వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఎస్‌అండ్‌పీ 23 పాయింట్లు(0.7 శాతం) ఎగసి 3,508 వద్ద నిలవడం ద్వారా వరుసగా ఆరో రోజు చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ఈ బాటలో నాస్‌డాక్ 70 పాయింట్లు(0.6 శాతం) బలపడి 11,696 వద్ద ముగిసింది. వెరసి 2020లో 40వ సారి సరికొత్త గరిష్ట రికార్డును అందుకుంది. ఇక వీటితో పోలిస్తే కొంత వెనకడుగులో ఉన్న డోజోన్స్ శుక్రవారం 162 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 28,654 వద్ద స్థిరపడింది. తద్వారా 2020లో ఏర్పడిన నష్టాల నుంచి బయటపడింది. అంటే మార్చిలో నమోదైన కనిష్టం నుంచి 57 శాతం ర్యాలీ చేసింది. వెరసి ఫిబ్రవరిలో సాధించిన రికార్డ్ గరిష్టాన్ని బ్రేక్ చేసేందుకు కేవలం 1,000 పాయింట్ల దూరంలోనిలిచింది. కాగా.. వరుసగా ఐదు వారాలపాటు లాభాల్లో నిలవడం ద్వారా ఎస్‌అండ్‌పీ మరో రికార్డును సాధించడం విశేషం! 1984 తదుపరి ఆగస్ట్‌లో ఎస్‌అండ్‌పీ, డోజోన్స్ 8 శాత స్థాయిలో లాభపడ్డాయి.
కారణాలున్నాయ్
కోవిడ్-19 విసురుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ 1.3 ట్రిలియన్ డాలర్ల భారీ సహాయక ప్యాకేజీకి సిద్ధపడుతుండటం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక ఆర్థిక రికవరీని సూచిస్తూ జులైలో వ్యక్తిగత వినియోగ సూచీ దాదాపు 2 శాతం జంప్‌చేయడం కూడా ఇందుకు దోహదపడినట్లు తెలియజేశారు. మరోపక్క జాక్సన్‌హోల్ వద్ద ప్రసంగంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు స్పష్టం చేయడం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు వివరించారు.
కోక కోలా అప్
వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో పానీయాల దిగ్గజం కోక కోలా, విమానయాన బ్లూచిప్ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 3 శాతం చొప్పున ఎగశాయి. క్యూ2లో నికర లాభం అంచనాలు మించడంతో డెల్ టెక్నాలజీస్ 6 శాతం జంప్‌చేసింది. క్యూ3పై అంచనాలతో హెచ్‌పీ 6 శాతం పురోగమించింది. వార్షిక సబ్‌స్క్రిప్షన్లు జోరందుకోనున్నట్లు అంచనాలు ప్రకటించిన వర్క్‌డే ఇంక్ 13 శాతం దూసుకెళ్లింది. టిక్‌టాక్ యూఎస్ యూనిట్ కొనుగోలుకి చేతులు కలిపిన వాల్‌మార్ట్ 2.7 శాతం, మైక్రోసాఫ్ట్ 1 శాతం చొప్పున లాభపడ్డాయి. బెయిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయనున్న వార్తలతో న్యుటానిక్స్ ఇంక్ 29 శాతం ర్యాలీ చేసింది. నార్వేజియన్ క్రూయిజ్, రాయల్ కరిబియన్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment