న్యూఢిల్లీ: దేశంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమాను (సార్వత్రిక ఆరోగ్య బీమా) చేరువ చేసే లక్ష్యంతో.. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) 15 మంది సభ్యులతో ‘హెల్త్ ఇన్సూరెన్స్ కన్సల్టేటివ్ కమిటీ’ని (ఆరోగ్య బీమా సంప్రదింపుల కమిటీ) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రెండేళ్ల కాలానికి ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఐఆర్‌డీఏఐ సభ్యుడైన రాకేశ్ జోషి నేతృత్వం వహిస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ సజావుగా నిర్వహించుకునేందుకు, వ్యాపార సులభతర నిర్వహణకు సూచనలు ఇవ్వాలని ఐఆర్‌డీఏఐ కోరింది.
దేశంలో ప్రతి కుటుంబం ఆరోగ్య బీమా కలిగి ఉండడం అవసరమని పేర్కొంది. ‘‘దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణను పెంచాలి. ఇందుకు అడ్డుగా ఉన్న సవాళ్లు, సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు అవసరమైన సిఫారసులు చేయాలి’’అని కమిటీని కోరింది. డేటా విశ్లేషణ సహా పలు విధానాల అమలులో ప్రామాణిక విధానాలను కూడా కమిటీ సూచించనుంది. మారుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగ్గట్టు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాలని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ వ్యయాలను తట్టుకునేందుకు రక్షణగా బీమాను కొనుగోలు చేస్తున్న వారి.. అన్ని రకాల అవసరాలను తీర్చేలా ఉండాలని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment