
షట్‌డౌన్‌ను ముగించండి: బరాక్ ఒబామా
వాషింగ్టన్: ప్రతిపాదిత ఆరోగ్య బీమా పాలసీకి, బడ్జెట్‌కు అమోదం లభించక ప్రభుత్వ కార్యాలయాలు మూసివేతకు దారి తీసిన పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులపై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని సక్రమంగా నడపడానికి అవకాశం లేకుండా రిపబ్లికన్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా బిల్లులు ఆమోదించాలని, డ్రామాలు ఆడకుండా ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్‌కు సూచించారు. ‘ఈ షట్‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగితే పరిస్థితులు ఘోరంగా మారతాయి. చాలా కుటుంబాలు ఇబ్బంది పడతాయి.’ అని చెప్పారు. అందుకే బడ్జెట్‌కు ఆమోదం తెలిపి సంక్షోభానికి తెరదించాలని కాంగ్రెస్‌ను కోరారు. కానీ, రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు మాత్రం దీనికి ససేమిరా అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ఆర్థిక వ్యవస్థపై భారీగా భారం మోపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా షట్‌డౌన్‌కు ముగింపు పలకడానికి బుధవారం చర్చల కోసం కాంగ్రెస్ సభ్యుల్ని ఒబామా వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. మరోవైపు బడ్జెట్ విషయంలో రిపబ్లికన్స్, డెమోక్రాట్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అమెరికా షట్‌డౌన్ రెండో రోజూ కొనసాగింది. లక్షలాది మంది ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పరిశోధన సంస్థ ఎన్‌ఐహెచ్‌లో షట్‌డౌన్ ప్రభావంతో కేన్సర్ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. 75 శాతం మంది ఉద్యోగులు సెలవుల్లో ఉండడంతో కొత్త పేషెంట్లను ఎన్‌ఐహెచ్ అనుమతించట్లేదు. షట్‌డౌన్ ప్రభావం వల్ల వచ్చే వారం జరగాల్సిన ఒబామా మలేసియా, ఫిలిప్పీన్స్ పర్యటన రద్దయింది.