సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య బీమా పాలసీల విషయంలో బీమా కంపెనీలు, వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది. పాలసీదారుడు మృతి చెందిన ఓ కేసులో అతని భార్యకు బీమా సొమ్ము చెల్లించి ఇంటి రుణాన్ని మాఫీ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అధికారులు నిరాకరించడాన్ని ఫోరం తప్పుబట్టింది. పాలసీ తీసుకునే నాటికే కేన్సర్ ఉందన్న విషయాన్ని మృతుడు దాచిపెట్టి పాలసీ తీసుకున్నారని, అందువల్ల అతనికి బీమా సొమ్ము ఇవ్వాల్సిన అవసరంలేదన్న ఎస్‌బీఐ వాదనను తోసిపుచ్చింది.
ఇదీ కేసు..
విజయవాడకు చెందిన జి.శేషగిరిరావు 2012లో ఫ్లాట్ కొనుగోలు చేశారు. దీనిని తాకట్టు పెట్టి ఎస్‌బీఐ నుంచి ఆయన రూ.22 లక్షల రుణం తీసుకున్నారు. ఇందుకు ఎస్‌బీఐ అతనికి రూ.24,45,000 విలువైన జీవిత బీమా పాలసీ కూడా ఇచ్చింది. పాలసీ ఇచ్చే సమయంలో శేషగిరిరావుకు వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం 2014 లో శేషగిరిరావు కేన్సర్‌తో మృతి చెందారు. దీంతో అతని భార్య విజయకుమారి బీమా సొమ్ము కోసం క్లెయిమ్ దరఖాస్తు సమర్పించారు. ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని కోరారు. పాలసీ తీసుకునే నాటికి మృతుడు కేన్సర్‌తో బాధపడుతున్నారని, ఈ విషయాన్ని దాచిపెట్టారని, అందువల్ల డబ్బు ఇవ్వడం సాధ్యంకాదని ఎస్‌బీఐ అధికారులు ఆమె దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఆమె ఏపీ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీనిపై జస్టిస్ నౌషద్ ఆలీ, పి.ముత్యాలనాయుడులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
రాజ్యాంగ హక్కును హరించడమే..
‘బీమా కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచు కునేందుకే ఆశలు చూపుతాయి. తీరా క్లెయి మ్‌లు చెల్లించాల్సి వచ్చేటప్పటికీ భిన్నంగా వ్యవహరిస్తాయి. ప్రతీ క్లెయిమ్‌ను అనుమానిస్తాయి. ఆసుపత్రులు, డాక్టర్ల వద్దకు వెళ్లి రోగి వ్యక్తిగత సమాచారాన్ని సంపాదిస్తుంటాయి. ఎంతో నమ్మకంతో రోగి చెప్పే వివరాలను వైద్యులు బహిర్గతం చేయడం చట్టవిరుద్ధమే కాక.. అనైతికం కూడా. గోప్యత హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
పూర్తి పరీక్షలు చేయకుండా ఎవరు ఆపారు?
‘పాలసీ తీసుకునేటప్పుడు మృతుడు తనకు కేన్సర్ ఉందన్న విషయం దాచిపెట్టాడని, అందువల్ల అతనికి వర్తింపజేయాల్సిన ప్రయోజనాలను ఇవ్వాల్సిన అవసరంలేదని బీమా కంపెనీ చెబుతోంది. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించకుండా బీమా కంపెనీని ఎవరూ ఆపలేదు. పాలసీదారుకు ముందే కేన్సర్ ఉందని నిరూపించాల్సిన బీమా సంస్థ.. అది చేయకుండా క్లెయిమ్‌ను తిరస్కరించడం సరికాదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. మృతుని భార్యకు బీమా సొమ్ముతోపాటు ఇంటి రుణాన్ని మాఫీచేసి ‘నో డ్యూ’సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. మానసిక వేదన కల్గించినందుకు ఆమెకు రూ.లక్ష పరిహారంతోపాటు రూ.25 వేలను ఖర్చుల కింద చెల్లించాలని చెప్పింది.
బీమా సొమ్ము ఇచ్చి రుణమాఫీ చేయండి
Published Tue, Aug 7 2018 3:08 AM | Last Updated on Tue, Aug 7 2018 5:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment