banks merge
-
గళమెత్తిన బ్యాంకు ఉద్యోగులు
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): జాతీయ బ్యాంకుల విలీన ప్రక్రియను నిరసిస్తూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు బ్యాంకింగ్ రంగాన్ని పరిరక్షించాలంటూ ప్రదర్శనలు చేశారు. బ్యాంకుల ఎదుట డిమాండ్లతో కూడిన నినాదాలతో ధర్నా చేశారు. సమ్మెలో ఉన్న బ్యాంకు ఉద్యోగులు బృందాలుగా బయలుదేరి పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను మూయించివేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె ప్రభావం బ్యాంకుల లావాదేవీలపై పడింది. ప్రధాన బ్యాంకులుగా ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంకులు సమ్మెలో ఉండటంతో ప్రధానంగా ఈ బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలకు విఘాతం కలిగింది. ఏటీఎంలు మాత్రం పనిచేశాయి. వందల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు సాగలేదు. ఏ కార్యకలాపాలు జరుగకుండా బ్యాంకు ఉద్యోగుల సంఘాల నాయకులు వాహనాలలో బ్యాంకుల వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. పనిచేస్తున్న బ్యాంకులను మూయించారు. జిల్లాలోని దాదాపు అన్ని పట్టణాలలో బ్యాంకుల లావాదేవీలకు అవరోధం ఏర్పడింది. బ్యాంకింగ్ రంగాన్ని పరరక్షించుకోవాలి బ్యాంకింగ్ రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, ప్రజలు కూడా ఈ విషయంలో బ్యాంకు ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించాలని సమ్మె సందర్భంగా తాడేపల్లిగూడెంలో ధర్నాలు, ప్రదర్శనలు చేసిన నాయకులు కోరారు. తాడేపల్లిగూడెం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద జరిగిన ప్రదర్శనను ఉద్దేశించి నాయకులు ప్రసంగించారు. నాయకులు మాట్లాడుతూ 135 కోట్ల జనాభాకల దేశం, దీంతో పాటు వ్యవసాయరంగం ప్రధానమైన దేశంలో ప్రజలకు సేవల కోసం బ్యాంకు శాఖలను విస్తరించాల్సి ఉందన్నారు. బ్యాంకు శాఖలు విస్తరించాల్సింది పోయి బ్యాంకుల విలీనాల వల్ల వేల సంఖ్యలో బ్రాంచిలు మూతపడతాయన్నారు. ఒక పక్క మొండి బకాయిల పేరుతో లక్షల కోట్లు కార్పొరేట్ , బడా పారిశ్రామిక వేత్తలకు రుణాలు రద్దు చేయడానికి ఉత్సాహపడుతున్న ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ లేదని నాయకులు విమర్శించారు. సామాన్య ఖాతాదారులు బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్లుగా దాచుకొనే వారైతే, బడా కార్పొరేట్లు లక్షల కోట్లు రుణాలు తీసుకొని ఎగవేస్తున్నారన్నారు. సామాన్యులు దాచుకొనే డిపాజిట్లపై వడ్డీలు తగ్గించడం దారుణమన్నారు. బడా వ్యాపారులకు వడ్డీరేట్లు తగ్గించడం వారికి లాభదాయకమన్నారు. డిపాజిట్లపై వడ్డీలు పెంచాలని డిమాండ్ చేశారు. మొండి బకాయిల రికవరీకి చట్ట సవరణ చేయాలని కోరారు. బ్యాంకు విలీనాల ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రిటైర్టు ఉద్యోగులకు పెన్షన్ రివైజ్ చేయాలని, ఉద్యోగుల మెడికల్ ఇన్సూ్యరెన్సు ప్రీమియం తగ్గించాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తోట సూర్యనారాయణ, కో–ఆర్డినేషన్ కమిటీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ ప్రసాద్, సెంట్రల్ బ్యాంకు యూనియన్ నాయకులు వీఎల్ఎన్ శాస్త్రి, బి.ఏడుకొండలు, పాలూరి సత్యనారాయణ, శీతాళం నారాయణమూర్తి, కుమారస్వామి తదితరులు నాయకత్వం వహించారు. తాడేపల్లిగూడెం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ధర్నా చేస్తున్న బ్యాంకు ఉద్యోగులు -
విలీనం వెతలు
ఆర్థిక రంగం నుంచి రోజుకో ప్రమాద ఘంటిక వినిపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల్ని విలీనం చేసి, వాటిని నాలుగు బ్యాంకులుగా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 12కి తగ్గింది. ఈ విలీనం వల్ల బ్యాంకుల పనితీరు మెరు గుపడటంతోపాటు వాటి నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని, అవి పెద్ద వ్యాపార సంస్థలకు అప్పు లిచ్చే స్తోమత సంతరించుకుంటాయని, మొండి బాకీల సమస్యను అధిగమించగలుగుతాయని, వృద్ధికి ఊతం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వీటితోపాటు బహిరంగ మార్కెట్లో వాటికి నిధులు సేకరణ కూడా ఇకపై సులభమవుతుందని అంటున్నది. మన బ్యాంకులు ఎన్ని సమస్య లతో సతమతమవుతున్నాయో అందరికీ తెలుసు. అందులో ప్రధానమైనది పారు బాకీలైతే, మూల ధన కొరత, విస్తరణ వగైరాలు ఇతరత్రా సమస్యలు. ముప్పు ముంచుకొస్తున్నప్పుడు ఏదో ఒకటి చేసినట్టు కనబడటం కాక, నికార్సయిన పని చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బ్యాంకుల విలీ నం చర్య పూర్తిగా నిరర్థకమైనదని ఎవరూ అనరు. కానీ అలా విలీనం చేయక తప్పని పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయో, వాటి మూలాలెక్కడున్నాయో, ఏం చేస్తే అవి విరగడవుతాయో ప్రభు త్వాలెప్పుడూ ఆలోచించినట్టు కనబడదు. అలా ఆలోచించి ఉంటే బ్యాంకుల రుణ వితరణలో రాజ కీయ జోక్యం ఎప్పుడో ఆవిరయ్యేది. అది లేకపోబట్టే బ్యాకులు నిస్సహాయ స్థితిలో పడ్డాయి. అంతక్రితం పూర్తిగా లేదని చెప్పలేంగానీ... దాదాపు 20 ఏళ్లుగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడం, ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టడం అనే ధోరణి పెరిగింది. రఘురాం రాజన్ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఇలాంటి ఎగవేతదార్ల నుంచి బ్యాంకులకు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నదని ప్రకటించారు. అంతక్రితం యూపీఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమైనా ఆ మాదిరి చర్యకు ఉపక్రమించిన సూచనలు లేవు. రాజకీయ ఒత్తిళ్లతో వెనకా ముందూ చూడకుండా రుణాలిచ్చి నిస్సహాయ స్థితిలో పడిన బ్యాంకులు ఓ పెద్ద బ్యాంకులో విలీనం కావడం వల్ల ఆ బరువు బదిలీ అవుతుంది తప్ప మాయం కాదు. కనుక విలీనం కన్నా ముందు ఆ రుణాలిచ్చే తీరును మార్చడం, బకాయిలను రాబట్టుకోవడానికి కఠిన చర్యలకు ఉపక్రమించడం అత్యవసరం. ఆ పని ఫలితాలనివ్వడం ప్రారంభించాక విలీనం చేసినా అందువల్ల ఎంతో కొంత ప్రయోజనం సిద్ధిస్తుంది. బకాయిలు అధికంగా ఉన్న బ్యాంకులకు కొత్తగా రుణాలిచ్చే అవకాశాన్ని కుదించే విధంగా రిజర్వ్ బ్యాంకు కొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇది అమలయ్యాక బకాయిలు రాబట్టడంలో బ్యాంకులు పురోగతి సాధించాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. మంచిదే. కానీ అందువల్ల వాటి వ్యాపా రానికి అవరోధాలు కూడా ఏర్పడ్డాయని గుర్తించుకోవాలి. నిర్దిష్ట శాతానికి మించి బకాయిలున్న బ్యాంకులు కొత్తగా రుణాలివ్వరాదని ఆంక్షలు పెట్టడంతో వాటి వ్యాపారం స్తంభించిపోయింది. ఒక సంస్థకు రుణం ఇచ్చే ముందు దాని కార్యకలాపాలు వ్యాపారపరంగా లాభదాయకమో కాదో అవగాహన చేసుకుని, నిర్వాహకుల గత చరిత్రేమిటో, వారి సామర్థ్యమేమిటో తెలుసుకుని రుణాలు మంజూరు చేస్తే బ్యాంకులకు నష్టాల శాతం ఎక్కువుండదు. ఇలా వృత్తిగత నైపుణ్యంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా మదింపు వేసుకునే అవకాశం బ్యాంకులకు ఉంటే వాటిమధ్య వ్యాపారపరమైన పోటీ పెరుగుతుంది. శరవేగంతో అవి విస్తరించగలుగుతాయి. మన దేశంలో బ్యాంకుల్ని జాతీయం చేసి 50 ఏళ్లు కావస్తోంది. కానీ ఏనాడూ తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోవడం వల్ల చాలా బ్యాంకులు తమ సామర్థ్యాన్ని సంపూర్ణంగా నిరూపించుకోలేకపోయాయి. కొన్ని బ్యాంకులు పడకేశాయి. ఇప్పుడు విలీనాల వల్ల ఇతరత్రా అంశాలమాటెలా ఉన్నా, పోటీతత్వం మందగిస్తుంది. ఇంతక్రితం రెండు దఫాలు బ్యాంకు విలీనాలు జరిగాయి. కానీ అందువల్ల బ్రహ్మాండం బద్దలైన జాడలేదు. దాని సంగ తలా ఉంచి ఇప్పుడు ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న వేళ విలీనం సాహసమనే చెప్పాలి. ఈ ప్రక్రి యంతా పూర్తికావడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది కాలం పడుతుందంటున్నారు. ఈ కాలమంతా ఆ బ్యాంకులు తమ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించలేవు. రుణ వితరణ ద్వారా మార్కెట్ పుంజుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఇంత పెద్ద ప్రక్రి యను తలకెత్తుకోవడంలోని తర్కం బోధపడదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం చాలా యాంత్రికంగా జరుగుతున్నదని ఇంతక్రితం జరిగిన విలీనాలు నిరూపించాయి. వాటిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆ ధోరణిలో ఏమాత్రం మార్పురాలేదని తాజా నిర్ణయాన్ని చూస్తే అర్ధమవుతుంది. నిజాం కాలంనాటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాలగర్భంలో కలిసిపోయింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఏర్పడిన మూడు బ్యాంకుల పరిస్థితి కూడా అంతే. 1930లనాటి ఆర్థిక మాంద్యంలో ఆవిర్భవించిన విజయాబ్యాంకు ఇంతక్రితం మాయంకాగా, 1906 మార్చిలో ఏర్పడిన కార్పొరేషన్ బ్యాంకు, అదే ఏడాది జూన్‌లో పురుడుపోసుకున్న కెనరాబ్యాంక్, అంతకు కొంచెం ముందు రంగంలోకొచ్చిన సిండికేట్ బ్యాంకు తాజా విలీనం జాబితాలో ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమ నాయకుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య చొరవతో 1923లో ఆవిర్భవించి తెలుగు ప్రజల మనోభావాలతో పెనవేసుకున్న ఆంధ్రా బ్యాంకు సైతం కనుమరుగవుతోంది. అది కొన్నేళ్లుగా నష్టాలతో ఉన్న మాట వాస్తవమైనా, ఇప్పు డిప్పుడే వాటినుంచి కోలుకొని లాభాల బాట పడుతోంది. ఇతర బ్యాంకులకు ఆదర్శప్రాయంగా ఉంది. దాని వెనకున్న జాతీయోద్యమ చరిత్రను గౌరవించి, దానికిగల కోలుకునే సామర్థ్యాన్ని గుర్తించి ఆంధ్రాబ్యాంకును అలాగే ఉంచి మరో బ్యాంకును అందులో విలీనం చేసి ఉంటే బాగుం డేది. కానీ విలీనంపై తప్ప మరి దేనిపైనా పాలకులకు ధ్యాస ఉన్నట్టు లేదు. ఇది సరైంది కాదు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె : వరుస సెలవులున్నాయా?
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు డిసెంబర్ 26న సమ్మెను చేపట్టనున్నారు. బ్యాంక్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌ల విలీనానికి నిరసనగా ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. డిసెంబర్ 26న సమ్మె చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ), ఆల్ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఇఏ) వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇతర బ్యాంకుల విలీనం ఆర్బీఐకు ఎలాంటి లాభదాయకం కానందున మరిన్ని బ్యాంకుల విలీనం మంచి పరిణామం కాదని యూనియన్స్ వాదిస్తున్నాయి. మరోవైపు డిసెంబరు నాలుగవ వారంలో అటు సెలవులు, ఇటు బంద్ నేపథ్యంలో ఈ ప్రభావం సామాన్యులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. తాజా విలీనం బ్యాంకింగ్ పరిశ్రమలో ఉపాధి అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి హెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామాలు బ్యాంకింగ్ సేవలను కోరుకుంటున్న క్రమంలో ఏకీకరణ చర్య అవాంఛనీయమన్నారు. ఈ దేశవ్యాప్త సమ్మెలో పది లక్షలమంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. బ్యాంకు సెలవులను ఒకసారి పరిశీలిద్దాం : డిసెంబర్ 22 - 4వ శనివారం సెలవు డిసెంబర్ 23 - ఆదివారం సెలవు డిసెంబర్ 24 - సోమవారం బ్యాంకులు పని చేస్తాయి. డిసెంబర్ 25 - మంగళవారం క్రిస్మస్ సెలవు డిసెంబర్ 26 - బుధవారం బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె -
ఉపకారానికి ‘ఐఎఫ్ఎస్సీ’ బ్రేకులు
సాక్షి, హైదరాబాద్ : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాల పంపిణీలో కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి. 2016–17, 2017–18 విద్యా సంవత్సరాలకు చెందిన ఉపకారవేతన నిధులను ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. ఈక్రమంలో వాటిని విద్యార్థుల ఖాతాకు ఆన్లైన్ ద్వారా బదిలీ చేస్తుం డగా మెజారిటీ ఖాతాలకు ఈ ప్రక్రియ విఫలమవుతోంది. దరఖాస్తు సమయంలో వివరాలన్నీ పూరిం చినప్పటికీ ఆన్లైన్ బదిలీల్లో విఫలం కావడం ఇబ్బందికరంగా మారుతోంది. లోపం ఎక్కడుందనే అంశంపై అధికారులు ఆరా తీయగా బ్యాంకుల ఐఎఫ్ ఎస్సీ కోడ్లలో తప్పులు దొర్లినట్లు గుర్తిం చారు. వాస్తవానికి విద్యార్థులంతా దరఖాస్తులప్పుడు సరైన కోడ్లే ఇచ్చినా బ్యాంకుల విలీనప్రక్రియతో అవి మారిపోయాయి. మెజారిటీ ఖాతాల న్నీ ఎస్బీఐలోనే రాష్ట్రంలో లీడ్ బ్యాంక్‌గా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కొనసాగుతోంది. గతం లో ఈ స్థానంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఉండగా విలీనంతో ఇప్పుడు ఎస్బీఐ లీడ్ బ్యాంక్‌గా మారింది. దీంతో ఎస్బీహెచ్ శాఖల ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారిపోయాయి. రాష్ట్రంలో మెజారిటీ విద్యార్థులు స్టేట్‌బ్యాంకు ఖాతాలనే తెరిచారు. పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఇతర బ్యాంకు ఖాతాలు తెరిచినప్పటికీ గ్రామీణ విద్యార్థులకు మాత్రం 91శాతం స్టేట్‌బ్యాంకు ఖాతాలే ఉన్నాయి. ఈక్రమంలో 2016–17 విద్యాసంవత్సరంలో ఫ్రెషర్స్, రెన్యువల్ విద్యార్థులు దరఖాస్తుల్లో నమోదు చేసిన స్టేట్‌బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్లు 78 శాతం మారిపోయాయి. అదేవిధంగా 2017–18 సంవత్సరంలో కోడ్లు మారినప్పటికీ విద్యార్థులకు అవగాహన లేక పాత వాటినే నమోదు చేశారు. ప్రస్తుతం 2016–17 విద్యా సంవత్సరం ఉపకారవేతన బకాయిలను సంక్షేమాధికారులు చెల్లింపులు చేస్తున్నారు. ఈమేరకు టోకెన్లు జనరేట్ చేసి ఖజానా శాఖకు పంపుతున్నారు. ఖజానా శాఖ అధికారులు బ్యాంకు ఖాతాలకు నగదును బదిలీ చేసే క్రమంలో ప్రక్రియ విఫలమవుతుండటంతో ఆయా ఫైళ్లను జిల్లా సంక్షేమాధికారులకు తిప్పి పంపిస్తున్నారు. ప్రస్తుతం 2016–17 సంవత్సరానికిగాను 3.75లక్షల మంది విద్యార్థులకు ఉపకార నిధులు పంపిణీ చేయాలి.అలాగే 2017–18 కి 7.58లక్షల మందికి చెల్లించాల్సి ఉంది. ఐఎఫ్ఎస్సీ కోడ్లు తప్పుగా ఉండటంతో ఆయా విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కోడ్లను సరిచేసుకున్న తర్వాతే పంపిణీ చేయనున్నారు. -
మార్చిలోపు విలీనం లేనట్లే!
• అనుబంధ బ్యాంకుల విలీనంపై • ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య • ప్రభుత్వ ఆమోదానికి నిరీక్షిస్తున్నట్లు వెల్లడి ముంబై: తొలుత భావించినట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో దాని అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 మార్చి) ముగిసేలోపు పూర్తయ్యేట్లు కనిపించడం లేదు. ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య స్వయంగా ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపారు. విలీనం దిశలో ముందడుగుకు ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆమోదానికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ విడుదలైన తరువాతే, విలీన ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పగలుగుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం విలీనం పూర్తవుతుందనీ ఆమె సూచనప్రాయంగా తెలిపారు. సోమవారం ఇక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘బహుశా విలీన ప్రక్రియ ఒక త్రైమాసిక కాలం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే, ఇందుకు ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది. మేము ఇందుకు ఎదురుచూస్తున్నాము. ఒకవేళ ఇప్పటికిప్పుడు ప్రభుత్వ ఆమోదం వచ్చినా, చివరి త్రైమాసికంలో విలీనం పూర్తికావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఐటీ సిస్టమ్స్‌లో మార్పులు ఇందులో ప్రధానమైనవి. సాధారణంగా ఐటీ సిస్టమ్స్‌లో ఏదైనా మార్పులు చేయాల్సివస్తే, ఫిబ్రవరి మధ్య కల్లా ఈ ప్రక్రియ బ్యాంకింగ్‌లో పూర్తవుతుంది. ఈ ప్రక్రియ అంతా ఇప్పటికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా పూర్తికావాలన్నది మా విధానం. విలీన పక్రియకు సంబంధించిన అడ్డంకులు ఆయా అంశాల్లో ఇప్పుడు నెలకొనకూడదని భావిస్తున్నాం’’ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. రియల్టీపై దృష్టి...: రియల్టీ అభివృద్ధికి సంబంధించి తగిన చౌక ధర గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడానికి బిల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని భట్టాచార్య తెలిపారు. ‘‘రేటు కోత నిర్ణయం తీసుకున్నంత మాత్రాన, డిమాండ్ లేదా వృద్ధి పెరిగిపోతుందని నేను విశ్వసించను. ఈ దిశలో విజయానికి మరెన్నో నిర్ణయాలు తీసుకోవాలి’ అన్నారు. కొత్త ప్రొడక్టులు: కాగా గృహ రుణ వృద్ధి లక్ష్యంగా మూడు కొత్త ప్రొడక్టులను ప్రారంభించనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఎస్బీఐ బ్రిడ్జ్ లోన్స్, ఇన్స్ట్రా హోమ్ టాప్–అప్ లోన్స్‌తో పాటు వేతన యేతర వినియోగదారులకు ఒక ప్రొడక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వీరు వెల్లడించిన సమాచారం ప్రకారం, బ్రిడ్జ్ లోన్ మొదటి యేడాది వడ్డీరేటు 10.45 శాతం ఉంటుంది. రెండవ ఏడాది 11.45 శాతంగా ఉంటుంది. ఇన్స్ట్రా హోమ్ టాప్–అప్ లోన్ రుణ రేటు 9 శాతం. 8–9 శ్రేణిలో రుణ వృద్ధి రేటు లక్ష్యం... బ్యాంక్ తాజా 0.9 శాతం రేటు కోత నిర్ణయం రుణ వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నట్లు భట్టాచార్య తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ రుణ వృద్ధి రేటు 8 శాతం నుంచి 9 శాతం ఉంటుందని భావిస్తున్నట్లు భట్టాచార్య ఈ సందర్భంగా అన్నారు. ‘‘తొలుత మేము రుణ వృద్ధి రేటు లక్ష్యాన్ని 11 నుంచి 12 శాతంగా పెట్టుకున్నాం. నవంబర్, డిసెంబర్లో భారీ క్షీణత తరువాత, రుణ వృద్ధి ఇప్పటివరకూ 6.7–6.8 శాతం శ్రేణిలోనే ఉంది. రేటు కోత నేపథ్యంలో రుణ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం కనీసం 8 నుంచి 9 శాతం శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నాం’’ అని అన్నారు. ఆదివారం నాటి రేటు కోత విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ, ‘‘ఇది ద్రవ్య లభ్యతను పెంచే నిర్ణయం. మున్నెన్నడూ లేనంతగా ప్రస్తుతం వ్యవస్థలో ద్రవ్యపరిస్థితి ఉంది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో తగ్గించినదానికన్నా ఒకటిన్నర రెట్లు రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాం’’ అని అరుంధతీ భట్టాచార్య అన్నారు. డిపాజిట్ రేట్లూ కోత!? రుణ రేట్లలో 90 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు కొత్త సంవత్సర కానుకగా ప్రకటించిన ఎస్బీఐ, తదనంతరం డిపాజిట్‌దారులకు షాక్ ఇచ్చే పరిస్థితీ కనబడుతోంది. డిపాజిట్ రేట్ల మీదా త్వరలో దృష్టి సారించనున్నట్లు ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంక్‌ల వద్ద పెద్ద ఎత్తున నగదు డిపాజిట్లు ఉన్నందున, డిపాజిట్ రేటు కోత యోచన చేస్తున్నట్లు తెలిపారు. ‘‘పెద్ద నోట్ల రద్దు అనంతరం తక్కువ వడ్డీకి లోబడిన డిపాజిట్లు భారీగా బ్యాంకుల వద్దకు వచ్చాయి. అయితే నిబంధనలు తొలగించిన తర్వాత వీటిలో కొంత వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. కాగా 40 శాతం పరిమాణం మాత్రం బ్యాంక్ వద్దే కొనసాగుతుందని భావిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మేము డిపాజిట్ రేటు కోత గురించి ఆలోచిస్తాం’’ అని భట్టాచార్య అన్నారు.