దేశీయంగా ఆరోగ్య సంరక్షణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్న నేపథ్యంలో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం తీసుకోవడంతో పాటు మీ ఆర్థిక స్థితిని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇందుకోసం హెల్త్ ఇన్సూరెన్స్ సైతం మీకు తోడ్పడుతుంది. ఇది కేవలం వైద్యం ఖర్చులకే ఉపయోగపడటం కాకుండా మీకు పన్ను ప్రయోజనాలు కూడా అందిస్తుంది.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమాతో మీరు ఏటా రూ. 75,000 వరకు పన్నులపరంగా ఆదా చేసుకునే వీలుంది. మీ స్వంతానికి, జీవిత భాగస్వామి, పిల్లలు, మీపై ఆధారపడిన తల్లిదండ్రుల ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలపై మీరు డిడక్షన్స్‌ను క్లెయిమ్ చేయొచ్చు. వయస్సుపరమైన మినహాయింపు పరిమితులను తెలుసుకోవడం, సరైన రికార్డులను దగ్గర ఉంచుకోవడం ద్వారా పన్నులపరమైన ప్రయోజనాలను పొందేందుకు వీలుంటుంది.
ఇక క్రిటికల్ ఇల్‌నెస్ బీమా కూడా మరో కీలకమైనది. నిర్దిష్టమైన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు నిర్ధారణ అయితే, ఇది ఒకేసారి చెల్లింపును అందిస్తుంది. ఆరోగ్యపరంగా అనూహ్య ప్రతికూలతల నుంచి సమగ్ర రక్షణను అందించే ఈ రకమైన బీమా కోసం చెల్లించే ప్రీమియంలకు కూడా సెక్షన్ 80డీ కంద పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. మరోవైపు, సెక్షన్ 80డి కింద మొత్తం పరిమితిలో రూ.5000 దాకా ప్రివెంటివ్ ఆరోగ్య పరీక్షల కోసం పెట్టిన ఖర్చులను తీసివేయడానికి కూడా వీలుంటుంది. ప్రివెంటివ్ హెల్త్‌కేర్ ప్రాధాన్యతను, పన్ను ప్రయోజనాలను వివరంగా తెలియజేయడం ద్వారా తరచుగా చెకప్‌లు చేయించుకునేలా, ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు సాధ్యపడుతుంది.
దేశీయంగా చాలా మటుకు సంస్థలు ఉద్యోగులకు ప్రయోజనాల ప్యాకేజీ కింద ఆరోగ్య బీమాను అందిస్తున్నాయి. ఇలాంటి పాలసీల కోసం యజమానులు చెల్లించే ప్రీమియంలు, సాధారణంగా ఉద్యోగులకు పన్నురహితంగా ఉంటాయి. అయితే, ఉద్యోగులు తమకు లేదా తమ కుటుంబాల కోసం వ్యక్తిగతంగా అదనపు కవరేజీ తీసుకున్నట్లయితే వారు కట్టే ప్రీమియంలకు సెక్షన్ 80డీ కింద డిడక్షన్ లభించగలదు.
అటు మొత్తం కుటుంబానికి ఒకే ప్లాన్‌లో కవరేజీ ఇచ్చేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత ప్లాన్‌లతో పోలిస్తే వీటిల్లో డబ్బు ఆదా చేసేందుకు అవకాశం ఉంది. వీటికి కట్టే ప్రీమియంలకు కూడా సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపులు ఉంటాయి.
ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 80 ఈ కింద రూ. 75,000 వరకు పన్ను ప్రయోజనాలు అందు బాటులో ఉన్నాయి. పన్ను చట్టాలలో మార్పుకు లోబడి (స్వీయ/భార్య/భర్త/తమపై ఆధారపడిన పిల్లలకు రూ. 25,000 మరియు సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు రూ. 50,000) ఇవి ఉంటాయి.
పథకాన్ని ఎంచుకోవడం కీలకం
ఆరోగ్య బీమా పాలసీలనేవి అనారోగ్యం వేళ ఆర్థిక భరోసాగా నిలవడమే కాకుండా మీ పన్ను భారాన్ని కూడా తగ్గించుకునేందుకు ఉపయోగపడగలవు. సెక్షన్ 80డీ తో మీ పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. కనుక, మీరు అలాగే మీ కుటుంబం ఆర్థిక స్వేచ్ఛ సాధించే దిశగా వెళ్లే క్రమంలో సరైన ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం..
Comments
Please login to add a commentAdd a comment