వరుసగా నాలుగో రోజు బువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఎస్‌అండ్‌పీ 35 పాయింట్లు(1 శాతం) ఎగసి 3,479 వద్ద నిలవగా.. నాస్‌డాక్ 199 పాయింట్లు(1.75 శాతం) జంప్‌చేసి 11,665 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 83 పాయింట్లు(0.3 శాతం) బలపడి 28,332 వద్ద స్థిరపడింది. వెరసి డోజోన్స్ సరికొత్త గరిష్టానికి 4 శాతం చేరువలో నిలిచింది. జులైలో తయారీ రంగ జోరుకు నిదర్శనంగా డ్యురబుల్ గూడ్స్ ఆర్డర్లు 11 శాతం వృద్ది చెందడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇండెక్సుల జోరు
ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ లాభపడటంతో నాస్‌డాక్ 2020లో 39వ సారి సరికొత్త రికార్డును సాధించింది. ఇక ఎస్‌అండ్‌పీ సైతం 2020లో ఇప్పటివరకూ 18వ సారి రికార్డ్ గరిష్టాలను అందుకోవడం విశేషం! కాగా.. కోవిడ్-19 ప్రభావతో మార్చి 23న నమోదైన కనిష్టం 2,192 పాయింట్ల నుంచి ఎస్‌అండ్‌పీ 59 శాతం దూసుకెళ్లింది. ఇక జనవరి నుంచి చూస్తే కోవిడ్-19 నేపథ్యంలోనూ నాస్‌డాక్ 30 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!
నెట్‌ఫ్లిక్స్ దూకుడు
బుధవారం ట్రేడింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ గత మూడేళ్లలోలేని విధంగా 12 శాతం దూసుకెళ్లి 547 డాలర్లను అధిగమించింది. ఇతర ఫాంగ్ స్టాక్స్‌లో మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్, ఫేస్‌బుక్ సరికొత్త గరిష్టాలను తాకాయి. ఈ బాటలో డోజోన్స్ ఇండెక్స్‌లో చోటు సాధించనున్న సేల్స్‌ఫోర్స్.కామ్ సైతం రికార్డ్ గరిష్టానికి చేరింది. పటిష్ట ఫలితాలు, గైడెన్స్ ఇందుకు దోహదం చేయగా.. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 6.4 శాతం జంప్‌చేసి 2153 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర దిగ్గజాలలో యాపిల్ 1.4 శాతం పుంజుకోగా.. బోయింగ్ 1.6 శాతం క్షీణించింది. ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడంతో హెచ్‌పీ ఎంటర్‌ప్రైజ్ 3.6 శాతం లాభపడగా.. ఫలితాలు నిరాశపరచడంతో రిటైలర్ నార్డ్‌స్ట్రామ్ 5.5 శాతం పతనమైంది. హరికేన్ లారా కారణంగా ఇంధన రంగ షేర్లు డీలాపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment