లాభాలతో బయటపడాలంటే..
బేసిక్స్
మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనడాన్ని, అమ్మడాన్ని ప్రభావితం చేసే మరికొన్ని అంశాలు ఈ వారం బేసిక్స్‌లో. సాధారణంగా ఫండ్ వేటిలో ఇన్వెస్ట్ చేస్తోందన్న దానిపై పన్నుపరమైన ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ పన్నుపరమైన విధానాలు మారితే సదరు ఫండ్ స్వరూపం కూడా మార్చాల్సి రావొచ్చు. దీంతో మన సామర్థ్యాన్ని మించి రిస్కు ఎదురుకావచ్చు. ఇలాంటప్పుడు.. యూనిట్లను విక్రయించి, మెరుగైన ప్రయోజనాలనిచ్చే మరో సాధనంలో ఇన్వెస్ట్ చేయాల్సి రావొచ్చు.
ఇదే కాకుండా కొన్ని సార్లు మరింత మెరుగైన రాబడుల కోసం ఫండ్ విభిన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు .. టెక్నాలజీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ విషయాన్ని తీసుకుందాం. టెక్నాలజీ బూమ్ సమయంలో మార్కెట్లోకి వచ్చిన ఇవి ఆ తర్వాత గణనీయంగా దెబ్బతిన్నాయి. కానీ, యూనిట్లు చౌకగా దొరుకుతుండటంతో, దీర్ఘకాలికంగా మళ్లీ పెరుగుతాయన్న ఉద్దేశంతో కొందరు వీటిలో ఇన్వెస్ట్ చేశారు. అయితే, ఆ తర్వాత పనితీరు అంతకంతకూ పడిపోతుండటంతో సదరు ఫండ్స్ అధిక రాబడులు అందించే ఇతర స్టాక్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపడం మొదలుపెట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు ఏ లక్ష్యాన్ని ఆశించి ఇన్వెస్ట్ చేశారో.. అది సాకారం కాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఫండ్ నుంచే వైదొలగాల్సి వచ్చింది. కాబట్టి ఇలా ఫండ్ లక్ష్యం మారిపోయినా బైటపడాల్సి రావొచ్చు.
ఫండ్ మేనేజర్ మార్పు..
ఫండ్ విషయంలో ఫండ్ మేనేజర్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తారు. మన డబ్బును ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్‌మెంట్ విధానం ఎలా ఉండాలి.. లాంటి అంశాలన్నింటిపైనా మేనేజర్, తన టీమ్ నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని బట్టే రాబడులు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మేనేజర్ మారిపోతే మనం కూడా ఫండ్ నుంచి వైదొలగాలని కాదు. అయితే, ఫండ్ పనితీరును బాగా పరిశీలిస్తూ ఉండాలి. పనితీరు గానీ గణనీయంగా దెబ్బతిన్న పక్షంలో వైదొలగడం మంచిది.
కొన్నిసార్లు ఫండ్ పరిమాణం భారీగా పెరిగిపోయినా లేదా భారీగా తగ్గిపోయినా.. రాబడులు తగ్గనూ వచ్చు లేదా కొత్త ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలు చేజారనూ వచ్చు. ఇలాంటి సందర్భాల్లో సైతం వైదొలగడం ఉత్తమం. వీటన్నింటికి తోడు.. వ్యక్తిగత అవసరాలను బట్టి అమ్మాల్సిన పరిస్థితులు కూడా తలెత్తవచ్చు.
ఇలా.. ఫండ్ కొనడం, అమ్మడానికి సంబంధించి ముందుగానే కొన్ని నిబంధనలను పెట్టుకుని, వాటికి కట్టుబడి ఉంటే పెట్టుబడులు క్రమబద్ధంగా సాగిపోతాయి. మెరుగైన రాబడులను అందుకోవడానికీ సాధ్యపడుతుంది. ఇవీ మ్యూచువల్ ఫండ్స్ వివరాలు.. ఇక వచ్చే వారం నుంచి బీమా గురించిన వివరాలు తెలుసుకుందాం.