సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు డిసెంబర్ 26న సమ్మెను చేపట్టనున్నారు. బ్యాంక్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌ల విలీనానికి నిరసనగా ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. డిసెంబర్ 26న సమ్మె చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ), ఆల్ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఇఏ) వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇతర బ్యాంకుల విలీనం ఆర్‌బీఐకు ఎలాంటి లాభదాయకం కానందున మరిన్ని బ్యాంకుల విలీనం మంచి పరిణామం కాదని యూనియన్స్ వాదిస్తున్నాయి. మరోవైపు డిసెంబరు నాలుగవ వారంలో అటు సెలవులు, ఇటు బంద్ నేపథ్యంలో ఈ ప్రభావం సామాన్యులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజా విలీనం బ్యాంకింగ్ పరిశ్రమలో ఉపాధి అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి హెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామాలు బ్యాంకింగ్ సేవలను కోరుకుంటున్న క్రమంలో ఏకీకరణ చర్య అవాంఛనీయమన్నారు. ఈ దేశవ్యాప్త సమ్మెలో పది లక్షలమంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు.
బ్యాంకు సెలవులను ఒకసారి పరిశీలిద్దాం :
డిసెంబర్ 22 - 4వ శనివారం సెలవు
డిసెంబర్ 23 - ఆదివారం సెలవు
డిసెంబర్ 24 - సోమవారం బ్యాంకులు పని చేస్తాయి.
డిసెంబర్ 25 - మంగళవారం క్రిస్మస్ సెలవు
డిసెంబర్ 26 - బుధవారం బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
Comments
Please login to add a commentAdd a comment