేళ పదిహేనేళ్ల తర్వాత కూడా జీవించి ఉన్నా.. కట్టిన ప్రీమియం వెనక్కి రాదు, పాలసీ వ్యవధీ ముగిసిపోతుంది. అయినా కూడా బీమా ప్రధానోద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే అత్యంత తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇచ్చే ఈ తరహా పాలసీలే కరెక్ట్ అంటుంటారు నిపుణులు. సాధారణంగా 10,15,20,30 ఏళ్ల వ్యవధికి సంబంధించి ఈ పాలసీలు లభిస్తాయి. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ .. ప్రీమియాలు సరిగ్గా కట్టుకుంటూ వెడితే .. ఇది శాశ్వత ప్రాతిపదికన , జీవితాంతం బీమా కవరేజీ కల్పిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి. అయితే టర్మ్ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్యూర్ హోల్ లైఫ్ అనీ లిమిటెడ్ పేమెంట్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనీ రెండు రకాలు ఉంటాయి. ప్యూర్ హోల్ లైఫ్ పాలసీల్లో చివరిదాకా ప్రీమియాలు కట్టాల్సి ఉంటుంది. అదే రెండో రకం దాంట్లో ప్రీమియాలు కొంత కాలం దాకానే కట్టాల్సి ఉంటుంది. కవరేజీ మాత్రం చివరిదాకా కొనసాగుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడే ఇలాంటివి తీసుకుంటే వార్షిక ప్రీమియాలు తక్కువ ఉంటాయి. ఎండోమెంట్ ప్లాన్లు .. టర్మ్, హోల్ లైఫ్ ప్లాన్ల కన్నా ఇవి మరింత ఖరీదైనవి. పాలసీ వ్యవధి ముగిసిపోయిన తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో సమ్ అష్యూర్డ్‌తో పాటు అప్పటిదాకా పోగుపడిన బోనస్‌లు కూడా కంపెనీ చెల్లిస్తుంది. అదే పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించిన పక్షంలో ఆ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది. ఇందులో రివర్షన రీ, టర్మినల్ అని రెండు రకాల బోనస్‌లు ఉంటాయి. రివర్షనరీ విధానంలో ఏటా బోనస్‌ను కలిపి, పాలసీ వ్యవధి చివర్లో చెల్లిస్తారు. అదే టర్మిన ల్ విధానంలో పాలసీ వ్యవధి ఆఖర్న అదనంగా లాయల్టీ బోనస్ లభిస్తుంది. ఇక ఎండోమెంట్ పాలసీల్లో తీవ్ర అనారోగ్యం పాలైనా, ప్రమాదవశాత్తు మరణం సంభవించినా, తాత్కాలికంగా లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవించినా ఎదుర్కొనేందుకు ఉపయోగపడేలా రైడర్లను తీసుకోవచ్చు. వివిధ అవసరాలకు వివిధ రకాల ఎండోమెంట్ ప్లాన్లు తీసుకోవచ్చు. చదువుకోసమని, పెళ్లి కోసమని, యూనిట్ లింక్డ్ అని వివిధ రకాల ప్లాన్లు ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్‌లో పాలసీదారు మరణిస్తే మాత్రమే నామినీకి పాలసీ మొత్తం లభిస్తుంది. అదే పాలసీ వ్యవధి దాటిన తర్వాత జీవించి ఉన్నా కంపెనీ ఏమీ చెల్లించదు. కానీ ఎండోమెంట్ ప్లాన్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిము చెల్లిస్తుంది. అలాగే, రాబడులు కూడా అందించాల్సినందువల్ల ప్రీమియాలను బీమా కంపెనీ వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక టర్మ్ పాలసీలతో పోలిస్తే దీని ప్రీమియాలు ఎక్కువగానే ఉంటాయి. ఏదైతేనేం.. ఒకవైపు లైఫ్ కవరేజీతో పాటు ఇతరత్రా ప్రయోజనాలు కూడా పొందాలనుకుంటున్న వారు వీటిని తీసుకోవచ్చు. వచ్చే వారం .. మనీ బ్యాక్ తదితర ప్లాన్ల గురించి.. -
కొండంత భరోసా..
బేసిక్స్.. బీమా జీవితం, ఆరోగ్యం మొదలు ఇళ్లు, వాహనాల దాకా ఊహించని ప్రమాదాల్లో చిక్కుబడినప్పుడు ఆర్థిక పరిస్థితులు తల్లకిందులు కాకుండా భరోసా కల్పించేవి బీమా పాలసీలు. కొంత డబ్బు కడితే కొండంత భరోసా కల్పించే బీమా పాలసీల ఆవశ్యకతపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీమాకి సంబంధించిన ప్రాథమిక అంశాల గురించి తెలియజేసే ప్రయత్నమే ఇది. బీమా అనగానే ఠక్కున గుర్తొచ్చేది జీవిత బీమా .. ఎల్ఐసీ (అదే.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్). కానీ, ఇన్సూరెన్స్ అంటే ఇదొక్కటే కాదు. లైఫ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటూ అవసరానికి ఒకటి చొప్పున రకరకాల పాలసీలు ఉన్నాయి. వీటిలో ముందుగా జీవిత బీమా పాలసీలతో మొదలుపెడదాం. పాలసీ తీసుకున్న వ్యక్తి హఠాత్తుగా మరణించినా.. వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఆర్థిక కష్టాల్లో పడకుండా చూడటం జీవిత బీమా పాలసీల ముఖ్యోద్దేశం. పాలసీదారులు తమ తమ ఆదాయాలు, కుటుంబ అవసరాలను బట్టి ఎంత మొత్తానికి బీమా పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోవచ్చు. దీన్నే కవరేజి అంటారు. ఈ కవరేజి పొందడానికి కొంత మొత్తాన్ని బీమా కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే ప్రీమియం అంటారు. మొత్తం ప్రీమియాన్ని ఒకేసారే చెల్లించాల్సిన పని లేకుండా మూణ్నెల్లకో, ఆర్నెల్లకో, ఏడాదికో ఒకసారి చొప్పున దీన్ని చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి కంపెనీలు. సాధారణంగా.. వార్షికాదాయానికి పది రెట్లు కవరేజీ ఉండేలా బీమా పాలసీ తీసుకోవడం మంచిది. ప్రీమియం కూడా కవరేజికి తగినట్లే ఉంటుంది. అంతే కాదు.. వయసును బట్టి ఇది మారిపోతుంటుంది. అంటే పది లక్షల రూపాయల కవరేజి కోసం పాతికేళ్ల వ్యక్తికి కొంత తక్కువగా ప్రీమియం ఉంటే 35 ఏళ్ల వ్యక్తికి మరింత ఎక్కువగా ఉంటుంది. పథకాలు రకరకాలు: లైఫ్ ఇన్సూరెన్స్‌లో వివిధ పథకాలు ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్, మనీ బ్యాక్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (యులిప్స్) లాంటివి ఇందులో ఉన్నాయి. -
లాభాలతో బయటపడాలంటే..
బేసిక్స్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనడాన్ని, అమ్మడాన్ని ప్రభావితం చేసే మరికొన్ని అంశాలు ఈ వారం బేసిక్స్‌లో. సాధారణంగా ఫండ్ వేటిలో ఇన్వెస్ట్ చేస్తోందన్న దానిపై పన్నుపరమైన ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ పన్నుపరమైన విధానాలు మారితే సదరు ఫండ్ స్వరూపం కూడా మార్చాల్సి రావొచ్చు. దీంతో మన సామర్థ్యాన్ని మించి రిస్కు ఎదురుకావచ్చు. ఇలాంటప్పుడు.. యూనిట్లను విక్రయించి, మెరుగైన ప్రయోజనాలనిచ్చే మరో సాధనంలో ఇన్వెస్ట్ చేయాల్సి రావొచ్చు. ఇదే కాకుండా కొన్ని సార్లు మరింత మెరుగైన రాబడుల కోసం ఫండ్ విభిన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు .. టెక్నాలజీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ విషయాన్ని తీసుకుందాం. టెక్నాలజీ బూమ్ సమయంలో మార్కెట్లోకి వచ్చిన ఇవి ఆ తర్వాత గణనీయంగా దెబ్బతిన్నాయి. కానీ, యూనిట్లు చౌకగా దొరుకుతుండటంతో, దీర్ఘకాలికంగా మళ్లీ పెరుగుతాయన్న ఉద్దేశంతో కొందరు వీటిలో ఇన్వెస్ట్ చేశారు. అయితే, ఆ తర్వాత పనితీరు అంతకంతకూ పడిపోతుండటంతో సదరు ఫండ్స్ అధిక రాబడులు అందించే ఇతర స్టాక్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపడం మొదలుపెట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు ఏ లక్ష్యాన్ని ఆశించి ఇన్వెస్ట్ చేశారో.. అది సాకారం కాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఫండ్ నుంచే వైదొలగాల్సి వచ్చింది. కాబట్టి ఇలా ఫండ్ లక్ష్యం మారిపోయినా బైటపడాల్సి రావొచ్చు. ఫండ్ మేనేజర్ మార్పు.. ఫండ్ విషయంలో ఫండ్ మేనేజర్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తారు. మన డబ్బును ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ విధానం ఎలా ఉండాలి.. లాంటి అంశాలన్నింటిపైనా మేనేజర్, తన టీమ్ నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని బట్టే రాబడులు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మేనేజర్ మారిపోతే మనం కూడా ఫండ్ నుంచి వైదొలగాలని కాదు. అయితే, ఫండ్ పనితీరును బాగా పరిశీలిస్తూ ఉండాలి. పనితీరు గానీ గణనీయంగా దెబ్బతిన్న పక్షంలో వైదొలగడం మంచిది. కొన్నిసార్లు ఫండ్ పరిమాణం భారీగా పెరిగిపోయినా లేదా భారీగా తగ్గిపోయినా.. రాబడులు తగ్గనూ వచ్చు లేదా కొత్త ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు చేజారనూ వచ్చు. ఇలాంటి సందర్భాల్లో సైతం వైదొలగడం ఉత్తమం. వీటన్నింటికి తోడు.. వ్యక్తిగత అవసరాలను బట్టి అమ్మాల్సిన పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. ఇలా.. ఫండ్ కొనడం, అమ్మడానికి సంబంధించి ముందుగానే కొన్ని నిబంధనలను పెట్టుకుని, వాటికి కట్టుబడి ఉంటే పెట్టుబడులు క్రమబద్ధంగా సాగిపోతాయి. మెరుగైన రాబడులను అందుకోవడానికీ సాధ్యపడుతుంది. ఇవీ మ్యూచువల్ ఫండ్స్ వివరాలు.. ఇక వచ్చే వారం నుంచి బీమా గురించిన వివరాలు తెలుసుకుందాం. -
అధిక రాబడులు పొందేదిలా..
ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి వదిలేయడం కాకుండా మధ్యమధ్యలో సమీక్షించుకుంటూ ఉండాలి. ఫండ్ దిశ మార్చుకున్నా, లేదా నిరంతరంగా సరైన పనితీరు కనబర్చకున్నా వ్యూహాన్ని మార్చుకోవాలి. సాధారణంగా ఫండ్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో దాదాపు ఒకే రకమైన సమస్యలు కనిపిస్తుంటాయి. వీటిని గానీ అర్థం చేసుకుని సరిచేసుకోగలిగితే మెరుగైన రాబడులు అందుకోవచ్చు. ఒకే ఫండ్ కాకుండా వివిధ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదనే ఉద్దేశంతో.. ఒకదాని తర్వాత మరొకటిగా ఇన్వెస్ట్ చేస్తూ వెడతారు. తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే ముప్పై-నలభై ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో పోగుపడతాయి. చివరికి ఏదీ సరైన రాబడి ఇవ్వకుండా పోతుంది. డైవర్సిఫికేషన్ మంచిదే కానీ.. మరీ అతిగా కూడా చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఫండ్ పనితీరు రేటింగ్ కూడా ముఖ్యమే. అయితే, ఏ ఫండ్ కూడా నిరంతరం టాప్ రేటింగ్‌లతో ఉండదు. పైగా మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త థీమ్స్‌పై క్రేజ్ ఉంటుంది. కనుక, టాప్ రేటింగ్‌లు, కొత్త థీమ్స్ ఫండ్స్ అంటూ వాటి వెనుక వెడితే మళ్లీ యథాప్రకారం ఫండ్స్ పోగుపడటం తప్ప ప్రయోజనం ఉండదు. అందుకే, టాప్ అని కాకుండా స్థిరంగా మెరుగైన పనితీరు కనపరుస్తున్న వాటితో కొనసాగడం మంచిది. సదరు సంస్థ ఇన్వెస్టింగ్ తీరు, ఫండ్ పరిమాణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, స్వల్పకాలికంగా అవ సరాల కోసం డెట్ సాధనాల్లోనూ, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈక్విటీ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే, ఇవి రెండూ వివిధ దిశల్లో వెడుతుంటాయి కనుక.. కొన్నాళ్లు పోయాక మీ లక్ష్యాలకు భిన్నంగా పోర్ట్‌ఫోలియో స్వరూపం మారవచ్చు. ఉదాహరణకు.. షేర్లలో పెట్టుబడులు ఎక్కువయ్యి రిస్కు పెరగడమో లేదా తక్కువయ్యి రావాల్సిన లాభాలను కోల్పోవడమో జరిగే అవకాశం ఉంది. కనుక, ఎప్పటికప్పుడు పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను సవరించుకుంటూ వెడితే రాబడులు మెరుగ్గా ఉంటాయి. -
ఫండ్ ఎంచుకోవడమిలా...
బేసిక్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏ ఫండ్‌ని ఎంచుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. అల్లాటప్పాగా బెస్ట్‌గా కనిపిస్తోంది కదాని దేన్ని పడితే దాన్ని ఎంచుకోకూడదు. మీ పెట్టుబడి లక్ష్యాలు, కేటాయించగలిగే డబ్బుకు అనుగుణంగా ఉన్న ఫండ్‌ని చూడాలి. మీరు ఎంత రిస్కు తీసుకోగలరు, బడ్జెట్ ఎంత కేటాయించగలరో చూసుకుని దానికి తగినట్లు ఉన్న సంస్థ ఫండ్‌ని ఎంచుకోవాలి. గతంలో చెప్పుకున్నట్లుగా ఒక్కో ఫండ్ ఒక్కో రకమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫిక్స్డ్ ఇన్కమ్, షేర్లు లాంటి వాటితో పాటు దీర్ఘకాలికమైన, స్వల్పకాలికమైన లక్ష్యాలతో పెట్టుబడులు పెడుతుంటుంది. కనుక మీ లక్ష్యం స్వల్పకాలికమైనదా లేదా దీర్ఘకాలికమైనదా, కాస్త ఎక్కువ రిస్కయినా తీసుకుని షేర్లలో పెట్టగలరా లేక సురక్షితమైన ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటివే మీకు నప్పుతాయా అన్నది చూసుకుని ఫండ్‌ని ఎంచుకోవాలి. పనితీరు.. ఫండ్‌ని ఎంచుకోవడానికి ముందు గతంలో దాని పనితీరు ఎలా ఉందో కూడా కొంత అధ్యయనం చేయాలి. ఇందుకోసం మీ లక్ష్యానికి అనుగుణంగా ఉన్న టాప్ అయిదు ఫండ్స్‌ని ఎంపిక చేసుకోండి. గత మూడు నెలల నుంచి మూడేళ్ల క్రితం దాకా అవి ఎలాంటి పనితీరు కనపర్చాయో చూసుకోండి. స్థిరమైన పనితీరు కనపర్చినవాటిని ఎంచుకోండి. ఇలా వివిధ ఫండ్ల పనితీరును తెలుసుకోవడానికి ఆన్లైన్ మాధ్యమం ఉపయోగపడుతుంది. ఫండ్‌ని.. అందునా ముఖ్యంగా ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్‌ని ఎంపిక చేసుకునేటప్పుడు వ్యయాలు కూడా పరిగణనలోకి తీసుకోవడమూ ముఖ్యమే. ఎందుకంటే మేనేజ్మెంట్ ఫీజని, వార్షిక వ్యయాలని, సేల్స్ లోడ్ అని రకరకలా వ్యయాలు చెల్లించాల్సి రావడం వల్ల ఆ మేరకు రాబడులు తగ్గుతాయి. సాధారణంగా ఒక్క శాతం మేర మేనేజ్మెంట్ ఫీజు, 0.6 శాతం దాకా ఇతర వార్షిక వ్యయాలు ఉంటే ఓకే అనుకోవచ్చు. ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, వైదొలిగేటప్పుడు చార్జీలు ఏమైనా ఉంటాయా, ఉంటే ఎంత స్థాయిలో ఉంటాయి అన్నదీ చూసుకోవాలి. ఇక .. డబ్బంతా కేవలం ఒకే ఫండ్‌లో పెట్టేయకుండా .. వీలైతే రెండు, మూడు ఫండ్స్‌ని ఎంచుకుంటే మంచిది. రెండు ఎంచుకుంటే.. ఒకదాంట్లో 60 శాతం మేర రెండో దాంట్లో 40 శాతం మేర ఇన్వెస్ట్ చేయండి. అదే మూడు ఎంచుకుంటే.. 50:30:20 వంటి నిష్పత్తిలో కేటాయింపులు జరపవచ్చు.