న్యూయార్క్: కొత్త ప్రెసిడెంట్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీకి తెరతీయనుందన్నఅంచనాలు వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా ఎయిర్‌లైన్స్, క్రూయిజర్, ఇంధన రంగ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో శుక్రవారం మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. డోజోన్స్ 249 పాయింట్లు(0.85 శాతం) ఎగసి 30,218 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ 32 పాయింట్లు(0.9 శాతం) లాభపడి 3,699 వద్ద ముగిసింది. నాస్‌డాక్ సైతం 87 పాయింట్లు(0.7 శాతం) బలపడి 12,464 వద్ద స్థిరపడింది. ఎనర్జీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు.
ఉపాధి వీక్
నవంబర్‌లో వ్యవసాయేతర రంగంలో 2.45 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించినట్లు కార్మిక శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఆరు నెలల్లో ఇది కనిష్టంకాగా.. 4.69 లక్షల మందికి ఉపాధి లభించగలదని విశ్లేషకులు వేసిన అంచనాలకు దెబ్బ తగిలింది. అక్టోబర్‌లో 6.1 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం గమనార్హం! గత నెలలో ఉపాధి క్షీణించడానికితోడు.. సెకండ్‌వేవ్‌లో కేసులు పెరగడం, శీతల సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించనున్నట్లు కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దీంతో జీడీపీకి దన్నుగా కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా సహాయక ప్యాకేజీని ఆమోదించవలసి ఉన్నట్లు డిమాండ్ చేశారు. ఉద్యోగ గణాంకాలు నిరాశపరచినప్పటికీ బైడెన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
5.4 శాతం అప్
ఇటీవల చమురు ధరలు బలపడుతుండటంతో ఎనర్జీ రంగం 5.4 శాతం ఎగసింది. డైమండ్‌బ్యాక్ ఎనర్జీ, ఆక్సిడెంటల్ పెట్రోలియం 13 శాతం చొప్పున దూసుకెళ్లాయి. షెవ్రాన్ కార్పొరేషన్ 4 శాతం పుంజుకోగా.. 787 డ్రీమ్‌లైనర్ విమానాల తయారీని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో బోయింగ్ ఇంక్ 2 శాతం క్షీణించింది. ఇతర కౌంటర్లలో నార్వేజియన్ క్రూయిజ్ 3.3 శాతం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment