కొండంత భరోసా..
బేసిక్స్.. బీమా
జీవితం, ఆరోగ్యం మొదలు ఇళ్లు, వాహనాల దాకా ఊహించని ప్రమాదాల్లో చిక్కుబడినప్పుడు ఆర్థిక పరిస్థితులు తల్లకిందులు కాకుండా భరోసా కల్పించేవి బీమా పాలసీలు. కొంత డబ్బు కడితే కొండంత భరోసా కల్పించే బీమా పాలసీల ఆవశ్యకతపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీమాకి సంబంధించిన ప్రాథమిక అంశాల గురించి తెలియజేసే ప్రయత్నమే ఇది.
బీమా అనగానే ఠక్కున గుర్తొచ్చేది జీవిత బీమా .. ఎల్‌ఐసీ (అదే.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్). కానీ, ఇన్సూరెన్స్ అంటే ఇదొక్కటే కాదు. లైఫ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటూ అవసరానికి ఒకటి చొప్పున రకరకాల పాలసీలు ఉన్నాయి. వీటిలో ముందుగా జీవిత బీమా పాలసీలతో మొదలుపెడదాం.
పాలసీ తీసుకున్న వ్యక్తి హఠాత్తుగా మరణించినా.. వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఆర్థిక కష్టాల్లో పడకుండా చూడటం జీవిత బీమా పాలసీల ముఖ్యోద్దేశం. పాలసీదారులు తమ తమ ఆదాయాలు, కుటుంబ అవసరాలను బట్టి ఎంత మొత్తానికి బీమా పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోవచ్చు. దీన్నే కవరేజి అంటారు. ఈ కవరేజి పొందడానికి కొంత మొత్తాన్ని బీమా కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే ప్రీమియం అంటారు. మొత్తం ప్రీమియాన్ని ఒకేసారే చెల్లించాల్సిన పని లేకుండా మూణ్నెల్లకో, ఆర్నెల్లకో, ఏడాదికో ఒకసారి చొప్పున దీన్ని చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి కంపెనీలు.
సాధారణంగా.. వార్షికాదాయానికి పది రెట్లు కవరేజీ ఉండేలా బీమా పాలసీ తీసుకోవడం మంచిది. ప్రీమియం కూడా కవరేజికి తగినట్లే ఉంటుంది. అంతే కాదు.. వయసును బట్టి ఇది మారిపోతుంటుంది. అంటే పది లక్షల రూపాయల కవరేజి కోసం పాతికేళ్ల వ్యక్తికి కొంత తక్కువగా ప్రీమియం ఉంటే 35 ఏళ్ల వ్యక్తికి మరింత ఎక్కువగా ఉంటుంది.
పథకాలు రకరకాలు: లైఫ్ ఇన్సూరెన్స్‌లో వివిధ పథకాలు ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్, మనీ బ్యాక్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (యులిప్స్) లాంటివి ఇందులో ఉన్నాయి.