వ్యాక్సిన్‌ హోప్‌- రెండో రోజూ రికార్డ్స్‌ | Vaccine hopes- S&P, Nasdaq hits record highs | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ హోప్‌- రెండో రోజూ రికార్డ్స్‌

Published Tue, Aug 25 2020 10:40 AM | Last Updated on Tue, Aug 25 2020 10:45 AM

Vaccine hopes- S&P, Nasdaq hits record highs - Sakshi

వరుసగా రెండో రోజు సోమవారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు రికార్డులను నెలకొల్పాయి. ఎస్‌అండ్‌పీ 34 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 3,431 వద్ద నిలవగా..  నాస్‌డాక్‌ 68 పాయింట్లు(0.6 శాతం) ఎగసి 11,380 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఎస్‌అండ్‌పీ తొలిసారి 3,400 మార్క్‌ను అధిగమించింది. ఇక డోజోన్స్‌ 378 పాయింట్లు(1.4 శాతం) జంప్‌చేసి 28,308 వద్ద స్థిరపడింది. తద్వారా ఆరు నెలల తదుపరి తిరిగి 28,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి ఫిబ్రవరి  12న సాధించిన చరిత్రాత్మక గరిష్టానికి 4.2 శాతం దూరంలో నిలిచింది. గత వారం 2.7 శాతం లాభపడటం ద్వారా నాస్‌డాక్‌ 2020లో 36వ సారి సరికొత్త రికార్డును సాధించిన విషయం విదితమే. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు వాషింగ్టన్‌ ప్రభుత్వం త్వరితగతిన అనుమతివ్వనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నవంబర్‌లో ప్రారంభంకానున్న అధ్యక్ష ఎన్నికలలోపే కోవిడ్‌-19 చికిత్సకు వినియోగించగల వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే వీలున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ప్లాస్మా చికిత్సను యూఎస్‌ఎఫ్‌డీఏ తాజాగా అనుమతించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

యాపిల్‌ భళా
వ్యాక్సిన్‌ అనుమతులపై అంచనాలతో బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా షేరు 2 శాతం ఎగసింది. దీంతో ఎయిర్‌లైన్స్‌, క్రూయిజర్‌ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. వెరసి యునైటెడ్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌ 9 శాతం చొప్పున దూసుకెళ్లగా.. కార్నివాల్‌, నార్వేజియన్‌ క్రూయిజ్‌ లైన్‌, రాయల్‌ కరిబియన్‌ 10-5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ బాటలో బోయింగ్‌ 6.5 శాతం జంప్‌చేసింది. ఇక ఫాంగ్‌ స్టాక్స్‌లో ఫేస్‌బుక్‌, యాపిల్‌, అమెజాన్‌, అల్ఫాబెట్‌ 1.6-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రధానంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ తొలిసారి 503 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్‌ షేరు 2 శాతం క్షీణించింది. 

ఆసియా లాభాల్లో
యూఎస్‌ ఇండెక్సుల ప్రోత్సాహంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి నెలకొంది. జపాన్‌, సింగపూర్, కొరియా, తైవాన్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ 1.8-0.5 శాతం మధ్య జంప్‌ చేశాయి. ఇతర మార్కెట్లలో థాయ్‌లాండ్‌, చైనా 0.5-0.2 శాతం చొప్పున డీలాపడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement