technology stocks
-
ఆటుపోట్లు- యూఎస్ మార్కెట్ల పతనం
తీవ్ర ఆటుపోట్ల మధ్య గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మూడు రోజుల భారీ నష్టాల నుంచి బుధవారం కోలుకున్పప్పటికీ తిరిగి ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌లో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో డోజోన్స్ 406 పాయింట్లు(1.5%) క్షీణించి 27,535 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 60 పాయింట్లు(1.8%) నష్టపోయి 3,339 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 222 పాయింట్లు(2%) పతనమై 10,920 వద్ద స్థిరపడింది. బుధవారం స్పీడును కొనసాగిస్తూ తొలుత డోజోన్స్ 300 పాయింట్లకుపైగా జంప్‌చేసింది. మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు పెరగడంతో చివరికి డీలాపడింది. ఎందుకంటే? గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలను మించుతూ 8.84 లక్షలను తాకడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో 8.5 లక్షల క్లెయిములను ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దీనికితోడు టెక్నాలజీ కౌంటర్లలో కొద్ది రోజులుగా నెలకొన్న ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు వెలువడిన వార్తలతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనైనట్లు తెలియజేశారు. నేలచూపులే.. ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్(అల్ఫాబెట్) 2-4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఇక ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్.. తొలుత 8 శాతం పతనమైనప్పటికీ చివర్లో కోలుకుని 1.4 శాతం లాభంతో ముగిసింది. కంప్యూటర్ చిప్స్ తయారీ దిగ్గజం ఏఎండీ 3.6 శాతం క్షీణించింది. కోవిడ్-19 చికిత్సకు బయోఎన్‌టెక్‌తో సంయుక్తంగా వ్యాక్సిన్ రూపొందిస్తున్న ఫైజర్ ఇంక్ 1.5 శాతం నష్టపోగా.. క్లినికల్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసిన ఆస్ట్రాజెనెకా 1.1 శాతం నీరసించింది. వ్యాక్సిన్ రేసులో ఉన్న మరో ఫార్మా కంపెనీ మోడార్నా ఇంక్ 1.2 శాతం పుంజుకుంది. ఫార్మా దిగ్గజం సనోఫీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన మైఖేల్ మలెట్ను కెనడియన్ బిజినెస్ ఎండీగా ఎంపిక చేసుకున్నట్లు మోడర్నా పేర్కొంది. -
ఇలాంటప్పుడే ఇన్వెస్ట్ చేయాలి..
పరాగ్ మ్యూచ్‌వల్ ఫండ్ చైర్మన్ నీల్ పారిఖ్ ♦ ప్రైవేట్ బ్యాంకులు, టెక్నాలజీ స్టాక్స్ బాగున్నాయి ♦ ఇన్ఫ్రా షేర్లవైపు చూడకపోవటమే ఉత్తమం ♦ మూడేళ్లుగా ఏటా 20% రాబడి అందిస్తున్నాం ♦ రెండేళ్లలో రూ.1,000 కోట్ల విలువను చేరుకుంటాం సాక్షి, బిజినెస్ బ్యూరో: బ్రెగ్జిట్ వంటి పరిణామాలతో స్టాక్‌మార్కెట్లు తాత్కాలికంగా క్షీణించినా.. పెట్టుబడులు పెట్టేందుకు ఇలాంటి సమయాలే సరైనవని చెప్పారు ఫండ్ సంస్థ పరాగ్ పారిఖ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ (పీపీఎఫ్ఏఎస్) చైర్మన్ నీల్ పారిఖ్. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులు, టెక్నాలజీ రంగాల షేర్లు కొనుగోళ్లకు అనుకూలమైనవిగా చెప్పారాయన. రెండేళ్లలో రూ. 1,000 కోట్ల ఏయూఎం లక్ష్యంగా నిర్దేశించుకున్న నీల్ పారిఖ్... ‘సాక్షి ప్రాఫిట్ ప్లస్’కిచ్చిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... పెట్టుబడికి ఏఏ రంగాలు బాగున్నాయంటారు? బ్రెగ్జిట్తో దేశీ మార్కెట్లు కొంత తగ్గినప్పటికీ.. వెంటనే కోలుకున్నాయి. ఇన్వెస్ట్మెంట్కి ఇలాంటి తరుణాలే సరైనవి. మన దగ్గర బ్రెగ్జిట్ కన్నా రుతుపవనాలే ముఖ్యం. వర్షాలు బాగుంటే.. మార్కెట్లూ బాగుంటాయి. ఈక్విటీలు తగ్గిన ప్రతిసారీ బంగారం లాంటి ఇతర సాధనాలు పెరగడం సహజమే. మళ్లీ పరిస్థితులు మామూలు కాగానే ఆ నిధులు తిరిగి ఈక్విటీల్లోకి వచ్చేస్తాయి. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులు, టెక్నాలజీ స్టాక్స్ బాగుంటాయని అంచనా. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ ఎన్పీఏల సమస్యలు తీరేందుకు సమయం పడుతుంది. దీంతో విస్తరణకు ఆస్కారమున్న ప్రైవేట్ బ్యాంకులు మెరుగ్గా రాణిస్తున్నాయి. పెట్టుబడులు ఎక్కువగా అవసరమయ్యే మౌలిక రంగ సంస్థలు లాభాల్లోకి రావాలంటే చాన్నాళ్లు పడుతుంది కనక అటువైపు వెళ్లకపోవడం ఉత్తమం. అయితే, ఏదైనా ప్రత్యేక రంగాన్ని ఎంచుకోవడం కన్నా నాణ్యమైన షేర్‌ను ఎంచుకోవడమే ముఖ్యం. 15 శాతం రాబడులు వచ్చినా మెరుగ్గా ఉన్నట్లే. ఆ లెక్కన కొన్నాళ్లలోనే మీ పెట్టుబడి రెట్టింపవుతుంది. ప్రస్తుతం మీ ఫండ్ ఆస్తులెంత? మేం గతంలో పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవలందించాం. కానీ నియంత్రణల కారణంగా దాన్నుంచి వైదొలిగి మూడేళ్ల కిందట మ్యూచువల్ ఫండ్ సేవల్లోకి వచ్చాం. ఈ మూడేళ్లలోనే ఫండ్ ఆస్తులు రూ.683 కోట్లకు చేరాయి. 8వేల పైచిలుకు క్లయింట్లున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో సుమారు 150 మంది పైగా ఉన్నారు. ముంబై కేంద్రంగా ఉన్న మా సంస్థ.. పుణె, చెన్నైల్లోనూ సేవలందిస్తోంది. ఏడు వందల పైచిలుకు ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌తో (ఐఎఫ్ఏ) చేతులు కలిపాం. వచ్చే రెండేళ్లలో ఏయూఎంను రూ.1,000 కోట్ల స్థాయికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మీ ఫండ్ పనితీరు ఎలా ఉంది? రాబడి శాతమెంత? రాశి కన్నా వాసి ముఖ్యమనేది మా నమ్మకం. అందుకే రకరకాల ఫండ్స్‌తో గందరగోళపర్చకుండా పీపీఎఫ్ఏఎస్ లాంగ్ టర్మ్ వేల్యూ ఫండ్ (పీఎల్టీవీఎఫ్) పేరిట ఒకే ఫండ్‌ను తెచ్చాం. మూడేళ్లుగా ఇది వార్షిక ప్రాతిపదికన సుమారు 20 శాతం మేర రాబడులిస్తోంది. సగటున మా క్లయింట్ల ఇన్వెస్ట్మెంట్ సుమారు రూ.8 లక్షల దాకా ఉంటోంది. అలాగని కేవలం సంపన్న ఇన్వెస్టర్లే కాకుండా సామాన్య ఇన్వెస్టర్లకూ అవకాశం ఉండేలా సిప్ విధానాన్ని కూడా అందిస్తున్నాం. నెలనెలా రూ. 1,000 కూడా ఇన్వెస్ట్ చేసే వీలుంది. మీ ఇన్వెస్ట్మెంట్ విధానమేంటి? అంటే... షేర్లలోనేనా లేక డెట్‌లోనూ పెడతారా? ఒకే ఫండ్ ద్వారా ఇటు దేశీ, అటు విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేయటం మా ప్రత్యేకత. సాధారణంగా విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఇతర సంస్థలు.. ఫీడర్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వాటిని డెట్ ఫండ్లుగా పరిగణించడం వల్ల పన్నులూ ఎక్కువే ఉంటున్నాయి. కానీ మా పోర్ట్‌ఫోలియోలో నేరుగా సుమారు 65% దేశీ ఈక్విటీలు, డెట్ మార్కెట్లకు, 35% విదేశీ ఈక్విటీలకు కేటాయిస్తున్నాం. స్టాక్స్, కరెన్సీలు హెచ్చుతగ్గులకు లోనైనా మా హెడ్జింగ్ వ్యూహంవల్ల ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులొస్తాయి. దీంతో పాటు దీర్ఘకాలికం కనక పన్ను ప్రయోజనా లూ ఉంటాయి. విదేశీ షేర్లలో యాపిల్, గూగుల్ వంటివి కూడా మా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. మీ ఫండ్ ప్రత్యేకతలేంటి? పూర్తి పారదర్శకత ఉంటుంది. ఇన్వెస్టర్లకు భరోసా కలిగేలా స్వయంగా కంపెనీ ప్రమోటర్లు, ఉద్యోగులు దీన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫండ్ పెట్టుబడుల్లో సు మారు 13% మాదే. పెట్టుబడులు దీర్ఘకాలం కొనసాగిస్తేనే లాభాలొస్తాయి. అందుకే కనీసం ఐదేళ్లయినా కొనసాగించే వారికే ఇది అనువైనదని ముందే చెబుతున్నాం. దాన్ని బట్టి వారు తగు నిర్ణయం తీసుకోవచ్చు. ఎగ్జిట్ లోడ్ తొలి ఏడాది రెండు శాతంగాను, ఏడాది నుంచి రెండేళ్ల లోపు ఒక్క శాతంగాను ఉంది. -
లాభాలతో బయటపడాలంటే..
బేసిక్స్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనడాన్ని, అమ్మడాన్ని ప్రభావితం చేసే మరికొన్ని అంశాలు ఈ వారం బేసిక్స్‌లో. సాధారణంగా ఫండ్ వేటిలో ఇన్వెస్ట్ చేస్తోందన్న దానిపై పన్నుపరమైన ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ పన్నుపరమైన విధానాలు మారితే సదరు ఫండ్ స్వరూపం కూడా మార్చాల్సి రావొచ్చు. దీంతో మన సామర్థ్యాన్ని మించి రిస్కు ఎదురుకావచ్చు. ఇలాంటప్పుడు.. యూనిట్లను విక్రయించి, మెరుగైన ప్రయోజనాలనిచ్చే మరో సాధనంలో ఇన్వెస్ట్ చేయాల్సి రావొచ్చు. ఇదే కాకుండా కొన్ని సార్లు మరింత మెరుగైన రాబడుల కోసం ఫండ్ విభిన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు .. టెక్నాలజీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ విషయాన్ని తీసుకుందాం. టెక్నాలజీ బూమ్ సమయంలో మార్కెట్లోకి వచ్చిన ఇవి ఆ తర్వాత గణనీయంగా దెబ్బతిన్నాయి. కానీ, యూనిట్లు చౌకగా దొరుకుతుండటంతో, దీర్ఘకాలికంగా మళ్లీ పెరుగుతాయన్న ఉద్దేశంతో కొందరు వీటిలో ఇన్వెస్ట్ చేశారు. అయితే, ఆ తర్వాత పనితీరు అంతకంతకూ పడిపోతుండటంతో సదరు ఫండ్స్ అధిక రాబడులు అందించే ఇతర స్టాక్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపడం మొదలుపెట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు ఏ లక్ష్యాన్ని ఆశించి ఇన్వెస్ట్ చేశారో.. అది సాకారం కాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఫండ్ నుంచే వైదొలగాల్సి వచ్చింది. కాబట్టి ఇలా ఫండ్ లక్ష్యం మారిపోయినా బైటపడాల్సి రావొచ్చు. ఫండ్ మేనేజర్ మార్పు.. ఫండ్ విషయంలో ఫండ్ మేనేజర్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తారు. మన డబ్బును ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ విధానం ఎలా ఉండాలి.. లాంటి అంశాలన్నింటిపైనా మేనేజర్, తన టీమ్ నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని బట్టే రాబడులు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మేనేజర్ మారిపోతే మనం కూడా ఫండ్ నుంచి వైదొలగాలని కాదు. అయితే, ఫండ్ పనితీరును బాగా పరిశీలిస్తూ ఉండాలి. పనితీరు గానీ గణనీయంగా దెబ్బతిన్న పక్షంలో వైదొలగడం మంచిది. కొన్నిసార్లు ఫండ్ పరిమాణం భారీగా పెరిగిపోయినా లేదా భారీగా తగ్గిపోయినా.. రాబడులు తగ్గనూ వచ్చు లేదా కొత్త ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు చేజారనూ వచ్చు. ఇలాంటి సందర్భాల్లో సైతం వైదొలగడం ఉత్తమం. వీటన్నింటికి తోడు.. వ్యక్తిగత అవసరాలను బట్టి అమ్మాల్సిన పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. ఇలా.. ఫండ్ కొనడం, అమ్మడానికి సంబంధించి ముందుగానే కొన్ని నిబంధనలను పెట్టుకుని, వాటికి కట్టుబడి ఉంటే పెట్టుబడులు క్రమబద్ధంగా సాగిపోతాయి. మెరుగైన రాబడులను అందుకోవడానికీ సాధ్యపడుతుంది. ఇవీ మ్యూచువల్ ఫండ్స్ వివరాలు.. ఇక వచ్చే వారం నుంచి బీమా గురించిన వివరాలు తెలుసుకుందాం.