S&P 500
-
కరెక్షన్ బాటలో యూఎస్ మార్కెట్లు
ఓవైపు కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, మరోపక్క సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన బుధవారం మరోసారి అమెరికా స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి డోజోన్స్ 525 పాయింట్లు(1.9%) క్షీణించి 26,763 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 79 పాయింట్ల(2.4%) నష్టంతో 3,237 వద్ద నిలిచింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 331 పాయింట్లు(3%) పతనమై 10,633 వద్ద స్థిరపడింది. దీంతో ఈ నెలలో నమోదైన చరిత్రాత్మక గరిష్టాల నుంచి ఎస్అండ్పీ 10 శాతం, నాస్డాక్ 12 శాతం చొప్పున వెనకడుగు వేసినట్లయ్యింది. డోజోన్స్ ఫిబ్రవరిలో సాధించిన రికార్డ్ గరిష్టంకంటే 9.4 శాతం దిగువన నిలిచింది. ఇది కరెక్షన్కు సంకేతమని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. దీనిలో భాగంగా నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ మంగళవారం మార్కెట్లు బలపడినప్పటికీ తిరిగి అమ్మకాలు ఊపందుకున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల మార్కెట్ల ర్యాలీకి కారణమైన టెక్నాలజీ దిగ్గజాలలో అమ్మకాలు కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. డౌన్ డౌన్.. ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్ 4.2 శాతం పతనమైంది. ఈ బాటలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ 4-2.3 శాతం మధ్య క్షీణించాయి. ఇతర కౌంటర్లలో కంప్యూటర్ చిప్ తయారీ కంపెనీలు ఎన్విడియా, ఏఎండీ సైతం 4 శాతం వెనకడుగు వేశాయి. ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల తయారీ అంశంలో ఎదురవుతున్న సవాళ్లపై సీఈవో ఎలెన్ మస్క్ వ్యాఖ్యలతో టెస్లా ఇంక్ 10.3 శాతం కుప్పకూలింది. అయితే స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్ ప్రొడక్టుల కంపెనీ నైక్ ఇంక్ 9 శాతం దూసుకెళ్లింది. -
ఆటుపోట్లు- యూఎస్ మార్కెట్ల పతనం
తీవ్ర ఆటుపోట్ల మధ్య గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మూడు రోజుల భారీ నష్టాల నుంచి బుధవారం కోలుకున్పప్పటికీ తిరిగి ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌లో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో డోజోన్స్ 406 పాయింట్లు(1.5%) క్షీణించి 27,535 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 60 పాయింట్లు(1.8%) నష్టపోయి 3,339 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 222 పాయింట్లు(2%) పతనమై 10,920 వద్ద స్థిరపడింది. బుధవారం స్పీడును కొనసాగిస్తూ తొలుత డోజోన్స్ 300 పాయింట్లకుపైగా జంప్‌చేసింది. మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు పెరగడంతో చివరికి డీలాపడింది. ఎందుకంటే? గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలను మించుతూ 8.84 లక్షలను తాకడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో 8.5 లక్షల క్లెయిములను ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దీనికితోడు టెక్నాలజీ కౌంటర్లలో కొద్ది రోజులుగా నెలకొన్న ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు వెలువడిన వార్తలతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనైనట్లు తెలియజేశారు. నేలచూపులే.. ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్(అల్ఫాబెట్) 2-4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఇక ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్.. తొలుత 8 శాతం పతనమైనప్పటికీ చివర్లో కోలుకుని 1.4 శాతం లాభంతో ముగిసింది. కంప్యూటర్ చిప్స్ తయారీ దిగ్గజం ఏఎండీ 3.6 శాతం క్షీణించింది. కోవిడ్-19 చికిత్సకు బయోఎన్‌టెక్‌తో సంయుక్తంగా వ్యాక్సిన్ రూపొందిస్తున్న ఫైజర్ ఇంక్ 1.5 శాతం నష్టపోగా.. క్లినికల్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసిన ఆస్ట్రాజెనెకా 1.1 శాతం నీరసించింది. వ్యాక్సిన్ రేసులో ఉన్న మరో ఫార్మా కంపెనీ మోడార్నా ఇంక్ 1.2 శాతం పుంజుకుంది. ఫార్మా దిగ్గజం సనోఫీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన మైఖేల్ మలెట్ను కెనడియన్ బిజినెస్ ఎండీగా ఎంపిక చేసుకున్నట్లు మోడర్నా పేర్కొంది. -
టెక్ షాక్- యూఎస్ మార్కెట్లు బోర్లా
వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో డోజోన్స్ 808 పాయింట్లు(2.8%) పతనమై 28,293 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 126 పాయింట్లు(3.5%) పడిపోయి 3,455 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 598 పాయింట్లు(5%) దిగజారి 11,458 వద్ద స్థిరపడింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్ తదితర దిగ్గజాల వెనకడుగుతో తొలుత డోజోన్స్ 1,000 పాయింట్లకుపైగా పడిపోవడం గమనార్హం! పతన బాటలో కొద్ది నెలలుగా దూకుడు చూపుతూ అటు ఎస్అండ్పీ, ఇటు నాస్డాక్ కొత్త రికార్డులను చేరుకునేందుకు దోహదపడుతున్న టెక్ దిగ్గజాల కౌంటర్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జూన్ తదుపరి ఒక్క రోజులోనే ఫాంగ్ స్టాక్స్ అన్నీ భారీగా పతనమయ్యాయి. ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 8 శాతం, విండోస్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 6.2 శాతం చొప్పున కుప్పకూలగా.. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ 5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ఇతర కౌంటర్లలో జూమ్ 10 శాతం, టెస్లా 9 శాతం, ఎన్విడియా 9.3 శాతం చొప్పున బోర్లా పడ్డాయి. ఇక బ్లూచిప్స్ హెచ్‌పీ, బోయింగ్, డీరె 3 శాతం చొప్పున డీలా పడ్డాయి. అయితే పటిష్ట త్రైమాసిక ఫలితాల కారణంగా కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ కంపెనీ పీవీహెచ్ కార్ప్ 3.3 శాతం ఎగసింది. లాభాల స్వీకరణ ఉన్నట్టుండి గురువారం వెల్లువెత్తిన అమ్మకాలకు ప్రధాన కారణం ట్రేడర్ల లాభాల స్వీకరణే అని విశ్లేషకులు చెబుతున్నారు. కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లు నిరవధికంగా దూసుకెళుతున్నట్లు తెలియజేశారు. దీంతో సాంకేతికంగానూ మార్కెట్లు ఓవర్‌బాట్ స్థాయికి చేరుకున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నట్లు వివరించారు. ఉదాహరణకు గురువారంనాటి పతనం తదుపరి కూడా యాపిల్ ఇంక్ షేరు 2020లో ఇప్పటివరకూ 65 శాతం ర్యాలీ చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. బుధవారం రికార్డ్స్ పలు సానుకూల అంశాల నేపథ్యంలో బుధవారం ఎస్అండ్పీ 54 పాయింట్లు(1.5%) బలపడి 3,581కు చేరగా.. నాస్డాక్ 117 పాయింట్లు(1%) ఎగసి 12,056 వద్ద ముగిసింది. వెరసి 2020లో ఎస్అండ్పీ 22వసారి, నాస్డాక్ 43వ సారి సరికొత్త గరిష్టాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక డోజోన్స్ 455 పాయింట్లు(1.6%) జంప్‌చేసి 29,100 వద్ద స్థిరపడింది. తద్వారా ఫిబ్రవరి గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడంతోపాటు.. 6 నెలల తదుపరి తిరిగి 29,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. -
యూఎస్- ఆరో రోజూ అదే జోరు
వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 23 పాయింట్లు(0.7 శాతం) ఎగసి 3,508 వద్ద నిలవడం ద్వారా వరుసగా ఆరో రోజు చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ఈ బాటలో నాస్డాక్ 70 పాయింట్లు(0.6 శాతం) బలపడి 11,696 వద్ద ముగిసింది. వెరసి 2020లో 40వ సారి సరికొత్త గరిష్ట రికార్డును అందుకుంది. ఇక వీటితో పోలిస్తే కొంత వెనకడుగులో ఉన్న డోజోన్స్ శుక్రవారం 162 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 28,654 వద్ద స్థిరపడింది. తద్వారా 2020లో ఏర్పడిన నష్టాల నుంచి బయటపడింది. అంటే మార్చిలో నమోదైన కనిష్టం నుంచి 57 శాతం ర్యాలీ చేసింది. వెరసి ఫిబ్రవరిలో సాధించిన రికార్డ్ గరిష్టాన్ని బ్రేక్ చేసేందుకు కేవలం 1,000 పాయింట్ల దూరంలోనిలిచింది. కాగా.. వరుసగా ఐదు వారాలపాటు లాభాల్లో నిలవడం ద్వారా ఎస్అండ్పీ మరో రికార్డును సాధించడం విశేషం! 1984 తదుపరి ఆగస్ట్‌లో ఎస్అండ్పీ, డోజోన్స్ 8 శాత స్థాయిలో లాభపడ్డాయి. కారణాలున్నాయ్ కోవిడ్-19 విసురుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ 1.3 ట్రిలియన్ డాలర్ల భారీ సహాయక ప్యాకేజీకి సిద్ధపడుతుండటం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక ఆర్థిక రికవరీని సూచిస్తూ జులైలో వ్యక్తిగత వినియోగ సూచీ దాదాపు 2 శాతం జంప్‌చేయడం కూడా ఇందుకు దోహదపడినట్లు తెలియజేశారు. మరోపక్క జాక్సన్హోల్ వద్ద ప్రసంగంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు స్పష్టం చేయడం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు వివరించారు. కోక కోలా అప్ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో పానీయాల దిగ్గజం కోక కోలా, విమానయాన బ్లూచిప్ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 3 శాతం చొప్పున ఎగశాయి. క్యూ2లో నికర లాభం అంచనాలు మించడంతో డెల్ టెక్నాలజీస్ 6 శాతం జంప్‌చేసింది. క్యూ3పై అంచనాలతో హెచ్‌పీ 6 శాతం పురోగమించింది. వార్షిక సబ్స్క్రిప్షన్లు జోరందుకోనున్నట్లు అంచనాలు ప్రకటించిన వర్క్‌డే ఇంక్ 13 శాతం దూసుకెళ్లింది. టిక్‌టాక్ యూఎస్ యూనిట్ కొనుగోలుకి చేతులు కలిపిన వాల్‌మార్ట్ 2.7 శాతం, మైక్రోసాఫ్ట్ 1 శాతం చొప్పున లాభపడ్డాయి. బెయిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయనున్న వార్తలతో న్యుటానిక్స్ ఇంక్ 29 శాతం ర్యాలీ చేసింది. నార్వేజియన్ క్రూయిజ్, రాయల్ కరిబియన్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. -
యూఎస్ మార్కెట్ల రికార్డ్.. రికార్డ్స్
వరుసగా నాలుగో రోజు బువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 35 పాయింట్లు(1 శాతం) ఎగసి 3,479 వద్ద నిలవగా.. నాస్డాక్ 199 పాయింట్లు(1.75 శాతం) జంప్‌చేసి 11,665 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 83 పాయింట్లు(0.3 శాతం) బలపడి 28,332 వద్ద స్థిరపడింది. వెరసి డోజోన్స్ సరికొత్త గరిష్టానికి 4 శాతం చేరువలో నిలిచింది. జులైలో తయారీ రంగ జోరుకు నిదర్శనంగా డ్యురబుల్ గూడ్స్ ఆర్డర్లు 11 శాతం వృద్ది చెందడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇండెక్సుల జోరు ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ లాభపడటంతో నాస్డాక్ 2020లో 39వ సారి సరికొత్త రికార్డును సాధించింది. ఇక ఎస్అండ్పీ సైతం 2020లో ఇప్పటివరకూ 18వ సారి రికార్డ్ గరిష్టాలను అందుకోవడం విశేషం! కాగా.. కోవిడ్-19 ప్రభావతో మార్చి 23న నమోదైన కనిష్టం 2,192 పాయింట్ల నుంచి ఎస్అండ్పీ 59 శాతం దూసుకెళ్లింది. ఇక జనవరి నుంచి చూస్తే కోవిడ్-19 నేపథ్యంలోనూ నాస్డాక్ 30 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! నెట్‌ఫ్లిక్స్ దూకుడు బుధవారం ట్రేడింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ గత మూడేళ్లలోలేని విధంగా 12 శాతం దూసుకెళ్లి 547 డాలర్లను అధిగమించింది. ఇతర ఫాంగ్ స్టాక్స్‌లో మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్, ఫేస్బుక్ సరికొత్త గరిష్టాలను తాకాయి. ఈ బాటలో డోజోన్స్ ఇండెక్స్‌లో చోటు సాధించనున్న సేల్స్‌ఫోర్స్.కామ్ సైతం రికార్డ్ గరిష్టానికి చేరింది. పటిష్ట ఫలితాలు, గైడెన్స్ ఇందుకు దోహదం చేయగా.. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 6.4 శాతం జంప్‌చేసి 2153 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర దిగ్గజాలలో యాపిల్ 1.4 శాతం పుంజుకోగా.. బోయింగ్ 1.6 శాతం క్షీణించింది. ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడంతో హెచ్‌పీ ఎంటర్ప్రైజ్ 3.6 శాతం లాభపడగా.. ఫలితాలు నిరాశపరచడంతో రిటైలర్ నార్డ్‌స్ట్రామ్ 5.5 శాతం పతనమైంది. హరికేన్ లారా కారణంగా ఇంధన రంగ షేర్లు డీలాపడ్డాయి. -
వ్యాక్సిన్ హోప్- రెండో రోజూ రికార్డ్స్
వరుసగా రెండో రోజు సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 34 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 3,431 వద్ద నిలవగా.. నాస్డాక్ 68 పాయింట్లు(0.6 శాతం) ఎగసి 11,380 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఎస్అండ్పీ తొలిసారి 3,400 మార్క్‌ను అధిగమించింది. ఇక డోజోన్స్ 378 పాయింట్లు(1.4 శాతం) జంప్‌చేసి 28,308 వద్ద స్థిరపడింది. తద్వారా ఆరు నెలల తదుపరి తిరిగి 28,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి ఫిబ్రవరి 12న సాధించిన చరిత్రాత్మక గరిష్టానికి 4.2 శాతం దూరంలో నిలిచింది. గత వారం 2.7 శాతం లాభపడటం ద్వారా నాస్డాక్ 2020లో 36వ సారి సరికొత్త రికార్డును సాధించిన విషయం విదితమే. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు వాషింగ్టన్ ప్రభుత్వం త్వరితగతిన అనుమతివ్వనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నవంబర్‌లో ప్రారంభంకానున్న అధ్యక్ష ఎన్నికలలోపే కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే వీలున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ప్లాస్మా చికిత్సను యూఎస్ఎఫ్డీఏ తాజాగా అనుమతించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. యాపిల్ భళా వ్యాక్సిన్ అనుమతులపై అంచనాలతో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా షేరు 2 శాతం ఎగసింది. దీంతో ఎయిర్‌లైన్స్, క్రూయిజర్ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి యునైటెడ్, డెల్టా ఎయిర్‌లైన్స్ 9 శాతం చొప్పున దూసుకెళ్లగా.. కార్నివాల్, నార్వేజియన్ క్రూయిజ్ లైన్, రాయల్ కరిబియన్ 10-5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ బాటలో బోయింగ్ 6.5 శాతం జంప్‌చేసింది. ఇక ఫాంగ్ స్టాక్స్‌లో ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, అల్ఫాబెట్ 1.6-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రధానంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్ తొలిసారి 503 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 2 శాతం క్షీణించింది. ఆసియా లాభాల్లో యూఎస్ ఇండెక్సుల ప్రోత్సాహంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి నెలకొంది. జపాన్, సింగపూర్, కొరియా, తైవాన్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ 1.8-0.5 శాతం మధ్య జంప్ చేశాయి. ఇతర మార్కెట్లలో థాయ్‌లాండ్, చైనా 0.5-0.2 శాతం చొప్పున డీలాపడ్డాయి. -
1987-1999 తదుపరి బెస్ట్ క్వార్టర్
లాక్‌డవున్‌లకు మంగళం పాడుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటుందన్న అంచనాలు యూఎస్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజు మార్కెట్లు ఊపందుకున్నాయి. డోజోన్స్ 217 పాయింట్లు(0.85 శాతం) బలపడి 25,813 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 47 పాయింట్లు(1.55 శాతం) ఎగసి 3,100 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 185 పాయింట్లు(1.9 శాతం) పురోగమించి 10,059 వద్ద స్థిరపడింది. అయితే ఫ్లోరిడా, కనెక్టికట్ తదితర ప్రాంతాలలో రెండో దశ కరోనా కేసులు తలెత్తుతున్న వార్తలతో ఇన్వెస్టర్లలో అంతర్గతంగా ఆందోళనలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు మంగళవారం ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. అటు వైట్‌హౌస్, ఇటు ఫెడరల్ రిజర్వ్ భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. 33 ఏళ్ల తరువాత ఈ ఏడాది(2020) రెండోత్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో ఎస్అండ్పీ.. 20 శాతం ర్యాలీ చేసింది. తద్వారా 1998 జూన్ క్వార్టర్ తరువాత భారీగా పురోగమించింది. అయితే 2008 తొలి క్వార్టర్ తదుపరి ఈ జనవరి-మార్చిలో 20 శాతం పతనంకావడం గమనార్హం! ఇక క్యూ2(ఏప్రిల్-జూన్)లో డోజోన్స్ సైతం నికరంగా 18 శాతం ఎగసింది. తద్వారా 1987 తొలి క్వార్టర్ తదుపరి అత్యధిక లాభాలు ఆర్జించింది. 1987లో డోజోన్స్ 21 శాతం పుంజుకుంది. ఈ బాటలో రెండో క్వార్టర్లో నాస్డాక్ 31 శాతం జంప్‌చేసింది. వెరసి 1999 నాలుగో త్రైమాసికం తదుపరి మళ్లీ జోరందుకుంది. 1999లో నాస్డాక్ ఏకంగా 48 శాతం దూసుకెళ్లింది. బోయింగ్ వెనకడుగు 737 మ్యాక్స్ విమానాలకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో సోమవారం 15 శాతం దూసుకెళ్లిన బోయింగ్ ఇంక్ తాజాగా 6 శాతం పతనైంది. నార్వేజియన్ ఎయిర్ 97 విమానాల ఆర్డర్‌ను రద్దు చేసుకోవడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై నష్టపరిహారం కోరనున్నట్లు బోయింగ్ పేర్కొంది. ఇతర కౌంటర్లలో మైక్రాన్ టెక్నాలజీ 5 శాతం జంప్‌చేసింది. పవర్ నోట్‌బుక్స్, డేటా సెంటర్ల నుంచి చిప్‌లకు డిమాండ్ పెరగడంతో మైక్రాన్‌కు డిమాండ్ పెరిగింది. ఫుడ్ డెలివరీ యాప్ పోస్ట్మేట్స్ను కొనుగోలు చేయనున్న వార్తలతో ఉబర్ షేరు 5 శాతం పెరిగింది. -
రికార్డులు సృష్టించిన అమెరికా మార్కెట్లు
అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లలో ఏ చిన్న కదలిక కనిపించినా చాలు ప్రపంచమార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అలాంటి స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో సంచనాలు సృష్టించాయి. మొదటిసారి 1999 నాటి గరిష్ట స్థానానికి ఎగిసి రికార్డుల వర్షం కురిపించాయి. ఆయిల్ ధరలు పెరుగుతున్నాయనే వార్త, మాకీస్, కోహ్ల్స్ డిపార్ట్మెంట్ స్టోర్లు బలమైన రాబడులు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపర్చాయి. దీంతో అమెరికా మూడు మేజర్ స్టాక్ సూచీలు డౌజోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 రికార్డు స్థాయిలో క్లోజ్ అయినట్టు బైస్పోక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు వెల్లడించింది. ఆయిల్ ధరలను స్థిరంగా కొనసాగించడానికి తగిన చర్యలు తీసుకుంటామని సౌదీ ఆయిల్ మంత్రి కామెంట్ల అనంతరం క్రూడ్ ఆయిల్ 5 శాతం మేర జంప్ అయింది. తదుపరి కొన్ని నెలలో క్రూడ్ ఆయిల్ మార్కెట్లు మళ్లీ సమతుల్య స్థానానికి వస్తాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనావేసింది. దీంతో ఎస్ అండ్ పీ ఎనర్జీ ఇండెక్స్ 1.3 శాతం మేర ర్యాలీ కొనసాగించింది. 10 మేజర్ సెక్టార్లలో ఇదే టాప్‌లో నిలిచింది. డిపార్ట్మెంట్ స్టోర్ ఆపరేటర్ మాకీస్ కనీసం ఎనిమిదేళ్ల అనంతరం అంచనావేసిన దానికంటే తక్కువగానే రాబడులు పడిపోయినప్పటికీ, స్టోర్ అమ్మకాలు ఎగిసినట్టు తన త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించింది. దీంతో మాకీస్ షేర్లు 17.09 శాతం దూసుకెళ్లాయి. అదేవిధంగా కోహ్ల్స్ కూడా మార్కెట్ విశ్లేషకలు అంచనాలను అధిగమించి క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. దీంతో ఆ స్టోర్ షేర్లు కూడా 16.17 శాతం ఎగిశాయి. ఈ బలమైన ఆదాయాల సంకేతాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుందని వెల్లడవుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎస్ అండ్ పీ ఇండెక్స్ జూన్ చివరి నుంచి 7.0 శాతం పెరిగింది. అంచనావేసిన దానికంటే అధికంగానే త్రైమాసిక ఫలితాలు, తక్కువ వడ్డీరేట్లు అమెరికా మార్కెట్ల ర్యాలీకి దోహదం చేశాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ కొంత మంది ఇన్వెస్టర్లు ఎక్కువ వాల్యుయేషన్‌పై భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. థామ్సన్ రాయిటర్స్ డేటా ప్రకారం ఎస్ అండ్ పీ 500 ముందటి రికార్డులను కొల్లగొట్టింది. అంచనావేసిన దానికంటే 17 టైమ్స్ ఎగిసింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ సగటున 100 పాయింట్లకు పైగా పెరిగి 18,613.52 వద్ద, ఎస్ అంట్ పీ 500 ఇండెక్స్ 0.47 శాతం పెరిగి 2,185.79 దగ్గర, నాస్ డాక్ కంపొజిట్ 0.46 ఎగిసి 5,228.40వద్ద క్లోజ్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు రికార్డులు సృష్టించడంతో, ఆసియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ స్టాక్ సూచీలు కూడా శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాలతోనే ఎంట్రీ కానున్నట్టు మార్కెట్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.