‘‘ఓ దేవా నువ్వు ఎంతో కరుణామయుడవు. నీ దయా దాక్షిణ్యాలతో నా జీవితం ఎంతో సంతృప్తికరంగా, సుఖసంతోషాలతో గడుస్తోంది’’ అన్న మాటలు మంత్రి చెవిన పడ్డాయి.
రాజుగారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది. ఇది గమనించి రాజుగారి కుటుంబ సభ్యులు, దర్బారులోని మంత్రులు రాజుగారి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందసాగారు. ఆస్థాన వైద్యుణ్ణి పిలిపించారు. వైద్యుడు రాజుగారిని అన్ని రకాలుగా పరీక్షించి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని చెప్పాడు. రాజుగారు కేవలం నిరాశ, నిస్పృహలకు లోనై అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారని వివరించాడు. రాజుగారి ఆరోగ్యం కుదుటపడటం కోసం వైద్యుడు ఓ సలహా ఇచ్చాడు. ‘‘తన రాజ్యంలో ఎవరైతే సుఖసంతోషాలతో, ఆత్మసంతృప్తితో ఉంటారో అలాంటి వ్యక్తి చొక్కాను రాజుగారు ధరిస్తే ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది’’ అని చెప్పాడు.
తన రాజ్యంలో సుఖసంతోషాలతో, ఆత్మసంతృప్తితో గడుపుతున్న వ్యక్తిని అన్వేషించమని, ఆ వ్యక్తి చొక్కాను తీసుకురావాలని రాజుగారు మంత్రిని ఆదేశించారు. రాజుగారి ఆజ్ఞానుసారం మంత్రి, కొందరు సైనికులను వెంటబెట్టుకుని అలాంటి వ్యక్తిని అన్వేషించడానికి బయలుదేరాడు. తనకు కావాల్సిన వ్యక్తి జాడకోసం రాజ్యమంతా గాలించాడు. ఎంతోమందిని వాకబు చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. దారిమధ్య లోని ఒక పూరి గుడిసెలోంచి ఏదో శబ్దం రావడాన్ని గమనించిన మంత్రి.. గుడిసె దగ్గరకు వచ్చాడు. ఆ గుడిసెలోంచి, ‘‘ఓ దేవా నువ్వు ఎంతో కరుణామయుడవు. నీ దయా దాక్షిణ్యాలతో నా జీవితం ఎంతో సంతృప్తికరంగా, సుఖసంతోషాలతో గడుస్తోంది’’ అన్న మాటలు మంత్రి చెవిన పడ్డాయి. ఆ మాటలు విని తాను ఎలాంటి వ్యక్తి కోసమైతే అన్వేషిస్తున్నాడో అతను తారసపడ్డాడని మంత్రి సంబరపడి పోయాడు. ‘‘గుడిసెలోకి వెళ్లి ఆ వ్యక్తి ధరించిన చొక్కాను, అతన్ని అడిగి తీసుకురావాలని, అందుకు ప్రతిఫలంగా రాజుగారు అతనికి ఎన్నో విలువైన బహుమతులను ఇస్తారన్న విషయమూ అతనికి చెప్పాలని సైనికులకు చెప్పి పంపాడు. సైనికులు ఆ గుడిసెలోకి వెళ్లి కాసేపటి తర్వాత చిరిగిపోయి, మాసికలు వేయబడ్డ ఆ చొక్కాను తీసుకువచ్చి మంత్రికి అందించారు. చివికిపోయిన ఆ చొక్కాను చూసిన మంత్రికి ఆశ్చర్యమేసింది. ఆ చొక్కాను తీసుకుని మంత్రి అంతఃపురానికి వచ్చి రాజు గారి చేతిలో పెట్టాడు.
జరిగినదంతా వివరించాడు. అది విన్న రాజుకు కళ్లు తెరుచుకున్నాయి. ‘గుడిసెలో ఉండి కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా లేని ఓ నిరుపేద దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. కానీ తన దగ్గర సకల సౌభాగ్యాలు, అధికారం, హోదా, దర్పం అన్నీ ఉన్నా నిరాశతో గడుపుతున్నాడు’ అని లోలోనే పశ్చాత్తాపం చెందాడు. ఆ నిరుపేద వ్యక్తి వల్ల రాజుగారికి జ్ఞానోదయం అయింది. తనకు లభించిన దానిపట్ల సంతృప్తి చెందడం అవర్చుకున్నాడు. ఇలా కొన్ని రోజుల్లోనే రాజుగారి ఆరోగ్యం మెరుగుయ్యింది. జీవితసత్యాన్ని మౌనంగా తెలియజేసిన ఆ నిరుపేద వ్యక్తికి రాజుగారు ఎన్నో విలువైన బహుమతుల్ని పంపించాడు. ఆత్మసంతృప్తి అన్నింటికన్నా మించిన సంపద అన్నారు మన ప్రవక్త (స). దైవం ప్రసాదించిన అనుగ్రహాలకు కృతజ్ఞత చెల్లించుకోవడం వల్ల ఆ పూరిగుడిసెలోని వ్యక్తికి లభించినట్లుగా ఎన్నో బహుమానాలు మనకూ లభిస్తాయి.
– ముహమ్మద్ ముజాహిద్
Comments
Please login to add a commentAdd a comment