తీవ్ర ఆటుపోట్ల మధ్య గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మూడు రోజుల భారీ నష్టాల నుంచి బుధవారం కోలుకున్పప్పటికీ తిరిగి ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌లో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో డోజోన్స్ 406 పాయింట్లు(1.5%) క్షీణించి 27,535 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ 60 పాయింట్లు(1.8%) నష్టపోయి 3,339 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్ మరింత అధికంగా 222 పాయింట్లు(2%) పతనమై 10,920 వద్ద స్థిరపడింది. బుధవారం స్పీడును కొనసాగిస్తూ తొలుత డోజోన్స్ 300 పాయింట్లకుపైగా జంప్‌చేసింది. మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు పెరగడంతో చివరికి డీలాపడింది.
ఎందుకంటే?
గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలను మించుతూ 8.84 లక్షలను తాకడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో 8.5 లక్షల క్లెయిములను ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దీనికితోడు టెక్నాలజీ కౌంటర్లలో కొద్ది రోజులుగా నెలకొన్న ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు వెలువడిన వార్తలతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనైనట్లు తెలియజేశారు.
నేలచూపులే..
ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్(అల్ఫాబెట్) 2-4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఇక ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్.. తొలుత 8 శాతం పతనమైనప్పటికీ చివర్లో కోలుకుని 1.4 శాతం లాభంతో ముగిసింది. కంప్యూటర్ చిప్స్ తయారీ దిగ్గజం ఏఎండీ 3.6 శాతం క్షీణించింది. కోవిడ్-19 చికిత్సకు బయోఎన్‌టెక్‌తో సంయుక్తంగా వ్యాక్సిన్ రూపొందిస్తున్న ఫైజర్ ఇంక్ 1.5 శాతం నష్టపోగా.. క్లినికల్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసిన ఆస్ట్రాజెనెకా 1.1 శాతం నీరసించింది. వ్యాక్సిన్ రేసులో ఉన్న మరో ఫార్మా కంపెనీ మోడార్నా ఇంక్ 1.2 శాతం పుంజుకుంది. ఫార్మా దిగ్గజం సనోఫీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన మైఖేల్ మలెట్‌ను కెనడియన్ బిజినెస్ ఎండీగా ఎంపిక చేసుకున్నట్లు మోడర్నా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment