మన కుటుంబమే మన జీవితం. ఏ పని చేసినా... ఎంత కష్టపడినా అది కుటుంబం కోసమే. వారి ఆనందంలోనే మన ఆనందాన్నీ వెతుక్కుంటాం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఊహించని మలుపులెన్నో ఉంటాయి. మరి అనుకోకుండా మనకు జరగరానిదేమైనా జరిగితే? మనల్ని నమ్ముకున్న... మనపై ఆధారపడిన కుటుంబ సభ్యుల మాటేంటి? వారి బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానమే.... బీమా పాలసీ!!. అలాంటి ఆరోగ్య బీమా పాలసీ గురించి ఒకసారి తెలుసుకుందాం.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి తదితర కారణాల వల్ల కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. మరోవైపు నాణ్యమైన వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. మంచి హాస్పిటల్‌లో వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకు తలకు మించిన భారమే. ఎందుకంటే ఆ ఆసుపత్రి వసూలు చేసే చార్జీలు అధికంగా ఉంటున్నాయి. వీటన్నిటి నుంచీ రక్షణనిచ్చేదే ఆరోగ్య బీమా. కొన్ని రకాల పాలసీలు ఆరోగ్య బీమాతో పాటు జీవిత బీమాను కూడా అందిస్తున్నాయి. ఆరోగ్య బీమా తీసుకునే ముందు...
మన అవసరాలకు తగ్గ పాలసీని ఎంచుకోవటం అన్నిటికన్నా ప్రధానం. సాధారణంగా 50 ఏళ్ల వయసు నుంచి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాగని అప్పుడు పాలసీ తీసుకుంటే చార్జీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వయసుకు ముందే ఆరోగ్య బీమా తీసుకోవాలి. మీరు తీసుకునే పాలసీలో ఆసుపత్రి గది అద్దె, ఐసీయూ చార్జీలు, సర్జన్ల ఫీజు, డాక్టర్ల ఫీజు, అనస్తీషియా, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ చార్జీలను బీమా కంపెనీ చెల్లించేలా ఉండాలి. ఈ ఖర్చులపై ఎలాంటి పరిమితులు ఉండని పాలసీ తీసుకోవడం ఉత్తమం. కాకుంటే ఈ పాలసీల ప్రీమియం కాస్త అధికంగా ఉంటుంది.పెరుగుతున్న వైద్య ఖర్చులకు అనుగుణంగా బీమా సంస్థ పాలసీ కవర్‌ను ఎప్పటికప్పుడు పెంచేలా ఉండాలి.
బీమా కంపెనీ హాస్పిటల్ నెట్‌వర్క్ తప్పనిసరిగా విస్తృతంగా ఉండాలి. బీమా కంపెనీతో అనుసంధానమైన హాస్పిటల్స్ ఎక్కువ ప్రాంతాల్లో ఉంటే పాలసీదారుకు ఉపయుక్తంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో పాలసీదారుల సౌలభ్యం కోసం బీమా కంపెనీలు ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుంది. కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు మూడేళ్లకు ఒకసారి హెల్త్ చెకప్ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. దాగిన ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి రెగ్యులర్ చెకప్ చాలా అవసరం. పాలసీకి ముందు, పాలసీ తర్వాత వచ్చిన ఆరోగ్య సమస్యలకు పాలసీ వర్తిస్తుందా? లేదా? వంటి అంశాలను ముందు గానే తెలుసుకోవాలి.
మీ ఆరోగ్యం మాటేంటి?
Published Mon, Jun 1 2015 3:58 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM
Advertisement
Advertisement