
సాక్షి, ముంబై: కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు నవంబర్ 26న జరగనున్న ఒక రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. ఈ సమ్మెలో తామూ పాల్గొంటామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించింది. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నిర్ణయించామని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇటీవల నిర్వహించిన లోక్‌సభ సెషన్లో 'ఈజీ ఆఫ్ బిజినెస్' పేరిట మూడు కొత్త కార్మిక చట్టాలను ఆమోదించిందని, ప్రస్తుత 27 చట్టాలను తుంగలో తొక్కి పూర్తిగా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ కొత్త చట్టాలను తీసుకొస్తోందని ఏఐబీఈఏ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. తద్వారా 75 శాతం మంది కార్మికులను చట్టపరిధిలోంచి తప్పించి వారికి రక్షణ లేకుండా కేంద్రం చేస్తోందని ఆరోపించింది. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల జాతీయ కార్మిక సదస్సు పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా పది కేంద్ర కార్మిక సంఘాలు నవంబర్ 26 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహించనున‍్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment