ప్రతీకాత్మక చిత్రం
ఆర్థిక రంగం నుంచి రోజుకో ప్రమాద ఘంటిక వినిపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల్ని విలీనం చేసి, వాటిని నాలుగు బ్యాంకులుగా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 12కి తగ్గింది. ఈ విలీనం వల్ల బ్యాంకుల పనితీరు మెరు గుపడటంతోపాటు వాటి నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని, అవి పెద్ద వ్యాపార సంస్థలకు అప్పు లిచ్చే స్తోమత సంతరించుకుంటాయని, మొండి బాకీల సమస్యను అధిగమించగలుగుతాయని, వృద్ధికి ఊతం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వీటితోపాటు బహిరంగ మార్కెట్‌లో వాటికి నిధులు సేకరణ కూడా ఇకపై సులభమవుతుందని అంటున్నది. మన బ్యాంకులు ఎన్ని సమస్య లతో సతమతమవుతున్నాయో అందరికీ తెలుసు.
అందులో ప్రధానమైనది పారు బాకీలైతే, మూల ధన కొరత, విస్తరణ వగైరాలు ఇతరత్రా సమస్యలు. ముప్పు ముంచుకొస్తున్నప్పుడు ఏదో ఒకటి చేసినట్టు కనబడటం కాక, నికార్సయిన పని చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బ్యాంకుల విలీ నం చర్య పూర్తిగా నిరర్థకమైనదని ఎవరూ అనరు. కానీ అలా విలీనం చేయక తప్పని పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయో, వాటి మూలాలెక్కడున్నాయో, ఏం చేస్తే అవి విరగడవుతాయో ప్రభు త్వాలెప్పుడూ ఆలోచించినట్టు కనబడదు. అలా ఆలోచించి ఉంటే బ్యాంకుల రుణ వితరణలో రాజ కీయ జోక్యం ఎప్పుడో ఆవిరయ్యేది. అది లేకపోబట్టే బ్యాకులు నిస్సహాయ స్థితిలో పడ్డాయి.
అంతక్రితం పూర్తిగా లేదని చెప్పలేంగానీ... దాదాపు 20 ఏళ్లుగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడం, ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టడం అనే ధోరణి పెరిగింది. రఘురాం రాజన్ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఇలాంటి ఎగవేతదార్ల నుంచి బ్యాంకులకు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నదని ప్రకటించారు. అంతక్రితం యూపీఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఎన్‌డీఏ ప్రభుత్వమైనా ఆ మాదిరి చర్యకు ఉపక్రమించిన సూచనలు లేవు. రాజకీయ ఒత్తిళ్లతో వెనకా ముందూ చూడకుండా రుణాలిచ్చి నిస్సహాయ స్థితిలో పడిన బ్యాంకులు ఓ పెద్ద బ్యాంకులో విలీనం కావడం వల్ల ఆ బరువు బదిలీ అవుతుంది తప్ప మాయం కాదు. కనుక విలీనం కన్నా ముందు ఆ రుణాలిచ్చే తీరును మార్చడం, బకాయిలను రాబట్టుకోవడానికి కఠిన చర్యలకు ఉపక్రమించడం అత్యవసరం.
ఆ పని ఫలితాలనివ్వడం ప్రారంభించాక విలీనం చేసినా అందువల్ల ఎంతో కొంత ప్రయోజనం సిద్ధిస్తుంది. బకాయిలు అధికంగా ఉన్న బ్యాంకులకు కొత్తగా రుణాలిచ్చే అవకాశాన్ని కుదించే విధంగా రిజర్వ్ బ్యాంకు కొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇది అమలయ్యాక బకాయిలు రాబట్టడంలో బ్యాంకులు పురోగతి సాధించాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. మంచిదే. కానీ అందువల్ల వాటి వ్యాపా రానికి అవరోధాలు కూడా ఏర్పడ్డాయని గుర్తించుకోవాలి. నిర్దిష్ట శాతానికి మించి బకాయిలున్న బ్యాంకులు కొత్తగా రుణాలివ్వరాదని ఆంక్షలు పెట్టడంతో వాటి వ్యాపారం స్తంభించిపోయింది. ఒక సంస్థకు రుణం ఇచ్చే ముందు దాని కార్యకలాపాలు వ్యాపారపరంగా లాభదాయకమో కాదో అవగాహన చేసుకుని, నిర్వాహకుల గత చరిత్రేమిటో, వారి సామర్థ్యమేమిటో తెలుసుకుని రుణాలు మంజూరు చేస్తే బ్యాంకులకు నష్టాల శాతం ఎక్కువుండదు.
ఇలా వృత్తిగత నైపుణ్యంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా మదింపు వేసుకునే అవకాశం బ్యాంకులకు ఉంటే వాటిమధ్య వ్యాపారపరమైన పోటీ పెరుగుతుంది. శరవేగంతో అవి విస్తరించగలుగుతాయి. మన దేశంలో బ్యాంకుల్ని జాతీయం చేసి 50 ఏళ్లు కావస్తోంది. కానీ ఏనాడూ తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోవడం వల్ల చాలా బ్యాంకులు తమ సామర్థ్యాన్ని సంపూర్ణంగా నిరూపించుకోలేకపోయాయి. కొన్ని బ్యాంకులు పడకేశాయి. ఇప్పుడు విలీనాల వల్ల ఇతరత్రా అంశాలమాటెలా ఉన్నా, పోటీతత్వం మందగిస్తుంది.
ఇంతక్రితం రెండు దఫాలు బ్యాంకు విలీనాలు జరిగాయి. కానీ అందువల్ల బ్రహ్మాండం బద్దలైన జాడలేదు. దాని సంగ తలా ఉంచి ఇప్పుడు ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న వేళ విలీనం సాహసమనే చెప్పాలి. ఈ ప్రక్రి యంతా పూర్తికావడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది కాలం పడుతుందంటున్నారు. ఈ కాలమంతా ఆ బ్యాంకులు తమ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించలేవు. రుణ వితరణ ద్వారా మార్కెట్ పుంజుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఇంత పెద్ద ప్రక్రి యను తలకెత్తుకోవడంలోని తర్కం బోధపడదు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం చాలా యాంత్రికంగా జరుగుతున్నదని ఇంతక్రితం జరిగిన విలీనాలు నిరూపించాయి. వాటిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆ ధోరణిలో ఏమాత్రం మార్పురాలేదని తాజా నిర్ణయాన్ని చూస్తే అర్ధమవుతుంది. నిజాం కాలంనాటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాలగర్భంలో కలిసిపోయింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఏర్పడిన మూడు బ్యాంకుల పరిస్థితి కూడా అంతే. 1930లనాటి ఆర్థిక మాంద్యంలో ఆవిర్భవించిన విజయాబ్యాంకు ఇంతక్రితం మాయంకాగా, 1906 మార్చిలో ఏర్పడిన కార్పొరేషన్ బ్యాంకు, అదే ఏడాది జూన్‌లో పురుడుపోసుకున్న కెనరాబ్యాంక్, అంతకు కొంచెం ముందు రంగంలోకొచ్చిన సిండికేట్ బ్యాంకు తాజా విలీనం జాబితాలో ఉన్నాయి.
స్వాతంత్య్రోద్యమ నాయకుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య చొరవతో 1923లో ఆవిర్భవించి తెలుగు ప్రజల మనోభావాలతో పెనవేసుకున్న ఆంధ్రా బ్యాంకు సైతం కనుమరుగవుతోంది. అది కొన్నేళ్లుగా నష్టాలతో ఉన్న మాట వాస్తవమైనా, ఇప్పు డిప్పుడే వాటినుంచి కోలుకొని లాభాల బాట పడుతోంది. ఇతర బ్యాంకులకు ఆదర్శప్రాయంగా ఉంది. దాని వెనకున్న జాతీయోద్యమ చరిత్రను గౌరవించి, దానికిగల కోలుకునే సామర్థ్యాన్ని గుర్తించి ఆంధ్రాబ్యాంకును అలాగే ఉంచి మరో బ్యాంకును అందులో విలీనం చేసి ఉంటే బాగుం డేది. కానీ విలీనంపై తప్ప మరి దేనిపైనా పాలకులకు ధ్యాస ఉన్నట్టు లేదు. ఇది సరైంది కాదు.
Comments
Please login to add a commentAdd a comment