బీమా అంటే...!! పాలసీ కట్టిన వారు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే సాధనం!!. అంతేనా? నిజానికి ఇప్పటికీ చాలా మందికి బీమా అంటే ఇదే భావన ఉంది. వాస్తవానికి దీని ప్రయోజనాలు అంతకు మించి ఉన్నాయి. ఇది ఎన్నో ఆర్థిక రిస్కుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఒకవేళ ఆరోగ్య పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయలేకపోయినా, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసమైనా, విలువైన ఆస్తులు నష్టపోయినా.. ఇది ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. పిల్లల చదువులు, ఇల్లు.. లేదా కారు కొనుగోలు లేదా ఆఖరుకు వివాహాలు మొదలైన డబ్బుతో ముడిపడి ఉన్న వాటన్నింటి కోసం ప్లానింగ్ చేసుకునేందుకు బీమా ఉపయోగపడుతుంది.
ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా?
విషయం ఏదైనా సరే అవగాహన చాలా కీలకం. కాబట్టి ఏ బీమా పాలసీని తీసుకోవాలన్నా... ముందుగా మన ఆర్థిక లక్ష్యాలు, అవసరాల గురించి విశ్లేషించుకోవాలి. దేనికి రక్షణ కోరుకుంటున్నాము.. ఎందుకు, ఎంతకాలానికి అన్నదానిపై స్పష్టత ఉండాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత తగిన ప్లాన్ ఎంపిక చేసుకోవచ్చు. వయస్సు, ఆర్థిక పరిస్థితులు, అవసరాలు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ కింద పేర్కొన్న పాలసీల్లో అనువైన దాన్ని ఎంచుకోవచ్చు.
టర్మ్ ప్లాన్: పాలసీదారుకు ఏదైనా అనుకోనిది జరిగిన పక్షంలో కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు లోనుకాకుండా భద్రత కల్పించేందుకు అత్యంత అనువైన ప్లాన్ ఇది. రుణాలు మొదలైనవి ఎన్ని ఉన్నా... ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోతగిన పాలసీ ఇది.
ఎండోమెంట్ ప్లాన్: దీర్ఘకాలంలో కొంత పెద్ద మొత్తం పోగు చేయడంతో పాటు కుటుంబానికి బీమా భద్రత ప్రయోజనాలు కూడా కల్పించాలనుకునే వారికి అనువైనవి ఈ ఎండోమెంట్ ప్లాన్స్. ఇటు జీవిత బీమా కవరేజినివ్వడంతో పాటు అటు పొదుపు సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. పాలసీదారు కన్నుమూసిన పక్షంలో సమ్ అష్యూర్డ్ ఎలాగూ లభిస్తుంది. అలాకాకుండా ఒకవేళ పాలసీ మెచ్యూర్ అయిన పక్షంలో ఏక మొత్తంగా కూడా డబ్బు లభిస్తుంది.
యాన్యుటీ ప్లాన్: రిటైర్మెంట్‌కి అత్యంత అనువైన పాలసీల్లో ఇది ఒకటి. నెలవారీగానీ లేదా మూడు నెలలకోసారి గానీ లేదా ఏడాదికోసారి గానీ నిర్ణీత మొత్తం చేతికందేలా పాలసీదారు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ముందుగానే పెట్టుకున్న నిర్ధిష్ట గడువు తర్వాత ఏకమొత్తంగా డబ్బు వచ్చేలా ఆప్షన్‌ని కూడా ఎంచుకోవచ్చు.
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్): ఇటు బీమా భద్రతతో పాటు అటు పెట్టుబడి సాధనంగా కూడా రెండురకాలుగా ఉపయోగపడతాయి యులిప్స్. స్టాక్స్, బాండ్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ నిధులను బీమా కంపెనీ ఇన్వెస్ట్ చేసి, తద్వారా వచ్చే రాబడులను అందిస్తుంది. ఇవి మార్కెట్స్‌తో అనుసంధానమైన పాలసీలు కాబట్టి పెట్టుబడుల విషయంలో రిస్కు సామర్ధ్యం, అవసరాలను బట్టి పాలసీదారు ఇన్వెస్ట్‌మెంట్ తీరుతెన్నులను నిర్దేశించవచ్చు. ఇక ఇప్పుడు ఏ పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకున్న తర్వాత.. ప్లాన్ కొనుగోలుకు ముందు పరిశీలించాల్సిన అంశాల గురించి కూడా అధ్యయనం చేయాలి. ఇందుకు సంబంధించి పరిశీలించాల్సిన అంశాల్లో ఇవి కొన్ని..
కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి: వచ్చే క్లెయిమ్‌లలో ఎంత శాతం మందికి కంపెనీ చెల్లింపులు జరుపుతోందన్నది కీలకమైన విషయం. దీన్నే క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిగా వ్యవహరిస్తారు. ఏ కంపెనీ నుంచి పాలసీ కొనుగోలు చేసినా.. ముందుగా ఆ సంస్థ తాజా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని పరిశీలించాలి.
కవరేజీ: ఎంతకు కవరేజీ తీసుకోవాలన్నది కూడా ముఖ్యమే. వార్షికాదాయాన్ని 10 సంఖ్యతో గుణించడం ద్వారా కావాల్సిన కవరేజీని తెలుసుకోవచ్చనేది ఒక బండగుర్తు.
పాలసీ ప్రీమియం: పాలసీ కోసం విడతలవారీగా కంపెనీకి కట్టాల్సిన మొత్తం ఇది. ఎంత ప్రీమియం కట్టాలన్నదానితో పాటు చెల్లించేందుకు అందుబాటులో ఉన్న ఆప్షన్స్ కూడా తెలుసుకోవాలి. ఏకమొత్తంగా కట్టాలా లేదా నెలవారీగా, మూణ్నెల్లకోసారి, ఏడాదికోసారి కట్టాలా అన్న ఆప్షన్స్‌లో ఒకదాన్ని తమ తమ ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంచుకోవచ్చు. ఒకే రకం పాలసీకి వివిధ కంపెనీలు వసూలు చేస్తున్న ప్రీమియంలు, అందిస్తున్న ప్రయోజనాలను ఒకసారి బేరీజు వేసుకోవాలి.
అవసరానికి అనుగుణమైన పాలసీ: ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకే రకంగా రూపొందించిన పాలసీని తీసుకోవడం కాకుండా.. తమ తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రైడర్స్‌ని కూడా పొందుపర్చుకునే వెసులుబాటు ఉండేటువంటి పాలసీని ఎంచుకోవడం శ్రేయస్కరం. బీమా గురించి అంతగా తెలియని పక్షంలో .. ఏజెంటును సంప్రతిస్తే వారు మీ అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు, పరిస్థితులను బట్టి అనువైన పాలసీని సూచించే అవకాశం ఉంది. అయితే, ఏదైనా సరే అన్నీ తెలుసుకున్న తర్వాతే పాలసీ కొనుగోలుపై నిర్ణయం తీసుకోండి.
మరో విషయం ఏమిటంటే.. పెరిగే వయస్సుతో పాటు ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా బీమా ప్రీమియంలు పెరుగుతాయన్నది గుర్తుంచుకోవాలి. రిస్కు లు, అనిశ్చితి పరిస్థితులు ఎప్పుడైనా తలెత్తే అవకాశం ఉంది కనుక.. సాధ్యమైనంత ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవడం మంచిది. కాబట్టి మీ ఆర్థిక లక్ష్యాలను ఒకసారి విశ్లేషించుకుని, తగిన ఆర్థిక ప్రణాళికను సత్వరం సిద్ధం చేసుకోండి.
అనిల్ కుమార్ సింగ్
చీఫ్ యాక్చువేరియల్ ఆఫీసర్, ఆదిత్య బిర్లా
సన్ లైఫ్ ఇన్సూరెన్స్
Comments
Please login to add a commentAdd a comment