స్టాక్స్‌..రాకెట్స్‌! | sakshi special story of share market | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌..రాకెట్స్‌!

Published Sat, Oct 26 2019 5:26 AM | Last Updated on Sat, Oct 26 2019 5:32 AM

sakshi special story of share market - Sakshi

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం, వాణిజ్య యుద్ధ భయాలు, జీడీపీ అంచనాల తగ్గింపు, కంపెనీల ఆదాయాల డౌన్‌గ్రేడింగ్‌ వంటి గడ్డు పరిస్థితుల్లోనూ నిఫ్టీ గతేడాది దీపావళి (2018 నవంబర్‌ 7) నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ 15 దాకా సుమారు 11% రాబడులిచ్చింది. కానీ మిడ్‌క్యాప్‌ సూచీ 6%, స్మాల్‌క్యాప్‌  సూచీ 10% మేర క్షీణించాయి. అయితే, రియల్టీ 14%, బ్యాంకెక్స్‌ 13%, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 13% పెరిగాయి. ఇక సంవత్‌ 2076లో ఆశావహ పరిస్థితులే కనిపిస్తున్నాయన్నది బ్రోకరేజీ సంస్థల మాట.

ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు,  కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును 30% నుంచి 22 శాతానికి తగ్గించడం, తయారీ రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చే చర్యలు ప్రకటించడం సెంటిమెంటును మెరుగుపరుస్తాయన్నది వారి అంచనా. ఈ నేపథ్యంలో నిఫ్టీ 14,000 పాయింట్లకు , సెన్సెక్స్‌ 46,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. ‘సంవత్‌ 2076’లో ఐటీ, మెటల్, ఫార్మా, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లకు దూరంగా ఉండటమే మంచిదన్నది బ్రోకరేజీ సంస్థల సూచన. ప్రైవేట్‌ బ్యాంకులు, బీమా సంస్థలు, ఎఫ్‌ఎంసీజీ రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నాయి. ఆ సిఫారసుల వివరాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...


బ్రోకరేజి సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
ఐసీఐసీఐ బ్యాంక్‌
ప్రస్తుత ధర రూ. 469 
టార్గెట్‌ ధర రూ. 550

ఇతరత్రా సవాళ్లు, కొత్తగా బయటికొస్తున్న మొండిపద్దులకు సంబంధించి మిగతా బ్యాంకులతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంకు పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆదాయాలను మెరుగుపర్చుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. రుణ వితరణకు సంబంధించి వార్షిక ప్రాతిపదికన 2019–21లో 17 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చు.

హెచ్‌యూఎల్‌
ప్రస్తుత ధర రూ. 2,143
టార్గెట్‌ ధర రూ. 2,265

మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వేగంగా మార్పులు, చేర్పులు చేసుకోగల సామర్థ్యాలు, ప్రీమియమైజేషన్‌ ట్రెండు పటిష్టంగా ఉండటం, టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవటం వంటివి ఈ సంస్థకు సానుకూలాంశాలు. లార్జ్‌ క్యాప్‌ కన్జూ మర్‌ సంస్థల్లో హెచ్‌యూఎల్‌     ఆదాయాలు మరింత మెరుగ్గా నమోదయ్యే అవకాశాలున్నాయి.

టైటాన్‌
ప్రస్తుత ధర రూ. 1,334
టార్గెట్‌ ధర రూ. 1,435

సొంతంగా అమలు చేస్తున్న వ్యూహాలు, నియంత్రణ వ్యవస్థ పరంగా సానుకూలాంశాలు టైటాన్‌ వృద్ధికి దోహదపడనున్నాయి. సేమ్‌ స్టోర్‌ సేల్స్‌ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌జీ) అమ్మకాల వృద్ధిలో జ్యుయలరీ విభాగం వాటా 60% పైగా ఉంది. నిర్వహణ మార్జిన్లు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.  

ఎస్‌బీఐ
ప్రస్తుత ధర రూ. 282
టార్గెట్‌ ధర రూ. 350

నిర్వహణ పనితీరు స్థిరంగా ఉంది. ఆదాయాలు మెరుగుపడతాయి. అలాగే, ఎన్‌సీఎల్‌టీకి చేరిన మొండిపద్దుల నుంచి కూడా భారీ రికవరీలకు గణనీయమైన అవకాశాలున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ
ప్రస్తుత ధర రూ. 2,103    
టార్గెట్‌ ధర రూ. 2,600

లిక్విడిటీ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ.. తక్కువ వ్యయాలతో నిధులు సమీకరించుకోగలగడం, మార్కెట్‌ షేరు పెంచుకోగలగడం దీనికి సానుకూల అంశాలు. 2019–2022 మధ్య ఏయూఎం వృద్ధి వార్షిక ప్రాతిపదికన 14 శాతం స్థాయిలో ఉండొచ్చని, నికర వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఉండగలవని అంచనా.  

బ్రోకరేజి సంస్థ: రెలిగేర్‌ బ్రోకింగ్‌

హావెల్స్‌ ఇండియా
ప్రస్తుత ధర రూ. 665 
టార్గెట్‌ ధర రూ. 795

కొంగొత్త ఉత్పత్తులతో పోర్ట్‌ఫోలియోను వేగవంతంగా విస్తరిస్తోంది. ఎఫ్‌ఎంఈజీ రంగంలో అత్యధికంగా మార్కెట్‌ వాటా, పటిష్టమైన నెట్‌వర్క్‌ దీనికి లాభించే అంశాలు. పండుగ సీజన్‌ డిమాండ్‌తో రాబోయే రోజుల్లో పనితీరు మరింత మెరుగుపడవచ్చు. రుణభారం తక్కువగా ఉండటం, రాబడులు మెరుగ్గా ఉండటం కలిసొస్తాయి.

మహీంద్రా అండ్‌ మహీంద్రా
ప్రస్తుత ధర రూ. 578 
టార్గెట్‌ ధర రూ. 695

ఆటో పరిశ్రమలో మందగమ నం కారణంగా ఏడాది కాలంగా ఈ షేరు కరెక్షన్‌కు లోనయ్యింది. వర్షపాతం బాగుండటం, ద్రవ్య లభ్యత మెరుగ్గా ఉండటం, తక్కువ స్థాయిలో వడ్డీ రేట్లు ట్రాక్టర్‌ పరిశ్రమ రికవరీకి తోడ్పడగలవని అంచనా. ఫోర్డ్‌ ఇండియాతో జట్టు కట్టడం .. ఎంఅండ్‌ఎం పోర్ట్‌ఫోలియో మరింత పటిష్టపర్చుకోవడానికి, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవడానికి, భారత్‌ నుంచి ఎగుమతులు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి.

మారికో
ప్రస్తుత ధర రూ. 393       
టార్గెట్‌ ధర రూ. 451

సమీప భవిష్యత్‌లో ఎఫ్‌ఎంసీజీకి సవాళ్లు ఉన్నప్పటికీ.. క్రమంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకోవచ్చు. సానుకూల అంచనాల కారణంగా 13–15 శాతం మేర ఆదాయ వృద్ధిని కంపెనీ ఆశిస్తోంది. కొత్త ఉత్పత్తులు, కొన్ని విభాగాల్లో అగ్రస్థానం ఉండటంతో పాటు కొబ్బరి ధరలు తగ్గుతుండటం.. కంపెనీ మార్జిన్లపరంగా సానుకూల అంశాలు.

వోల్టాస్‌
ప్రస్తుత ధర రూ. 699
టార్గెట్‌ ధర రూ. 780

పెరిగే డిమాండ్‌కు తగ్గట్లుగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కొత్త ఉత్పత్తులు, నెట్‌వర్క్‌ పటిష్టపర్చుకోవడం  సానుకూల అంశాలు. మున్ముందు రూమ్‌ ఏసీలు, ఎయిర్‌ కూలర్లకు డిమాండ్‌తో వోల్టాస్‌ విక్రయాలు గణనీయంగా పెరగవచ్చు. తీవ్ర పోటీ ఉన్నా రూమ్‌ ఏసీల విభాగంలో వోల్టాస్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవచ్చు.

బ్రోకరేజి సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌

సుప్రీం ఇండస్ట్రీస్‌
ప్రస్తుత ధర రూ. 1,173     
టార్గెట్‌ ధర రూ. 1,420

దేశీయంగా అతి పెద్ద ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ సంస్థల్లో ఒకటి. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం, అన్ని ప్రాంతాల్లో తాగు నీటి వసతి కల్పించడం, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపర్చడం వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు పైపుల రంగానికి .. తద్వారా ఈ సంస్థకు సానుకూల అంశాలు. 2019–21 మధ్య కాలంలో కంపెనీ ఆదాయాలు 13 శాతం పైగా వృద్ధి చెందగలవని అంచనా.

యునైటెడ్‌ బ్రూవరీస్‌
ప్రస్తుత ధర రూ. 1,337
టార్గెట్‌ ధర రూ. 1,620


దేశీ బీరు మార్కెట్లో 52 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. పటిష్టమైన బ్రాండ్స్, విస్తృతమైన నెట్‌వర్క్‌ దీనికి బలం. ఇతర ఉత్పత్తుల రేట్ల పెంపుతో పాటు ప్రీమియం బ్రాండ్స్‌ విక్రయాలు మెరుగుపడనుండటం సంస్థకు సానుకూలం. కొత్తగా క్రాఫ్ట్‌ బీరు, నాన్‌–ఆల్కహాల్‌ బెవరేజెస్‌ వ్యాపారాలు కూడా సంస్థకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి.

కాన్సాయ్‌ నెరోలాక్‌
ప్రస్తుత ధర రూ. 545
టార్గెట్‌ ధర రూ. 620

దేశీయంగా అతి పెద్ద ఇండస్ట్రియల్‌ పెయింట్‌ కంపెనీ. ఇండస్ట్రియల్‌ పెయింట్స్‌ విభాగంలో 35 శాతం, మొత్తం పెయింట్స్‌ మార్కెట్లో 14 శాతం వాటా ఉంది. పట్టణీకరణ, రీపెయింటింగ్‌కు డిమాండ్‌తో పాటు మెరుగైన వర్షపాతం, అందరికీ ఇళ్ల పథకాలు  మొదలైనవి పెయింట్‌ పరిశ్రమకు, ఈ సంస్థకు సానుకూల అంశాలు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటు కోత కూడా కంపెనీకి లాభిస్తుంది.  

డాబర్‌ ఇండియా
ప్రస్తుత ధర రూ. 465  
టార్గెట్‌ ధర రూ. 550

పలు రకాల ఉత్పత్తులతో.. వివిధ విభాగాల్లోకి కంపెనీ విస్తరించింది. మూడు బ్రాండ్స్‌ (రియల్, వాటికా, ఆమ్లా) టర్నోవరు రూ. 1,000 కోట్ల పైగా ఉంటుండగా, రూ. 100 కోట్ల పైగా టర్నోవరుండే బ్రాండ్స్‌ 16 దాకా ఉన్నాయి. పతంజలి నుంచి పోటీ తగ్గి గత కొద్ది త్రైమాసికాలుగా రెండంకెల స్థాయి వృద్ధి సాధిస్తోంది.  

జేకే సిమెంట్‌
ప్రస్తుత ధర రూ. 1,117
టార్గెట్‌ ధర రూ. 1,260

గ్రే సిమెంట్‌ విభాగంలో టాప్‌ సంస్థల్లో ఇదొకటి. వైట్‌ సిమెంట్‌లో మార్కెట్‌ లీడరు. ఉత్తర, దక్షిణాది మార్కెట్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ విస్తరణ ప్రణాళికల కోసం రూ.2,000 కోట్లు వెచ్చిస్తోంది. వైట్‌ సిమెంటు విభాగంలో అగ్రస్థానంలో ఉండటం, కార్పొరేట్‌ ట్యాక్స్‌ కోత దీనికి లాభించగలవని అంచనా.  

బ్రోకరేజి సంస్థ : ఏంజిల్‌ బ్రోకింగ్‌

మారుతీ సుజుకీ
ప్రస్తుత ధర రూ. 7,469
టార్గెట్‌ ధర రూ. 8,552

ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో 52 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతూ ప్రీమియం కస్టమర్లను కూడా ఆకర్షిస్తోంది. ఆటోమొబైల్‌ రంగం రికవర్‌ అయ్యే క్రమంలో ముందుగా అవకాశాలను అందిపుచ్చుకునే సత్తా ఉండటం దీనికి సానుకూలం.

జీఎంఎం ఫాడ్లర్‌
ప్రస్తుత ధర రూ. 1,421
టార్గెట్‌ ధర రూ. 1,740

ఆగ్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మా తదితర రంగాల్లో రసాయనాల ప్రాసెసింగ్‌కు ఉపయోగించే గ్లాస్‌ లైన్డ్‌ (జీఎల్‌) స్టీల్‌ పరికరాల ఉత్పత్తిలో దేశీయంగా అగ్రస్థానంలో ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాలకు సరిపోయేలా ఆర్డర్‌ బుక్‌ పటిష్టంగా ఉంది. మధ్యకాలికంగా జీఎల్‌యేతర వ్యాపారాలను కూడా మెరుగుపర్చుకుంటోంది.

లార్సన్‌ అండ్‌ టూబ్రో
ప్రస్తుత ధర రూ. 1,425
టార్గెట్‌ ధర రూ. 1,850  

ఇన్‌ఫ్రా, హైడ్రోకార్బన్, సర్వీసుల విభాగాలతో దేశీయంగా అతి పెద్ద ఈపీసీ కంపెనీ. వివిధ అనుబంధ సంస్థల ద్వారా ఐటీ, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగాలలోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. దేశ, విదేశాల్లో రూ.3 లక్షల కోట్ల విలువ చేసే ఆర్డర్లతో పటిష్టంగా ఉంది. ప్రభుత్వం ఇన్‌ఫ్రాపై దృష్టి, కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటు తగ్గింపు  వంటివి సంస్థకు లాభించేవి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
ప్రస్తుత ధర రూ. 1,229
టార్గెట్‌ ధర రూ. 1,390

డిజిటల్‌ ప్లాట్‌ఫాం ద్వారా వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతోంది. నగరాలు కానిచోట కొత్త శాఖల సంఖ్యను మరింతగా పెంచుకోవడం, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌)లను 4 రెట్లు పెంపు, వర్చువల్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ క్లయింట్స్‌ సంఖ్య రెట్టింపు వంటి లక్ష్యాలు నిర్దేశించుకుంది. మెరుగైన మార్జిన్లు నమోదు చేయగలుగుతోంది.

బ్లూ స్టార్‌  
ప్రస్తుత ధర రూ. 795  టార్గెట్‌ ధర రూ. 867

భారత్‌లో ఏసీలు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఒకటి. రూమ్‌ ఏసీల మార్కెట్లో ప్రతి ఏడాది తన మార్కెట్‌ వాటాను పెంచుకుంటూనే ఉంది. ఫలితంగా కంపెనీ మొత్తం ఆదాయంలో కూలింగ్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌ వాటా పదేళ్లలో రెట్టింపైంది. ఇదే జోరు భవిష్యత్తులో కూడా కొనసాగనున్నది. రెండేళ్లలో ఆదాయం 11 శాతం చొప్పున వృద్ధి చెందగలదని అంచనా. మార్జిన్లు వచ్చే ఏడాది 7%కి పెరగవచ్చు.  

గోల్డ్‌ రన్‌..
రూ. 41,500కు చేరే అవకాశం

 అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, భౌగోళిక.. రాజకీయ ఆందోళనలు, బ్రెగ్జిట్‌పై తొలగని అనిశ్చితి... ఇవన్నీ 2019లో పసిడికి లాభించాయి. ఐఎంఎఫ్, వరల్డ్‌ బ్యాంక్‌ లాంటి సంస్థలు ప్రపంచ దేశాల వృద్ధి రేటు అంచనాలను కుదిస్తుండటంతో .. వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు బంగారం నిల్వలు మరింత పెంచుకున్నాయి. దేశీయంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం పుత్తడికి కలిసొచ్చింది. మొత్తం మీద గత దీపావళి నుంచి చూస్తే ఈక్విటీలపై 10 శాతం మేర రాబడులు రాగా.. పసిడి 21 శాతం దాకా లాభాన్నిచ్చింది. అయితే, ధరతో పాటు దిగుమతి సుంకాలూ పెరిగిపోవటం పసిడికి కొంత ప్రతికూలమే.

2019లో దిగుమతులు 12 శాతం తగ్గగా.. పండుగ సీజన్లో కూడా డిమాండ్‌ ఒక మోస్తరుగానే ఉంది.  వాణిజ్య యుద్ధభయాలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. వేగం తగ్గినా.. పసిడి పరుగు కొనసాగుతుందనే అంచనాలున్నాయి. ప్రధాన ఎకానమీల్లో మందగమనం మరి కొన్నాళ్లు కొనసాగే అవకాశాలు, సెంట్రల్‌ బ్యాంకులు ఉదార విధానాలు కొనసాగించనుండటం పసిడి ధరకు మద్దతుగా నిలవవచ్చు. ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధ భయాలు తగ్గిపోతే పసిడి కొంత కరెక్షన్‌కు లోనైనా.. రూ.35,500 మద్దతును నిలబెట్టుకోగలిగితే మళ్లీ గత గరిష్ట స్థాయి రూ.39,500ను తాకవచ్చు.. ఆ పైన వచ్చే 12 నెలల్లో రూ. 41,500కి కూడా చేరవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement