బీమా తీసుకోవాల్సిందే కానీ...
ఎవరికైనా జీవితంలో ప్రధానమైనవి ఆరోగ్యం, ఆస్తి. వీటి విషయంలో అనుకోని ఇబ్బందులేవైనా ఎదురైనపుడు వాటిని తట్టుకోవటం చాలా కష్టం. ఎందుకంటే ఆరోగ్యం దెబ్బతిన్నా, ఆస్తి నష్టపోయినా బయటపడటానికి చాలా డబ్బులు అవసరమవుతాయి. కచ్చితమైన ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటే తప్ప వీటి నుంచి బయటపడలేం.
ఈ ప్రణాళికల్లో తప్పనిసరిగా ఉండాల్సింది బీమా. ఆరోగ్యానికి, ఆస్తికి రక్షణ కల్పించేందుకు అందుబాటులో ఉన్న నమ్మదగిన ఆర్థిక సాధనం బీమాయే. గతంతో పోలిస్తే ప్రస్తుతం బీమా పాలసీలను సులభంగా తీసుకోవచ్చు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో కొన్ని క్షణాల్లో ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకోవటం సాధ్యమవుతోంది. మనకు అనువైన, నచ్చిన ఒకే పాలసీని పలు కంపెనీలు ఏ విధంగా ఆఫర్ చేస్తున్నాయో పోల్చుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ పాలసీల విస్తృతి కూడా బాగా పెరిగింది. ఏదేమైనా ఇప్పటికీ భారత్‌లో ఇన్సూరెన్స్‌పై అవగాహన అంతంత మాత్రంగానే ఉంది.
అవసరాలను గుర్తించండి...
పాలసీ ఎంచుకునేటపుడు అది మీకు, మీ కుటుంబానికి అనువైనది కావటం చాలా ముఖ్యం. అందుకు భవిష్యత్తులో మీకు ఏ ఏ అంశాల వల్ల అధిక ప్రమాదాలు ఎదురవుతాయో ముందే ఊహించాలి. వాటిని ఒక ప్రాధాన్య క్రమంలో రాసుకోవాలి. ఉదాహరణకు మీరు ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటే... మీరు చేయాల్సిన మొదటి పని మీకు భవిష్యత్తులో ఏ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందో ముందే ఒక అంచనాకు రావాలి. ఎందుకంటే మార్కెట్‌లో పలు రకాల ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అన్నీ మనకు అనువుగా ఉండవు. అలాగే మీరు ఇంటి బీమా తీసుకోవాలని భావిస్తే... మీరు నివాసం ఉంటున్న ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందా? దోపిడీదారులు ఎక్కువగా ఉన్నారా? వరదలు రావచ్చా? వంటివి పరిగణనలోకి తీసుకొని... దానికి రక్షణనిచ్చే పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకునే పాలసీ ఏ ఏ అంశాలకు వర్తిస్తుంది? ప్రీమియం ఎంత? కవరేజ్ ఎంత? అనేవన్నీ ప్రధాన పాత్ర పోషిస్తాయి.
సరైన ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోండి...
సరైన పాలసీని ఎంచుకున్నాక చూడాల్సింది సరైన కంపెనీని. సదరు ఇన్సూరెన్స్ కంపెనీ పరపతిని, ప్రాముఖ్యాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఎంత ఉంది? పనితీరు ఎలా ఉంది? దానిపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి? వాటినెలా పరిష్కరిస్తోంది? ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి. అలాగే ఆ కంపెనీ ఏజెంట్ల గురించి తెలుసుకోవాలి. సాధ్యమైనంత వరకు జాతీయ స్థాయిలో పేరున్న కంపెనీ పాలసీలను తీసుకుంటే మంచిది.
ప్రీమియం కన్నా పాలసీ కవరేజ్ ముఖ్యం!
ఒకే పాలసీకి ఒక్కొక్క బీమా కంపెనీ ఒక్కో రకం ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. అది ఆ కంపెనీ పాలసీ కవరేజ్‌పై ఆధారపడి ఉంటుంది. తక్కువ ప్రీమియానికే పాలసీ వస్తోంది కదా అని తొందరపడొద్దు. పాలసీ కవరేజ్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రీమియం ఎక్కువైనా పర్వాలేదు... మంచి పాలసీని తీసుకోండి. పాలసీ తీసుకునేటప్పుడు దాని ధరను, ప్రీమియాన్ని మాత్రమే చూడొద్దు. డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. ఏవైనా అనుమానాలు ఉంటే ఏజెంట్లను అడిగి నివృత్తి చేసుకోండి.