అధిక రాబడులు పొందేదిలా..
ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి వదిలేయడం కాకుండా మధ్యమధ్యలో సమీక్షించుకుంటూ ఉండాలి. ఫండ్ దిశ మార్చుకున్నా, లేదా నిరంతరంగా సరైన పనితీరు కనబర్చకున్నా వ్యూహాన్ని మార్చుకోవాలి. సాధారణంగా ఫండ్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో దాదాపు ఒకే రకమైన సమస్యలు కనిపిస్తుంటాయి. వీటిని గానీ అర్థం చేసుకుని సరిచేసుకోగలిగితే మెరుగైన రాబడులు అందుకోవచ్చు.
ఒకే ఫండ్ కాకుండా వివిధ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదనే ఉద్దేశంతో.. ఒకదాని తర్వాత మరొకటిగా ఇన్వెస్ట్ చేస్తూ వెడతారు. తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే ముప్పై-నలభై ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో పోగుపడతాయి. చివరికి ఏదీ సరైన రాబడి ఇవ్వకుండా పోతుంది. డైవర్సిఫికేషన్ మంచిదే కానీ.. మరీ అతిగా కూడా చేయకూడదని గుర్తుంచుకోవాలి.
ఫండ్ పనితీరు రేటింగ్ కూడా ముఖ్యమే. అయితే, ఏ ఫండ్ కూడా నిరంతరం టాప్ రేటింగ్‌లతో ఉండదు. పైగా మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త థీమ్స్‌పై క్రేజ్ ఉంటుంది. కనుక, టాప్ రేటింగ్‌లు, కొత్త థీమ్స్ ఫండ్స్ అంటూ వాటి వెనుక వెడితే మళ్లీ యథాప్రకారం ఫండ్స్ పోగుపడటం తప్ప ప్రయోజనం ఉండదు. అందుకే, టాప్ అని కాకుండా స్థిరంగా మెరుగైన పనితీరు కనపరుస్తున్న వాటితో కొనసాగడం మంచిది. సదరు సంస్థ ఇన్వెస్టింగ్ తీరు, ఫండ్ పరిమాణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
అలాగే, స్వల్పకాలికంగా అవ సరాల కోసం డెట్ సాధనాల్లోనూ, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈక్విటీ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే, ఇవి రెండూ వివిధ దిశల్లో వెడుతుంటాయి కనుక.. కొన్నాళ్లు పోయాక మీ లక్ష్యాలకు భిన్నంగా పోర్ట్‌ఫోలియో స్వరూపం మారవచ్చు. ఉదాహరణకు.. షేర్లలో పెట్టుబడులు ఎక్కువయ్యి రిస్కు పెరగడమో లేదా తక్కువయ్యి రావాల్సిన లాభాలను కోల్పోవడమో జరిగే అవకాశం ఉంది. కనుక, ఎప్పటికప్పుడు పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను సవరించుకుంటూ వెడితే రాబడులు మెరుగ్గా ఉంటాయి.