మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ..
బేసిక్స్.. బీమా
పాలసీ వ్యవధిలో మధ్యమధ్యలో కొద్ది కొద్ది మొత్తం వెనక్కి తిరిగిచ్చే పాలసీలు మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. నాలుగేళ్ల తర్వాత సమ్ అష్యూర్డ్‌లో 20 శాతం మొత్తాన్ని, అటుపైన 8 ఏళ్ల తర్వాత మరో 20 శాతాన్ని ఆ తర్వాత మిగతా మొత్తం అందిస్తాయి. పాలసీ వ్యవధి అంతా పూర్తయ్యే దాకా నిరీక్షించాల్సిన అవసరం లేకుండా మధ్యమధ్యలో తలెత్తే అవసరాలకు ఉపయోగపడేలా ఈ పాలసీలు ఉంటాయి. ఈ పాలసీలకి వచ్చే ప్రీమియంలను కంపెనీలు ఎక్కువగా సురక్షితమైన సాధనాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం వల్ల రాబడి స్థిరంగా ఉన్నా.. కాస్తంత తక్కువగా ఉంటుంది.
పింఛను పథకాలు..
ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. ఇందుకోసం ఉపయోగపడేవే ఈ తరహా పథకాలు. యుక్తవయసులో, మెరుగైన ఆదాయం ఆర్జిస్తున్నప్పట్నుంచే ఈ ప్లాన్లను ఎంచుకుంటే పదవీ విరమణ సమయం నాటికి మరింత ఆర్థిక స్థిరత్వం సాధించడానికి సాధ్యపడుతుంది. డిఫర్డ్ యాన్యుటీ అని ఇమ్మీడియట్ యాన్యుటీ అని రెండు రకాల పాలసీలను కంపెనీలు అందిస్తున్నాయి.
ఇమ్మీడియట్ విధానంలో పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత నుంచి తక్షణం ప్రతి నెలా పింఛను అందుకునే వీలుంటుంది. అదే డిఫర్డ్ విధానంలో ఏటా కొంత కొంతగా ప్రీమియం కట్టుకుంటూ వెడితే.. రిటైర్మెంట్ నాటికి గణనీయంగా నిధి పోగుపడుతుంది. అందులో నుంచి కొద్ది కొద్దిగా పింఛను అందుకోవచ్చు.
పింఛను పథకాలు ..వృద్ధాప్యం, రిటైర్మెంట్ అవసరాల కోసం ఉద్దేశించినది. అదే మనీ బ్యాక్ పథకాలనేవి.. పిల్లల చదువు, పెళ్లిళ్లు, ప్రాపర్టీల కొనుగోళ్లు తదితర అవసరాల కోసం ఉపయోపడతాయి. అలాగే, రిటైర్మెంట్ తర్వాత నుంచి పింఛను పథకాల ద్వారా రాబడులు వస్తాయి. అదే మనీ బ్యాక్ పాలసీలైతే.. మధ్యమధ్యలోనే రాబడులు చేతికొస్తుంటాయి. ఈ రెండు పథకాల్లోనూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.