ఇలాంటప్పుడే ఇన్వెస్ట్ చేయాలి.. | Sakshi Interview with Parag Mutual Fund Chairman Neil Parikh | Sakshi
Sakshi News home page

ఇలాంటప్పుడే ఇన్వెస్ట్ చేయాలి..

Published Mon, Jul 4 2016 12:32 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

ఇలాంటప్పుడే ఇన్వెస్ట్ చేయాలి.. - Sakshi

ఇలాంటప్పుడే ఇన్వెస్ట్ చేయాలి..

పరాగ్ మ్యూచ్‌వల్ ఫండ్ చైర్మన్ నీల్ పారిఖ్
ప్రైవేట్ బ్యాంకులు, టెక్నాలజీ స్టాక్స్ బాగున్నాయి
ఇన్‌ఫ్రా షేర్లవైపు చూడకపోవటమే ఉత్తమం
మూడేళ్లుగా ఏటా 20% రాబడి అందిస్తున్నాం
రెండేళ్లలో రూ.1,000 కోట్ల విలువను చేరుకుంటాం

సాక్షి, బిజినెస్ బ్యూరో: బ్రెగ్జిట్ వంటి పరిణామాలతో స్టాక్‌మార్కెట్లు తాత్కాలికంగా క్షీణించినా.. పెట్టుబడులు పెట్టేందుకు ఇలాంటి సమయాలే సరైనవని చెప్పారు ఫండ్ సంస్థ పరాగ్ పారిఖ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ (పీపీఎఫ్‌ఏఎస్) చైర్మన్ నీల్ పారిఖ్.

ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులు, టెక్నాలజీ రంగాల షేర్లు కొనుగోళ్లకు అనుకూలమైనవిగా చెప్పారాయన. రెండేళ్లలో రూ. 1,000 కోట్ల ఏయూఎం లక్ష్యంగా నిర్దేశించుకున్న నీల్ పారిఖ్... ‘సాక్షి ప్రాఫిట్ ప్లస్’కిచ్చిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
 
పెట్టుబడికి ఏఏ రంగాలు బాగున్నాయంటారు?
 బ్రెగ్జిట్‌తో దేశీ మార్కెట్లు కొంత తగ్గినప్పటికీ.. వెంటనే కోలుకున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇలాంటి తరుణాలే సరైనవి. మన దగ్గర బ్రెగ్జిట్ కన్నా  రుతుపవనాలే ముఖ్యం. వర్షాలు బాగుంటే.. మార్కెట్లూ బాగుంటాయి. ఈక్విటీలు తగ్గిన ప్రతిసారీ బంగారం లాంటి ఇతర సాధనాలు పెరగడం సహజమే. మళ్లీ పరిస్థితులు మామూలు కాగానే ఆ నిధులు తిరిగి ఈక్విటీల్లోకి వచ్చేస్తాయి.

ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులు, టెక్నాలజీ స్టాక్స్ బాగుంటాయని అంచనా. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ ఎన్‌పీఏల సమస్యలు తీరేందుకు సమయం పడుతుంది. దీంతో విస్తరణకు ఆస్కారమున్న ప్రైవేట్ బ్యాంకులు మెరుగ్గా రాణిస్తున్నాయి. పెట్టుబడులు ఎక్కువగా అవసరమయ్యే మౌలిక రంగ సంస్థలు లాభాల్లోకి రావాలంటే చాన్నాళ్లు పడుతుంది కనక అటువైపు వెళ్లకపోవడం ఉత్తమం. అయితే, ఏదైనా ప్రత్యేక రంగాన్ని ఎంచుకోవడం కన్నా నాణ్యమైన షేర్‌ను ఎంచుకోవడమే ముఖ్యం. 15 శాతం రాబడులు వచ్చినా మెరుగ్గా ఉన్నట్లే. ఆ లెక్కన కొన్నాళ్లలోనే మీ పెట్టుబడి రెట్టింపవుతుంది.
 
ప్రస్తుతం మీ ఫండ్ ఆస్తులెంత?
మేం గతంలో పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సేవలందించాం. కానీ నియంత్రణల కారణంగా దాన్నుంచి వైదొలిగి మూడేళ్ల కిందట మ్యూచువల్ ఫండ్ సేవల్లోకి వచ్చాం. ఈ మూడేళ్లలోనే ఫండ్ ఆస్తులు రూ.683 కోట్లకు చేరాయి. 8వేల పైచిలుకు క్లయింట్లున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో సుమారు 150 మంది పైగా ఉన్నారు. ముంబై కేంద్రంగా ఉన్న మా సంస్థ.. పుణె, చెన్నైల్లోనూ సేవలందిస్తోంది. ఏడు వందల పైచిలుకు ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌తో (ఐఎఫ్‌ఏ) చేతులు కలిపాం. వచ్చే రెండేళ్లలో ఏయూఎంను రూ.1,000 కోట్ల స్థాయికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
 
మీ ఫండ్ పనితీరు ఎలా ఉంది? రాబడి శాతమెంత?
 రాశి కన్నా వాసి ముఖ్యమనేది మా నమ్మకం. అందుకే రకరకాల ఫండ్స్‌తో గందరగోళపర్చకుండా పీపీఎఫ్‌ఏఎస్ లాంగ్ టర్మ్ వేల్యూ ఫండ్ (పీఎల్‌టీవీఎఫ్) పేరిట ఒకే ఫండ్‌ను తెచ్చాం. మూడేళ్లుగా ఇది వార్షిక ప్రాతిపదికన సుమారు 20 శాతం మేర రాబడులిస్తోంది. సగటున మా క్లయింట్ల ఇన్వెస్ట్‌మెంట్ సుమారు రూ.8 లక్షల దాకా ఉంటోంది. అలాగని కేవలం సంపన్న ఇన్వెస్టర్లే కాకుండా సామాన్య ఇన్వెస్టర్లకూ అవకాశం ఉండేలా సిప్ విధానాన్ని కూడా అందిస్తున్నాం. నెలనెలా రూ. 1,000 కూడా ఇన్వెస్ట్ చేసే వీలుంది.
 
మీ ఇన్వెస్ట్‌మెంట్ విధానమేంటి?
అంటే... షేర్లలోనేనా లేక డెట్‌లోనూ పెడతారా?

ఒకే ఫండ్ ద్వారా ఇటు దేశీ, అటు విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేయటం మా ప్రత్యేకత. సాధారణంగా విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఇతర సంస్థలు.. ఫీడర్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వాటిని డెట్ ఫండ్లుగా పరిగణించడం వల్ల పన్నులూ ఎక్కువే ఉంటున్నాయి. కానీ మా పోర్ట్‌ఫోలియోలో నేరుగా సుమారు 65% దేశీ ఈక్విటీలు, డెట్ మార్కెట్లకు, 35% విదేశీ ఈక్విటీలకు కేటాయిస్తున్నాం. స్టాక్స్, కరెన్సీలు హెచ్చుతగ్గులకు లోనైనా మా హెడ్జింగ్ వ్యూహంవల్ల ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులొస్తాయి. దీంతో పాటు దీర్ఘకాలికం కనక పన్ను ప్రయోజనా లూ ఉంటాయి. విదేశీ షేర్లలో యాపిల్, గూగుల్ వంటివి కూడా మా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.
 
మీ ఫండ్ ప్రత్యేకతలేంటి?
పూర్తి పారదర్శకత ఉంటుంది. ఇన్వెస్టర్లకు భరోసా కలిగేలా స్వయంగా కంపెనీ ప్రమోటర్లు, ఉద్యోగులు దీన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫండ్ పెట్టుబడుల్లో సు మారు 13% మాదే. పెట్టుబడులు దీర్ఘకాలం కొనసాగిస్తేనే లాభాలొస్తాయి. అందుకే కనీసం ఐదేళ్లయినా కొనసాగించే వారికే ఇది అనువైనదని ముందే చెబుతున్నాం. దాన్ని బట్టి వారు తగు నిర్ణయం తీసుకోవచ్చు. ఎగ్జిట్ లోడ్ తొలి ఏడాది రెండు శాతంగాను, ఏడాది నుంచి రెండేళ్ల లోపు ఒక్క శాతంగాను ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement