అప్పు..అయిదు ప్రయోజనాలు..
అప్పు’డే తెల్లారిందా అంటూ నిద్ర లేచే వారు కొందరైతే.. అప్పంటేనే అలర్జీగా భావించే వారు ఆమడదూరం ఉంటారు మరికొందరు. ఇల్లు.. వాహనం.. చదువు..ఏదైనా కావొచ్చు ప్రస్తుతం అన్నింటికీ అప్పు దొరుకుతోంది. పర్సు టైట్‌గా ఉన్నప్పుడు తిరిగి కట్టడం కాస్త కష్టమే అయినా.. అప్పు తీసుకోవడంలో కొన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నది ఒప్పుకోక తప్పదు. అవేంటో మీరు చూడండి..
ఆస్తిని సమకూర్చుకోవచ్చు..
సంపన్నులను పక్కన పెడితే మిగతా వారికి ఇల్లు, వాహనం లాంటివి ఎకాయెకిన కొనుక్కోవడమంటే తలకు మించిన భారమే. ఏకమొత్తంగా జమ చేసుకుని కొనుక్కుందామంటే జీవితం గడిచిపోతుంది. ఇలాంటప్పుడే అక్కరకొస్తుంది అప్పు. ఎటుపోయి ఎటొచ్చినా తిరిగి కట్టగలిగే పక్కా ప్రణాళిక, ధీమా ఉంటే పర్సుపై ఒక్కసారిగా పెనుభారం పడకుండా కలను సాకారం చేసుకునేందుకు తోడ్పాటు ఇస్తుంది రుణం.
ఆర్థిక క్రమశిక్షణ నేర్పుతుంది..
లోను తీసుకున్న తర్వాత దాన్ని తీర్చక తప్పదు కదా. అది కూడా ఇన్ని నెలల్లోనో.. ఇన్నేళ్లలోనూ తీర్చాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతినెలా కొంత మొత్తాన్ని పక్కన తీసి ఉంచాలి. ఎగవేతదారుగా ముద్రపడకూడదన్నా.. తర్వాత ఎప్పుడైనా రుణం సులభంగా రావాలన్నా ఈఎంఐలకు సరిపడేంతగా బ్యాంకు ఖాతాలో సమయానికి డబ్బు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల అనవసర వ్యయాలు కాస్త తగ్గి.. కొంత మేర ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.
మెరుగైన క్రెడిట్ హిస్టరీ..
ప్రస్తుతం బ్యాంకులు గానీ ఆర్థిక సంస్థలు గానీ రుణం ఇవ్వాలంటే ముందుగా మన క్రెడిట్ హిస్టరీ చూస్తున్నాయి. గతంలో ఏవైనా రుణాలు తీసుకున్నామా, వాటిని సక్రమంగా తిరిగి చెల్లించామా లాంటి అంశాలను పరిశీలిస్తున్నాయి. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారి డేటా అంతా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోల దగ్గర ఉంటుంది. ఇవి ఇచ్చే స్కోరును బట్టే రుణాలు తీసుకునే వారి చెల్లింపు సామర్థ్యంపైనా, ట్రాక్ రికార్డుపైనా బ్యాంకులు ఒక అంచనాకు వస్తాయి. రుణాలు ఇస్తాయి. స్కోరు ఎంత ఎక్కువుంటే భవిష్యత్‌లో రుణం మంజూరు కావడం అంత సులువవుతుంది.
అవగాహన.. ధీమా..
రుణం తీసుకోవడం ద్వారా కలలను సాకారం చేసుకోవడంతో పాటు సక్రమంగా తిరిగి చెల్లించగలగడం ద్వారా ఆర్థికపరమైన ధీమా లభిస్తుంది. ఆర్థికాంశాలపై అవగాహనా పెరుగుతుంది. ప్రతి ఆర్థిక అవసరానికి బంధువులు, స్నేహితుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంతంగా నెగ్గుకురాగలిగే సామర్థ్యం అలవర్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా అప్పు అనేదాన్ని అనవసర భారం అని కాకుండా సానుకూల దృక్పథంతో చూస్తే అనేకానేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
పన్ను ప్రయోజనాలు..
అప్పు వల్ల అవసరం తీరడంతో పాటు పన్నుపరమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు పన్ను భారం కాస్త తగ్గించుకోవచ్చు. ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు.. ఇటు అసలుతో పాటు అటు వడ్డీ మీద కూడా ట్యాక్స్ డిడక్షన్స్ లభిస్తాయి. ఉన్నత చదువుల కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీపైనా పన్ను మినహాయింపు పొందవచ్చు.