ఫండ్ ఎంచుకోవడమిలా...
బేసిక్స్
మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏ ఫండ్‌ని ఎంచుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. అల్లాటప్పాగా బెస్ట్‌గా కనిపిస్తోంది కదాని దేన్ని పడితే దాన్ని ఎంచుకోకూడదు. మీ పెట్టుబడి లక్ష్యాలు, కేటాయించగలిగే డబ్బుకు అనుగుణంగా ఉన్న ఫండ్‌ని చూడాలి. మీరు ఎంత రిస్కు తీసుకోగలరు, బడ్జెట్ ఎంత కేటాయించగలరో చూసుకుని దానికి తగినట్లు ఉన్న సంస్థ ఫండ్‌ని ఎంచుకోవాలి.
గతంలో చెప్పుకున్నట్లుగా ఒక్కో ఫండ్ ఒక్కో రకమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్, షేర్లు లాంటి వాటితో పాటు దీర్ఘకాలికమైన, స్వల్పకాలికమైన లక్ష్యాలతో పెట్టుబడులు పెడుతుంటుంది. కనుక మీ లక్ష్యం స్వల్పకాలికమైనదా లేదా దీర్ఘకాలికమైనదా, కాస్త ఎక్కువ రిస్కయినా తీసుకుని షేర్లలో పెట్టగలరా లేక సురక్షితమైన ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ లాంటివే మీకు నప్పుతాయా అన్నది చూసుకుని ఫండ్‌ని ఎంచుకోవాలి.
పనితీరు..
ఫండ్‌ని ఎంచుకోవడానికి ముందు గతంలో దాని పనితీరు ఎలా ఉందో కూడా కొంత అధ్యయనం చేయాలి. ఇందుకోసం మీ లక్ష్యానికి అనుగుణంగా ఉన్న టాప్ అయిదు ఫండ్స్‌ని ఎంపిక చేసుకోండి. గత మూడు నెలల నుంచి మూడేళ్ల క్రితం దాకా అవి ఎలాంటి పనితీరు కనపర్చాయో చూసుకోండి. స్థిరమైన పనితీరు కనపర్చినవాటిని ఎంచుకోండి.
ఇలా వివిధ ఫండ్ల పనితీరును తెలుసుకోవడానికి ఆన్‌లైన్ మాధ్యమం ఉపయోగపడుతుంది. ఫండ్‌ని.. అందునా ముఖ్యంగా ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్స్‌ని ఎంపిక చేసుకునేటప్పుడు వ్యయాలు కూడా పరిగణనలోకి తీసుకోవడమూ ముఖ్యమే. ఎందుకంటే మేనేజ్‌మెంట్ ఫీజని, వార్షిక వ్యయాలని, సేల్స్ లోడ్ అని రకరకలా వ్యయాలు చెల్లించాల్సి రావడం వల్ల ఆ మేరకు రాబడులు తగ్గుతాయి. సాధారణంగా ఒక్క శాతం మేర మేనేజ్‌మెంట్ ఫీజు, 0.6 శాతం దాకా ఇతర వార్షిక వ్యయాలు ఉంటే ఓకే అనుకోవచ్చు.
ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, వైదొలిగేటప్పుడు చార్జీలు ఏమైనా ఉంటాయా, ఉంటే ఎంత స్థాయిలో ఉంటాయి అన్నదీ చూసుకోవాలి. ఇక .. డబ్బంతా కేవలం ఒకే ఫండ్‌లో పెట్టేయకుండా .. వీలైతే రెండు, మూడు ఫండ్స్‌ని ఎంచుకుంటే మంచిది. రెండు ఎంచుకుంటే.. ఒకదాంట్లో 60 శాతం మేర రెండో దాంట్లో 40 శాతం మేర ఇన్వెస్ట్ చేయండి. అదే మూడు ఎంచుకుంటే.. 50:30:20 వంటి నిష్పత్తిలో కేటాయింపులు జరపవచ్చు.