
మన ఆయుష్షు పెరగాలంటే.. శరీరంలోని కణాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి. కానీ కాలంతోపాటు వీటిలో మార్పులు రావడం... పాడవడం సహజం. దీనివల్ల గుండె జబ్బులు, అల్జీ్జమర్స్, కేన్సర్ వంటి వ్యాధులు చుట్టుముడతాయి. ఇలా కాకుండా.. కాలంతోపాటు కణాల్లో వచ్చే మార్పులను ఆపేస్తే లేదా చాలా నెమ్మదిగా మాత్రమే మార్పులు జరిగేలా చూస్తే ఎలా ఉంటుంది? సాల్క్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారు. కొంతమేరకు విజయం సాధించారు కూడా. తక్కువ వయసులోనే వృద్ధాప్య లక్షణాలను కనపరిచే ప్రొగేరియా వ్యాధితో బాధపడుతున్న ఎలుకల జన్యువుల్లో మార్పులు చేయడం ద్వారా తాము వాటి ఆయుష్షును పెంచగలిగామని అంటున్నారు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రదీప్ రెడ్డి. ఎల్‌ఎంఎన్‌ఏ అనే జన్యువు ప్రొగేరిన్ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడం.. అది కాస్తా కణాల్లో పేరుకు పోవడం వల్ల వృద్ధాప్య సంబంధిత సమస్యలు వస్తూంటాయి.
ప్రొగేరియా ఉంటే.. సమస్య చాలా తొందరగా పలకరిస్తుందని, క్రిస్పర్ క్యాస్ –9 టెక్నాలజీ సాయంతో ఈ జన్యువును పనిచేయకుండా చేసినప్పుడు చాలావరకు సమస్యలు తొలగిపోయాయని ఆయన చెప్పారు. జన్యువుల్లో మార్పులు చేసిన రెండు నెలలకు పరిశీలిస్తే.. ఎలుకల గుండె పనితీరు మెరుగైనట్లు.. మునుపటి కంటే చురుకుగా, శక్తిమంతంగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఎలుకలతోపాటు మనుషుల్లోనూ ఎల్‌ఎంఎన్‌ఏ జన్యువు ఉంటుంది కాబట్టి.. ఈ జన్యువును నియంత్రించడం ద్వారా ఆయుష్షును పెంచవచ్చునని చెప్పారు.