లాక్‌డవున్‌లకు మంగళం పాడుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటుందన్న అంచనాలు యూఎస్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజు మార్కెట్లు ఊపందుకున్నాయి. డోజోన్స్ 217 పాయింట్లు(0.85 శాతం) బలపడి 25,813 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 47 పాయింట్లు(1.55 శాతం) ఎగసి 3,100 వద్ద ముగిసింది. నాస్‌డాక్ మరింత అధికంగా 185 పాయింట్లు(1.9 శాతం) పురోగమించి 10,059 వద్ద స్థిరపడింది. అయితే ఫ్లోరిడా, కనెక్టికట్ తదితర ప్రాంతాలలో రెండో దశ కరోనా కేసులు తలెత్తుతున్న వార్తలతో ఇన్వెస్టర్లలో అంతర్గతంగా ఆందోళనలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు మంగళవారం ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. అటు వైట్‌హౌస్, ఇటు ఫెడరల్ రిజర్వ్ భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నట్లు తెలియజేశారు.
33 ఏళ్ల తరువాత
ఈ ఏడాది(2020) రెండోత్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో ఎస్‌అండ్‌పీ.. 20 శాతం ర్యాలీ చేసింది. తద్వారా 1998 జూన్ క్వార్టర్ తరువాత భారీగా పురోగమించింది. అయితే 2008 తొలి క్వార్టర్ తదుపరి ఈ జనవరి-మార్చిలో 20 శాతం పతనంకావడం గమనార్హం! ఇక క్యూ2(ఏప్రిల్-జూన్)లో డోజోన్స్ సైతం నికరంగా 18 శాతం ఎగసింది. తద్వారా 1987 తొలి క్వార్టర్ తదుపరి అత్యధిక లాభాలు ఆర్జించింది. 1987లో డోజోన్స్ 21 శాతం పుంజుకుంది. ఈ బాటలో రెండో క్వార్టర్‌లో నాస్‌డాక్ 31 శాతం జంప్‌చేసింది. వెరసి 1999 నాలుగో త్రైమాసికం తదుపరి మళ్లీ జోరందుకుంది. 1999లో నాస్‌డాక్ ఏకంగా 48 శాతం దూసుకెళ్లింది.
బోయింగ్ వెనకడుగు
737 మ్యాక్స్ విమానాలకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో సోమవారం 15 శాతం దూసుకెళ్లిన బోయింగ్ ఇంక్ తాజాగా 6 శాతం పతనైంది. నార్వేజియన్ ఎయిర్ 97 విమానాల ఆర్డర్‌ను రద్దు చేసుకోవడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై నష్టపరిహారం కోరనున్నట్లు బోయింగ్ పేర్కొంది. ఇతర కౌంటర్లలో మైక్రాన్ టెక్నాలజీ 5 శాతం జంప్‌చేసింది. పవర్ నోట్‌బుక్స్, డేటా సెంటర్ల నుంచి చిప్‌లకు డిమాండ్ పెరగడంతో మైక్రాన్‌కు డిమాండ్ పెరిగింది. ఫుడ్ డెలివరీ యాప్ పోస్ట్‌మేట్స్‌ను కొనుగోలు చేయనున్న వార్తలతో ఉబర్ షేరు 5 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment