credit history
-
రుణాల మంజూరులో కీలకంగా యూపీఐ
న్యూఢిల్లీ: రుణాల మంజూరులో యూని ఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) కీలకంగా మారిందని ఒక నివేదిక వెల్లడించింది. ‘ఓపెన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు: రుణం పొందడంలో చిక్కులు’ పేరుతో చేసిన అధ్యయనం ప్రకారం.. ప్రధానంగా క్రెడిట్ హిస్టరీ (గతంలో రుణం పొందడం) లేని వారు రుణం అందుకోవడానికి యూపీఐ దోహద పడుతోంది. యూపీఐ యాప్స్ ఆధారంగా జరిగిన డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సమాచారం అందుబాటులో ఉన్నందున.. రుణ మంజూరుకై నిర్ణయాలు తీసుకునేందుకు రుణ దాతలకు మార్గం సుగమం అవుతోంది. మొదటిసారిగా అధికారికంగా రుణం అందుకోవడానికి సామాన్యులకు వీలు కల్పి స్తోంది. యూపీఐ లావాదేవీలలో 10% పెరుగుదల క్రెడిట్ లభ్యత 7% దూసుకెళ్లేందుకు దారితీసింది. రుణగ్రహీ తలను మెరుగ్గా అంచనా వేయడానికి రుణదాతల కు డిజిటల్ ఫైనాన్షియల్ హిస్టరీలు ఎలా ఉపయోగపడ్డాయో ఈ గణాంకాలు ప్రతి బింబిస్తున్నాయి. రుణాల్లో వృద్ధి ఉన్నప్ప టికీ డిఫాల్ట్ రేట్లు పెరగలేదు. యూపీఐ– ఆధారిత డిజిటల్ లావాదేవీ డేటా రుణ దాతలు బాధ్యతాయుతంగా విస్తరించడంలో సహాయపడింది. 2016లో ప్రారంభించినప్పటి నుండి భారత్‌లో ఆర్థిక లభ్యతను యూపీఐ సమూలంగా మార్చింది.75 శాతం యూపీఐ కైవసం..యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 30 కోట్ల మంది వ్యక్తులు, 5 కోట్ల మంది వ్యాపా రులు అడ్డంకులు లేని డిజిటల్ లావా దేవీలను నిర్వహించడానికి వీలు కల్పించింది. 2023 అక్టోబర్ నాటికి భారత్‌లోని మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 75 శాతం యూపీఐ కైవసం చేసుకుంది. పాల్గొనే బ్యాంకుల కస్టమర్లందరికీ చెల్లింపులను సేవగా అందించడానికి యాప్‌లను రూపొందించడానికి థర్డ్ పార్టీ వెండార్లను యూపీఐ చెల్లింపుల వ్యవస్థ అనుమతిస్తుంది. రియల్ టైమ్‌లో ధృవీకరించదగిన డిజిటల్ లావాదేవీల సమాచారం యూపీఐ ఆధారంగా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు ఈ సమాచారాన్ని రుణాన్ని అందుకునే ప్రక్రియలో భాగంగా ఆర్థిక సంస్థలు, అనుబంధ కంపెనీలతో పంచుకో వచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విస్తృతంగా యూపీఐని ఆదరించడంలో అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. యూపీఐతో భారత దేశం సాధించిన విజయం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఓపెన్ బ్యాంకింగ్ విధానాలతో కలపడం ఎక్కువ మందికి రుణాలు అందుతాయి. అలాగే ఆవిష్కరణలను, సమానమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని అధ్యయనం వివరించింది. -
వడ్డీ ఎక్కువైనా లోన్ యాప్స్ నుంచి రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రెడిట్ హిస్టరీ చూడకుండానే లోన్ యాప్స్ రుణం అందిస్తున్నాయి. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే నిముషాల్లో డబ్బులు వచ్చి పడుతున్నాయి. లోన్ యాప్స్ ద్వారా రుణం పొందితే అధిక వడ్డీ చెల్లించాల్సిందే. ఈ విషయం తెలిసి కూడా కస్టమర్లు వీటినే ఎంచుకుంటున్నారని ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వేలో తేలింది. ఇటీవలి కాలంలో లోన్ యాప్స్ మోసాలు, వేధింపులు మితిమీరాయి. ఈ నేపథ్యంలో చేపట్టిన సర్వేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నుంచి 2 లక్షల పైచిలుకు మంది పాలుపంచుకున్నారు. వీరిలో 35 శాతం మంది మహిళలు ఉన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది 21–30 ఏళ్ల వయసువారే. ఇవీ సర్వే ముఖ్యాంశాలు.. లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకుంటే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుందనే విషయం తమకు తెలుసు అని సర్వేలో పాల్గొన్న వారిలో 1,40,387 (70 శాతం) మంది తెలిపారు. లోన్ ఇస్తామంటూ వచ్చే కాల్స్, సందేశాలను 86,796 (43 శాతం) మంది అందుకున్నారు. సర్వేలో పాల్గొన్నవారుగానీ వారి సన్నిహితులు, బంధువుల్లో లోన్ యాప్స్ ద్వారా రుణం పొందినవారు 1,02,106 (51 శాతం) ఉన్నారు. తాముగానీ, తమకు తెలిసినవారిలో లోన్ యాప్స్ బాధితులూ ఉన్నారని 1,34,607 మంది (67 శాతం) వెల్లడించారు. ఈ స్థాయిలో బాధితులు ఉన్నప్పటికీ సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదని 79 శాతం మంది చెప్పడం గమనార్హం. -
డిపాజిట్ ఉంటే.. కార్డిస్తారు!
♦ క్రెడిట్ కార్డులు పొందటానికి ఈజీ మార్గం ♦ క్రెడిట్ స్కోరు బాగులేని వారికిది అనుకూలమే ♦ వేతన రుజువులు చూపించాల్సిన పనిలేదు ♦ కాకపోతే డిపాజిట్లో 85 శాతం వరకే పరిమితి ♦ ఇతర నిబంధనలు సాధారణ కార్డుల మాదిరే ♦ తక్కువ వడ్డీకే డిపాజిట్‌ను కొనసాగిస్తుండాలి ♦ ఈ పరిస్థితుల్లో అది ప్రతికూలమే: నిపుణులు ♦ స్వయం ఉపాధి, స్థిరాదాయం లేనివారికీ బెటర్ క్రెడిట్ కార్డు ఒకప్పుడు పెద్దగా అవసరం లేదనుకునేవారు. అప్పులకు భయపడేవారు కార్డులక్కూడా దూరంగానే ఉండేవారు. ఇక అప్పులు బాగా ఎక్కువైన వారికి కంపెనీలే కార్డులిచ్చేవి కాదు. కొన్నాళ్ల కిందటిదాకా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉన్నా... పెద్ద నోట్లు రద్దు, వ్యవస్థలో నగదుకు కటకట ఏర్పడటం, వైద్య ఖర్చుల వంటివి భారీగా పెరగటం తదితర పరిణామాలతో క్రెడిట్ కార్డులకు సంబంధించి చాలా మార్పులొచ్చాయి. కార్డు వినియోగం, అవసరం బాగా పెరిగింది. అవసరానికి క్షణాల్లో అప్పు పుట్టించే ఈ కార్డులకు డిమాండూ పెరిగింది. వేతన జీవులకు క్రెడిట్ కార్డు సులభంగానే లభిస్తుంది. స్థిరమైన ఆదాయం వస్తుంది గనుక వీరు అడగకుండానే... బ్యాంకులే స్వయంగా కార్డులు చేతిలో పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం లేని వారు, స్వయం ఉపాధిలో ఉన్నవారికి, క్రెడిట్ హిస్టరీ లేని వారికి క్రెడిట్ కార్డు లభించడం అంత సులభంగా లేదు. అయితే, వీరిక్కూడా ఓ మార్గం ఉంది. నిర్ణీత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానిపై క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. వీటిని సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులుగా పరిగణిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా ఇలా ఎన్నో బ్యాంకులు ఎఫ్డీ చేస్తే ఇతర అర్హతలేవీ చూడకుండా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తున్నాయి. అందుకు గల విధి, విధానాలు ఒకసారి చూద్దాం... అర్హతలు ఇవీ.. క్రెడిట్ కార్డు తీసుకుందామనుకున్న తర్వాత సంబంధిత బ్యాంకు వద్ద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ సమయంలో బ్యాంకు అవసరమైన పత్రాలను తీసుకుంటుంది. కనుక క్రెడిట్ కార్డు సమయంలో ఇతరత్రా పత్రాలేవీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. దరఖాస్తు ఒక్కటి మాత్రం సరిపోతుంది. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు కనీసం రూ.20,000 డిపాజిట్‌ను అడుగుతున్నాయి. కోటక్ మహింద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా అయితే రూ.25,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత మేరకైనా డిపాజిట్ చేయవచ్చు. ఒక్క యాక్సిస్ బ్యాంకు మాత్రం గరిష్ట డిపాజిట్ రూ.25 లక్షలుగా పరిమితి నిర్దేశించింది. డిపాజిట్ చేయాల్సిన కాల వ్యవధి ఐసీఐసీఐ కోరల్ లేదా ఇన్స్టంట్ ప్లాటినమ్ కార్డులకు 180 రోజులుగా ఉంది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి యాస్పైర్ క్రెడిట్ కార్డు పొందాలంటే సెంట్ యాస్పైర్ టర్మ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పరిమితులు కూడా ఉన్నాయ్... డిపాజిట్‌పై తీసుకునే క్రెడిట్ కార్డుల విషయంలోనూ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకు మైనర్ల పేరిట డిపాజిట్ చేసినప్పటికీ క్రెడిట్ కార్డులిచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఇదే బ్యాంకులో ఫ్లెక్సీ డిపాజిట్, ట్యాక్స్ సేవర్ డిపాజిట్లు చేసినట్టయితే వాటిపైనా కార్డులను జారీ చేయడం లేదు. ఐసీఐసీఐ బ్యాంకు థర్డ్‌పార్టీకి, భాగస్వామ్య సంస్థలు తదితర వర్గాలకు క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదు. అలాగే, తనఖాలో ఉంచిన డిపాజిట్లపై కూడా క్రెడిట్ కార్డులు జారీ చేయడం లేదు. చాలా బ్యాంకులు డిపాజిట్ మొత్తంలో 80 శాతం విలువకు సమానమైన క్రెడిట్ లిమిట్ (రుణ పరిమితి) ఇవ్వటానికే మొగ్గు చూపిస్తున్నాయి. ఆ మేరకే కార్డులు మంజూరు చేస్తున్నాయి. ఉదాహరణకు రూ.1 లక్ష డిపాజిట్ చేసి ఉంటే రూ.80,000 వరకు లిమిట్‌తో క్రెడిట్ కార్డును తేలిగ్గా పొందొచ్చు. కొన్ని బ్యాంకులు కార్డులపై క్రెడిట్ లిమిట్‌ను కూడా పరిమితం చేస్తున్నాయి. కోటక్ మహింద్రా బ్యాంకు ఆక్వాగోల్డ్ కార్డ్‌పై గరిష్టంగా రూ.12 లక్షలకే క్రెడిట్ లిమిట్‌ను ఖరారు చేసింది. అంటే డిపాజిట్ రూ.50 లక్షలు చేసినా, రూ.12 లక్షలకే క్రెడిట్ లిమిట్‌తో కార్డు ఇస్తుంది. సెంట్రల్బ్యాంకు యాస్పైర్ క్రెడిట్ కార్డుపై రూ.10 లక్షల గరిష్ట పరిమితి ఉంది. చార్జీలు, వడ్డీ రేట్లు మామూలే! క్రెడిట్ కార్డు కాల వ్యవధి, ఫీజులు, వడ్డీ రేటు, ఇతర చార్జీలన్నీ కూడా వీటికీ సాధారణ క్రెడిట్‌కార్డుల మాదిరిగానే అమల్లో ఉన్నాయి. రుణ కాల వ్యవధి 30 నుంచి 60 రోజుల వరకు ఉంది. సకాలంలో చెల్లింపులు చేయకపోతే ఆలస్య రుసుం, వడ్డీ పడుతుంది. ఈ కార్డుల వల్ల బ్యాంకులకు ఉన్న వెసులుబాటు కార్డు దారుడు రుణం తీసుకుని చెల్లించకపోతే డిపాజిట్ నుంచి రికవరీ చేసుకుంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు అయితే క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణం గనక డిపాజిట్ విలువకు చేరినట్లయితే వెంటనే డిపాజిట్‌ను రద్దు చేసి రుణం కింద జమ చేసుకుంటోంది. క్రెడిట్ కార్డు కాలవ్యవధి అన్నది డిపాజిట్ కాలవ్యవధిపైనే ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డులకు హామీగా ఉన్న డిపాజిట్లను బ్యాంకులు సాధారణంగా ఆటో రెన్యువల్ మోడ్‌లో ఉంచుతాయి. అంటే గడువు తీరిన తర్వాత డిపాజిట్లు తిరిగి పునరుద్ధరిస్తూ ఉంటాయి. డిపాజిట్ మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా క్రెడిట్ కార్డును వాడుకోవాలని అనుకునేవారు దానిపై తనఖా మార్కును తీసేసి అన్ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు కిందకు మార్చాలంటూ బ్యాంకులను కోరవచ్చనేది రుబిక్యూ ఎండీ, సీఈవో మానవ్‌జీత్ సూచన. అయితే, మీ క్రెడిట్ స్కోరు, ఇతర అంశాల ఆధారంగా క్రెడిట్ పరిమితిని సవరించే అవకాశం ఉంటుంది. ‘‘డిపాజిట్‌పై క్రెడిట్ కార్డు తీసుకున్నాక చెల్లింపులు సకాలంలో చేయడం ద్వారా కాల వ్యవధి ముగిసే నాటికి మంచి క్రెడిట్ స్కోరును సంపాదించొచ్చు. దాంతో సాధారణ కార్డుకు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది’’ అని క్రెడిట్ మంత్రి సీఈఓ రంజిత్ పుజా తెలియజేశారు. ఈ కార్డులు ఎవరికి అనుకూలం? ఫిక్స్డ్ డిపాజిట్‌పై క్రెడిట్ కార్డులు మూడు వర్గాల వారికి అనువైనవన్నది నిపుణుల మాట. క్రెడిట్ హిస్టరీ లేకుండా, అప్పటి వరకు ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోని వారికి ఇవి అనువైనవి. వీరు డిపాజిట్‌పై కార్డు తీసుకుని అవసరాలు తీర్చుకోవడంతో పాటు క్రెడిట్ స్కోర్‌ను కూడా సాధించుకునే వీలుంటుంది. అలాగే, తక్కువ క్రెడిట్ స్కోరు ఉండి, రుణం పొందడానికి అడ్డంకిగా ఉన్న వారికి సైతం ఇవి అనుకూలం. స్థిరమైన ఆదాయం లేని వారికి కూడా ఇవి అనువైనవేనని లోన్‌ట్యాప్ సహ వ్యవస్థాపకుడు వికాస్ కుమార్ తెలియజేశారు. చిన్న వ్యాపారాల్లో, స్వయం ఉపాధిలో ఉండి అస్థిరమైన ఆదాయం కలిగిన వారు, క్రెడిట్ కార్డు కావాలనుకుంటే డిపాజిట్ చేసి సులభంగా కార్డు తీసుకోవచ్చని సూచించారు. అయితే, కార్డు పొందాలంటే ముందుగా డిపాజిట్ చేయడంతోపాటు దాన్ని లాకిన్‌లో ఉంచడం మాత్రం ప్రతికూలమే. -
బ్యాంక్ లోన్ ఉంటే జాబ్ అప్లికేషన్లు రిజెక్ట్!
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నారా? మీరు కొన్ని విషయాలు గమనించాల్సిందే. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ బ్యాంకు లోన్లలో బాకీలు లేకుండా ఉండేలా చూసుకోండి... లేకపోతే మీ జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్, జూనియర్ అగ్రికల్చర్ అసోసియేట్స్‌లో క్లరికల్ స్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి బ్యాంకుల్లో ఎటువంటి బాకీలు ఉండకూడదని ఎస్బీఐ తాజాగా ఇచ్చిన ప్రకటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోస్టులకు దరఖాస్తులు చేసే ముందు అభ్యర్ధుల తమ ఖాతాల్లో ఉన్న అప్పుల వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్(సీఐబీఐఎల్) ను పరిశీలించుకోవాలని బ్యాంకు సూచించింది. దీంతో విద్య కోసం బ్యాంకు లోన్లు తీసుకున్న విద్యార్ధులను దీని మినహాయింపు ఇవ్వాలంటూ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ ఎస్బీఐని కోరింది. -
అప్పు..అయిదు ప్రయోజనాలు..
అప్పు’డే తెల్లారిందా అంటూ నిద్ర లేచే వారు కొందరైతే.. అప్పంటేనే అలర్జీగా భావించే వారు ఆమడదూరం ఉంటారు మరికొందరు. ఇల్లు.. వాహనం.. చదువు..ఏదైనా కావొచ్చు ప్రస్తుతం అన్నింటికీ అప్పు దొరుకుతోంది. పర్సు టైట్‌గా ఉన్నప్పుడు తిరిగి కట్టడం కాస్త కష్టమే అయినా.. అప్పు తీసుకోవడంలో కొన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నది ఒప్పుకోక తప్పదు. అవేంటో మీరు చూడండి.. ఆస్తిని సమకూర్చుకోవచ్చు.. సంపన్నులను పక్కన పెడితే మిగతా వారికి ఇల్లు, వాహనం లాంటివి ఎకాయెకిన కొనుక్కోవడమంటే తలకు మించిన భారమే. ఏకమొత్తంగా జమ చేసుకుని కొనుక్కుందామంటే జీవితం గడిచిపోతుంది. ఇలాంటప్పుడే అక్కరకొస్తుంది అప్పు. ఎటుపోయి ఎటొచ్చినా తిరిగి కట్టగలిగే పక్కా ప్రణాళిక, ధీమా ఉంటే పర్సుపై ఒక్కసారిగా పెనుభారం పడకుండా కలను సాకారం చేసుకునేందుకు తోడ్పాటు ఇస్తుంది రుణం. ఆర్థిక క్రమశిక్షణ నేర్పుతుంది.. లోను తీసుకున్న తర్వాత దాన్ని తీర్చక తప్పదు కదా. అది కూడా ఇన్ని నెలల్లోనో.. ఇన్నేళ్లలోనూ తీర్చాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతినెలా కొంత మొత్తాన్ని పక్కన తీసి ఉంచాలి. ఎగవేతదారుగా ముద్రపడకూడదన్నా.. తర్వాత ఎప్పుడైనా రుణం సులభంగా రావాలన్నా ఈఎంఐలకు సరిపడేంతగా బ్యాంకు ఖాతాలో సమయానికి డబ్బు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల అనవసర వ్యయాలు కాస్త తగ్గి.. కొంత మేర ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. మెరుగైన క్రెడిట్ హిస్టరీ.. ప్రస్తుతం బ్యాంకులు గానీ ఆర్థిక సంస్థలు గానీ రుణం ఇవ్వాలంటే ముందుగా మన క్రెడిట్ హిస్టరీ చూస్తున్నాయి. గతంలో ఏవైనా రుణాలు తీసుకున్నామా, వాటిని సక్రమంగా తిరిగి చెల్లించామా లాంటి అంశాలను పరిశీలిస్తున్నాయి. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారి డేటా అంతా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోల దగ్గర ఉంటుంది. ఇవి ఇచ్చే స్కోరును బట్టే రుణాలు తీసుకునే వారి చెల్లింపు సామర్థ్యంపైనా, ట్రాక్ రికార్డుపైనా బ్యాంకులు ఒక అంచనాకు వస్తాయి. రుణాలు ఇస్తాయి. స్కోరు ఎంత ఎక్కువుంటే భవిష్యత్‌లో రుణం మంజూరు కావడం అంత సులువవుతుంది. అవగాహన.. ధీమా.. రుణం తీసుకోవడం ద్వారా కలలను సాకారం చేసుకోవడంతో పాటు సక్రమంగా తిరిగి చెల్లించగలగడం ద్వారా ఆర్థికపరమైన ధీమా లభిస్తుంది. ఆర్థికాంశాలపై అవగాహనా పెరుగుతుంది. ప్రతి ఆర్థిక అవసరానికి బంధువులు, స్నేహితుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంతంగా నెగ్గుకురాగలిగే సామర్థ్యం అలవర్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా అప్పు అనేదాన్ని అనవసర భారం అని కాకుండా సానుకూల దృక్పథంతో చూస్తే అనేకానేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పన్ను ప్రయోజనాలు.. అప్పు వల్ల అవసరం తీరడంతో పాటు పన్నుపరమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు పన్ను భారం కాస్త తగ్గించుకోవచ్చు. ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు.. ఇటు అసలుతో పాటు అటు వడ్డీ మీద కూడా ట్యాక్స్ డిడక్షన్స్ లభిస్తాయి. ఉన్నత చదువుల కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీపైనా పన్ను మినహాయింపు పొందవచ్చు.