జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. ఎవ్వరూ ఊహించలేరు. కానీ ఊహకందని ప్రమాదం జరిగినప్పుడు ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కార్పొరేట్ సంస్థలు, ఐపీపీబీ (ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్).. 'గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్' ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటికి సంబందించిన పూర్తి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఐపీపీబీ రూ.399 ప్లాన్
ఈ ప్లాన్ కింది మీరు ఏడాదికి రూ.399 చెల్లిస్తే.. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా సౌకర్యం పొందవచ్చు.
ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల హాస్పిటల్లో చేరితే యాక్సిడెంటల్ మెడికల్ ఖర్చులు కోసం రూ.60,000 లేదా ప్రమాదవశాత్తు వైద్య ఖర్చుల కోసం రూ.30,000 అందిస్తారు. అంతే కాకుండా హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి కుటుంబ ప్రయోజనం కింద రవాణా ఖర్చుల కోసం రూ.25,000 లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే అంత్యక్రియల కోసం మరో రూ.5,000 అందుతాయి. ఈ ప్లాన్ కింద ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రయోజనాలు లభిస్తాయి.
ఐపీపీబీ రూ.299 ప్లాన్
ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారు సంవత్సరానికి రూ.299 చెల్లించి.. 10 లక్షల రూపాయల ప్రమాద భీమా పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా లభిస్తుంది.
ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారుకు రూ.399 ప్లాన్‌లో లభించే దాదాపు అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ఎడ్యుకేషన్ బెనిఫీట్స్.. హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1,000 చొప్పున లభించే ప్రయోజనాలు అందవు.
ఇదీ చదవండి: బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులు
దీనికి అర్హులు ఎవరంటే..
18 నుంచి 65 సంవత్సరాల వయసున్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు.
గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ దేనిని కవర్ చేయదంటే..
ఆత్మహత్య చేసుకున్నా, మిలటరీ సర్విసెస్‌లో ఉంటూ మరణించినా, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి కన్నుమూసినా, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ వంటి వాటివల్ల చనిపోయినా.. ప్రమాదకరమైన క్రీడల్లో మృత్యువాత పడినా ఈ ఇన్సూరెన్స్ లభించదు.
Comments
Please login to add a commentAdd a comment